Let's talk: editor@tmv.in
మున్సిపల్ ఎన్నికల్లో పవార్ వర్గాల ఐక్యత

మున్సిపల్ ఎన్నికల్లో పవార్ వర్గాల ఐక్యత

Pinjari Chand
30 డిసెంబర్, 2025

మహారాష్ట్రలోని మున్సిపల్ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దశాబ్దాల తరబడి శివసేనకు దూరమున్న రాజ్ ఠాక్రే, ఉద్దవ్ ఠాక్రే కలిసి కూటమిగా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బరిలో దిగనున్నారు. అలాగే పవార్ లు కూడా ఏకమయ్యారు. కీలకమైన పుణె, పింప్రి–చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు వర్గాలు మరోసారి కలిసి పోటీ చేయనున్నాయి. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ, శరద్ చంద్ర పవార్ వర్గం (ఎన్‌సీపీ–ఎస్‌సీపీ) ఈ ఎన్నికల కోసం చేతులు కలపడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ఈ విషయాన్ని ఎన్‌సీపీ–ఎస్‌సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ సోమవారం మీడియాకు వెల్లడించారు. అయితే ఈ కూటమి ఏర్పాటులో పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ ప్రత్యక్షంగా పాల్గొలేదని ఆయన స్పష్టం చేశారు.

రోహిత్ పవార్ మాట్లాడుతూ ఇది పూర్తిగా స్థానిక కార్యకర్తల అభిప్రాయాల ఆధారంగా తీసుకున్న నిర్ణయం. పుణెలో పార్టీ కార్యకర్తలతో ఎంపీ సుప్రియా సూలే విస్తృతంగా చర్చలు జరిపారు. అలాగే పింప్రి–చించ్వాడ్‌లోని కార్యకర్తల అభిప్రాయాలు కూడా తెలుసుకున్నారు. కార్యకర్తల ఆలోచనలు, వారి సమస్యలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే రెండు వర్గాలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించామని తెలిపారు. అయితే ఈ కూటమి ఉన్నప్పటికీ, రెండు పార్టీలు తమ తమ పార్టీ గుర్తులపైనే పోటీ చేస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం కేవలం పుణె, పింప్రి–చించ్వాడ్ మున్సిపల్ ఎన్నికలకే పరిమితం అని, రాష్ట్రవ్యాప్తంగా ఇదే విధానం కొనసాగదని చెప్పారు.

ఇక ఈ విషయంపై స్పందించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, పింప్రి–చించ్వాడ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఈ కూటమిని కుటుంబ ఐక్యతకు ప్రతీకగా అభివర్ణించారు. స్థానిక స్థాయిలో పార్టీ బలాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల విషయంలో మాత్రం ఎన్‌సీపీ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే 37 మంది అభ్యర్థులతో తొలి జాబితాను కూడా పార్టీ విడుదల చేసింది.

మహారాష్ట్రలో పుణె, పింప్రి–చించ్వాడ్ సహా మొత్తం 27 మున్సిపల్ కార్పొరేషన్లకు 2026 జనవరి 15న పోలింగ్, జనవరి 16న ఫలితాలు వెలువడనున్నాయి.

మున్సిపల్ ఎన్నికల్లో పవార్ వర్గాల ఐక్యత - Tholi Paluku