Let's talk: editor@tmv.in
మున్సిపల్ ఎన్నికల్లో 80 శాతానికి పైగా స్థానాలు మావే: మంత్రి పొన్నం ప్రభాకర్

మున్సిపల్ ఎన్నికల్లో 80 శాతానికి పైగా స్థానాలు మావే: మంత్రి పొన్నం ప్రభాకర్

Gaddamidi Naveen
12 ఫిబ్రవరి, 2026

తెలంగాణలో బుధవారం ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌పై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రవ్యాప్తంగా 80 శాతానికి పైగా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ఆయన ప్రకటించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి ప్రజాస్వామ్య వాతావరణాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశాయని ఆయన ఆరోపించారు. పలు ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తూ భౌతిక దాడులకు దిగారని, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్నారు. నిజామాబాద్ ఎంపీ పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఉద్రిక్తతలు సృష్టించారని కూడా మంత్రి ఆరోపించారు.

గత పదేళ్లలో మున్సిపాలిటీల అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చలేకపోయిన బీజేపీ, ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని మంత్రి విమర్శించారు. ప్రజా పాలన ప్రభుత్వంగా గత రెండు సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ, సన్న బియ్యం పంపిణీ, రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, రైతు భరోసా, రైతు రుణమాఫీ వంటి పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

ఎన్నికల సమయంలో బీజేపీ పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తూ మున్సిపాలిటీల అభివృద్ధి తమ వల్లే సాధ్యమని చెబుతుండటం ఆశ్చర్యకరమని ఆయన అన్నారు. కేంద్రంలో సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ పట్టణ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నికలను అపహాస్యం చేసేలా పోలీసులు, ఓటర్లపై దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు. గత 12 ఏళ్లుగా ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పటికైనా మీ హామీలను నెరవేర్చడానికి కేంద్రం నుంచి నిధులు తీసుకురండి, రాష్ట్ర ప్రభుత్వం అమలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుందని మంత్రి సవాల్ విసిరారు.

ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారని, పంచాయతీ ఎన్నికల మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగురుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో చేసిన అభివృద్ధిని పట్టణ ప్రాంతాల్లో కూడా కొనసాగిస్తామని చెప్పారు. బీజేపీ ఇచ్చిన హామీలను అమలు చేయించే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుందని, కేంద్రం తెలంగాణకు తగిన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మొత్తంగా ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు.