Let's talk: editor@tmv.in
మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ‘సిట్’ ముందుకు రాలేను: కేసీఆర్‌

మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ‘సిట్’ ముందుకు రాలేను: కేసీఆర్‌

Pinjari Chand
30 జనవరి, 2026

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ నోటీసులకు బదులిచ్చారు. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా సిట్ ముందుకు రాలేను. మున్సిపల్ అభ్యర్థుల జాబితా ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నాను. విచారణ కోసం మీకు అనువుగా ఉన్న మరో తేదీని తెలుపగలరన్నారు. అలాగే ఎర్రవల్లి నివాసంలోనే విచారణ చేయాలని సూచించారు. గురువారం నోటీసులు అందించిన నేపథ్యంలో ఆయన పై విధంగా స్పందించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా వ్వవహరిస్తోంది. ఈ కేసులో సంబంధమున్న అధికారులను ఇప్పటికే విచారించి జైల్లోకి పంపింది. అయితే అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ముఖ్యనాయకులను ఇప్పుడు విచారణ చేస్తోంది. అయితే ఈ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు కూడా సిట్ నోటీసులు పంపింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న తెలంగాణ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) కు నోటీసులు జారీ చేసింది. జనవరి 30న విచారణకు హాజరుకావాలని ఎస్ఐటీ ఆదేశించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎస్ఐటీ నోటీసులో కేసీఆర్ వయసు 65 ఏళ్లు దాటినందున, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ) సెక్షన్ 160 ప్రకారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు రావచ్చో లేదా హైదరాబాద్‌లో తనకు అనుకూలమైన స్థలాన్ని సూచించవచ్చని పేర్కొంది.

ఇప్పటికే ఈ కేసులో భాగంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, కేసీఆర్ తనయుడు కేటీఆర్ (కే.టి. రామారావు) జనవరి 23న, సీనియర్ ఎమ్మెల్యే టి. హరీష్‌రావు జనవరి 20న ఎస్ఐటీ ఎదుట హాజరై విచారణకు లోనయ్యారు. మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్​ రావును కూడా విచారించింది. వీరితో పాటు పలువురు బీఆర్‌ఎస్ నేతలను కూడా ఇటీవల ఎస్ఐటీ ప్రశ్నించింది.

ఈ కేసు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయవ్యవస్థకు చెందిన వారు, ప్రముఖ వ్యక్తుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలకు సంబంధించినదిగా పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న తెలంగాణ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ టి. ప్రభాకర్‌రావును ఎస్ఐటీ ఇప్పటికే విచారించింది. అలాగే తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ)కు చెందిన ఒక సస్పెండెడ్ డీఎస్పీ సహా నలుగురు పోలీసు అధికారులను హైదరాబాద్ పోలీసులు మార్చి 2024 నుంచి అరెస్టు చేశారు. వీరు ఎలక్ట్రానిక్ పరికరాల్లోని ఇంటెలిజెన్స్ సమాచారాన్ని తొలగించడం, అక్రమ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై అరెస్టయ్యారు. అనంతరం వారికి బెయిల్ లభించింది.

చట్టం ముందు అందరూ సమానమే

ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్‌ లోక్‌సభ సభ్యుడు మల్లు రవి స్పందిస్తూ, పోలీసులు దర్యాప్తు సందర్భంగా సేకరించిన ఆధారాల ప్రకారమే చర్యలు తీసుకుంటారని అన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని, దర్యాప్తులో భాగంగానే కేసీఆర్‌ను విచారణకు పిలిచినట్టు చెప్పారు.