
మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం మేయర్ పీఠాలు కాంగ్రెస్‌వే: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 85 నుంచి 90 శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్ బంజారా భవన్‌లో జరిగిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన, ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత రెండేళ్లుగా తమ ప్రభుత్వం అందిస్తున్న పాలనకు ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలు నా ప్రభుత్వ పాలనకు ఒక అగ్ని పరీక్ష వంటివి. ప్రజలు మాకు 80 శాతం సీట్లు ఇస్తారని నేను గతంలోనే చెప్పాను. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే 90 శాతం వరకు పీఠాలు మాకే దక్కుతాయని నమ్మకంగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. కొన్ని పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నప్పటికీ, తమ ప్రయత్నంలో ఎలాంటి లోటు లేదని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని తండాలకు బీటీ రోడ్లు నిర్మించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు.
బీఆర్ఎస్ పార్టీ పేరు ఎత్తకుండానే ప్రతిపక్షంపై ముఖ్యమంత్రి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా ప్రతిపక్షానికి ఇంకా బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ పాలనను చూసిన ప్రజలు విజ్ఞతతో వారిని గద్దె దించారు. కానీ ప్రతిపక్ష పార్టీ తమ తప్పులను తెలుసుకోకుండా, ప్రజలే తమకు ఓటు వేయలేదని వారిని నిందించడం సరికాదు అని ఆయన మండిపడ్డారు.నేడు జరగబోయే మేయర్, చైర్మన్ల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేస్తుందని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
నేను ఎప్పుడూ ఒక పాలకుడిలా ప్రవర్తించలేదని, కేవలం ఒక ప్రజా సేవకుడిగానే బాధ్యతలు నిర్వహిస్తున్నానని సీఎం పేర్కొన్నారు. 'నేను రాబోయే 20 ఏళ్ల పాటు క్రియాశీలకంగా ఉండి ప్రజలకు సేవ చేస్తాను' అని ఆయన అన్నారు.
నల్లమల అటవీ ప్రాంతంలో ‘సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్’ పుణ్యక్షేత్రం: సీఎం ప్రకటన
బంజారాల ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గిరిజన సోదరులకు తీపి కబురు అందించారు. ఆదివాసీలకు ఆదిలాబాద్‌లో నాగోబా, మేడారంలో సమ్మక్క - సారలమ్మ క్షేత్రాలు ఉన్నట్టుగానే, బంజారాల కోసం నల్లమల అటవీ ప్రాంతంలో అద్భుతమైన పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని ఆయన ప్రకటించారు.
బంజారాల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ పుణ్యక్షేత్రం ఉండబోతోందని సీఎం వెల్లడించారు. ఇందుకోసం నల్లమలలో ఇప్పటికే 20 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. వచ్చే ఏడాది 2027లో సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలను అక్కడే నిర్వహించేలా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీనిని కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా, ప్రపంచస్థాయి పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చెప్పారు.
తండాల సమగ్ర అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు
గిరిజన తండాల అభివృద్ధిపై సీఎం స్పష్టమైన హామీలు ఇచ్చారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని అన్ని తండాలు, గూడాలకు తప్పనిసరిగా బీటీ రోడ్లు నిర్మించాలని పేర్కొన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో పాఠశాల భవనం, పంచాయతీ భవనం ఉండాలని, తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో విద్యుత్ సమస్య ఉన్న చోట సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు."మానవజాతి శాంతి మార్గంలో నడవాలని బోధించిన సేవాలాల్ మహరాజ్ 15 కోట్ల మంది గిరిజనులకు ఆదర్శం. అలాంటి మహనీయుని జయంతిని అధికారికంగా నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత.ష అని సీఎం తెలిపారు.
గిరిజనులకు గౌరవం - విద్యే మార్గం
తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో లంబాడా సోదరుల పాత్ర మరువలేనిదని, 2006 నుంచి వారు తనకు అండగా నిలుస్తున్నారని సీఎం గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వం వద్ద పంపిణీ చేయడానికి భూములు లేవని, అందుకే పేదరికం నుంచి బయటపడాలంటే విద్య ఒక్కటే మార్గమని ఆయన ఉద్బోధించారు. గిరిజన విద్యార్థులు కష్టపడి చదువుకుని అవకాశాలను అందిపుచ్చుకోవాలని, వారి కోసం ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ పోరిక బలరాం నాయక్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు బంజారాల ఉత్పత్తులను పరిశీలించిన సీఎం, సేవాలాల్ మహరాజ్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.
