Let's talk: editor@tmv.in
మున్సిపల్ ఎన్నికల వేళ శాంతిభద్రతలపై డీజీపీ శివధర్ రెడ్డి సమీక్ష

మున్సిపల్ ఎన్నికల వేళ శాంతిభద్రతలపై డీజీపీ శివధర్ రెడ్డి సమీక్ష

Gaddamidi Naveen
5 ఫిబ్రవరి, 2026

తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భద్రతా చర్యలు, శాంతి భద్రతల ఏర్పాట్లపై రాష్ట్ర డీజీపీ ఐపీఎస్ శివధర్ రెడ్డి హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలు చట్టబద్ధంగా, ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేలా అన్ని స్థాయిల్లో పోలీసులు కట్టుదిట్టంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలు, ఎన్నికలు జరగనున్న ప్రాంతాల స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కొత్తగూడెం, కరీంనగర్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నిజామాబాద్, నల్గొండ, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని 414 వార్డులు, అలాగే 116 మున్సిపాలిటీల్లోని మొత్తం 2,582 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయని డీజీపీ తెలిపారు.

ఫిబ్రవరి 11న పోలింగ్, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ మొత్తం ఎన్నికల నిబంధనల ప్రకారం సాగాలని, ఎలాంటి ఫిర్యాదులు లేదా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీస్ శాఖకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని గుర్తు చేశారు.

సమావేశంలో హైదరాబాద్ పోలీస్ లీగల్ అడ్వైజర్ రాములు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన చట్టపరమైన అంశాలను వివరించారు. ఓటర్లను ప్రభావితం చేయడం, బెదిరించడం, నిర్దిష్ట అభ్యర్థికి ఓటు వేయాలని బలవంతం చేయడం, నామినేషన్ల దాఖలును అడ్డుకోవడం వంటి చర్యలు తీవ్రమైన నేరాలని, వీటికి కఠిన శిక్షలు విధించబడతాయని ఆయన హెచ్చరించారు. అలాగే బాధితులపై సామాజిక లేదా ఆర్థిక బహిష్కరణ విధించినా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.

ఎన్నికల సమయంలో మద్యం పంపిణీ చేయడం లేదా శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఎక్సైజ్ చట్టాన్ని ఉల్లంఘిస్తే ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. ఆయుధాల చట్టం ప్రకారం లైసెన్స్ కలిగిన ఆయుధదారులు తమ ఆయుధాలను తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లలో జమ చేయాలని, అలా చేయకపోతే ఒకటి నుంచి మూడు సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష విధించవచ్చని పేర్కొన్నారు.

ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని డీజీపీ ఆదేశించారు. ప్రజా స్థలాల వికృతీకరణ చట్టం–1997 ప్రకారం గోడలపై అనధికారిక పోస్టర్లు అతికించడం, అసభ్య ప్రకటనలు ప్రదర్శించడం నేరమని, వాటిని తొలగించి బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు టౌన్ న్యూసెన్స్ యాక్ట్‌ను కఠినంగా అమలు చేయాలని, పోలీసుల అనుమతి లేకుండా లౌడ్‌స్పీకర్లు వాడటం శిక్షార్హమని తెలిపారు.

ఎన్నికల ప్రచార వాహనాల విషయంలో మోటార్ వెహికిల్స్ చట్టం–1988 ప్రకారం పలు ఆంక్షలు అమల్లో ఉన్నాయని, రిటర్నింగ్ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకుని ఆ పత్రాన్ని వాహనం ముందు భాగంలో స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు. మత సంస్థలు లేదా ప్రార్థనా స్థలాలను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించడం మత సంస్థల దుర్వినియోగ నివారణ చట్టం–1988 ప్రకారం తీవ్రమైన నేరమని, కులాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

ప్రజా సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపుల కోసం జిల్లా పోలీస్ చట్టం ప్రకారం ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని, పోలీసుల సూచనలను ఉల్లంఘించి ప్రజాజీవనానికి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం–2019 ప్రకారం ఎన్నికల విధులను అడ్డుకోవడం, రిగ్గింగ్ వంటి అక్రమాలకు పాల్పడితే శిక్ష తప్పదని డీజీపీ స్పష్టం చేశారు.