
మున్సిపల్ ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్లకు కార్పొరేటర్లుగా అవకాశం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సమాజంలో అణగారిన వర్గాలకు, వృద్ధులకు, దివ్యాంగులకు భరోసా కల్పించే దిశగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం పలు విప్లవాత్మక ప్రతిపాదనలు చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పౌర సంస్థల్లో ట్రాన్స్‌జెండర్లకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో, వారిని కో–ఆప్టెడ్ కార్పొరేటర్లుగా నియమించే అంశాన్ని పరిశీలించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులకు సూచించారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్ వేదికగా దివ్యాంగుల పట్ల తనకున్న అంకితభావాన్ని చాటుకున్నారు.
వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన డే కేర్ సెంటర్లను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి, సమాజంలోని ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ట్రాన్స్‌జెండర్లలు ఎదుర్కొంటున్న సమస్యలను వారు స్వయంగా పాలక సంస్థల వేదికపై ప్రస్తావించేందుకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే మైనారిటీలకు జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీల్లో కో–ఆప్టెడ్ సభ్యులుగా అవకాశం కల్పిస్తున్న ఉదాహరణను గుర్తు చేశారు. అదే తరహాలో ప్రతి కార్పొరేషన్‌లో ఒక ట్రాన్స్‌జెండర్లని కార్పొరేటర్‌గా నామినేట్ చేస్తే, వారి స్వరం శాసన, పాలనా వ్యవస్థల్లో వినిపిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై వచ్చే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌తో పాటు ఇతర ప్రభుత్వ శాఖల్లో లింగమార్పిడి వ్యక్తులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఇది సామాజిక సమావేశం దిశగా తీసుకున్న కీలక అడుగని చెప్పారు. తెలంగాణలో పేదలకు వంద శాతం వైద్య సహాయం అందించాల్సిన అవసరం ఉంది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో సమగ్రమైన హెల్త్ పాలసీ తీసుకొస్తాం. తెలంగాణ సమాజం సామాజిక న్యాయం, సమాన అవకాశాలను కోరుకుంటోందని. అందులో భాగంగానే వందేళ్లుగా జరగని కుల గణనను విజయవంతంగా పూర్తి చేశాం. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణను పూర్తి చేశామని సీఎం తెలిపారు. విద్య, ఉద్యోగాల్లో దివ్యాంగులకు అవసరమైన రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా దివ్యాంగులు దివ్యాంగులను పెళ్లి చేసుకుంటే వారికి ఆర్థికంగా 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించిన్నాట్లు తెలిపారు.
వృద్ధుల సంరక్షణ - ప్రభుత్వ ఉద్యోగులపై కొరడా
ఇదే కార్యక్రమంలో వృద్ధుల సంక్షేమంపై కూడా ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. కొందరు వృద్ధులు తమ పిల్లల నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితులను నివారించేందుకు, వృద్ధుల సంరక్షణను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుంచి 10 నుంచి 15 శాతం వరకు కోత విధించేలా చట్టం తీసుకురానున్నట్లు తెలిపారు. ఆ మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే ప్రతిపాదన ఉందన్నారు. ఇది సమాజ పట్ల వారి బాధ్యతను గుర్తుచేసే చర్యగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ చట్టాన్ని రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.
‘ప్రణామ్’కార్యక్రమం - ఆరోగ్య విధానం
‘ప్రణామ్’ కార్యక్రమం కింద ఏర్పాటు చేస్తున్న వృద్ధుల డే కేర్ సెంటర్లు దేశంలోనే తొలిసారిగా అమలవుతున్నవని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి మెరుగైన వైద్య సేవలు అందించేలా ఒక సమగ్ర ఆరోగ్య విధానాన్ని కూడా బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించనున్నట్లు చెప్పారు.
కుల గణన విషయాన్ని ప్రస్తావించిన రేవంత్ రెడ్డి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వే ప్రభావంతోనే కేంద్ర ప్రభుత్వం జాతీయ జనగణనలో భాగంగా కుల గణనకు అంగీకరించిందని వ్యాఖ్యానించారు. అలాగే దివ్యాంగులందరికీ మాజీ కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు రీట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వాహనాలు, బ్యాటరీతో నడిచే త్రిచక్ర వాహనాలు తదితర సహాయక పరికరాలను ముఖ్యమంత్రి పంపిణీ చేశారు.
ట్రాఫిక్ చలాన్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
దేశ సరిహద్దుల్లో జరిగే యుద్ధాల కంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం రాష్ట్ర పోలీస్ శాఖ నిర్వహించిన రోడ్డు భద్రత కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి, రోడ్డు ప్రమాదాలను మానవ తప్పిదాల వల్ల జరిగే “హత్యలతో” పోల్చారు. ఒక్కో ప్రమాదంలోనే కొన్నిసార్లు 20 నుంచి 30 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇది సమాజానికి తీవ్ర నష్టం కలిగించే అంశమని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉల్లంఘించడం వంటి నేరాలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని రేవంత్ రెడ్డి సూచించారు.
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను తగ్గించి రోడ్డు భద్రతను బలోపేతం చేయాలనే లక్ష్యంతో, వాహన రిజిస్ట్రేషన్ సమయంలోనే వాహనాన్ని యజమాని బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించిన చలాన్ జారీ అయిన వెంటనే, సంబంధిత జరిమానా ఆటో–డెబిట్ విధానంలో నేరుగా బ్యాంక్ ఖాతా నుంచి కట్ అయ్యేలా వ్యవస్థను రూపొందించాలన్నారు.
ముఖ్యమంత్రి ట్రాఫిక్ పోలీసులు ముందుగా చలాన్లు విధించడంపై దృష్టి పెట్టకుండా వాహనదారులను నియంత్రించడం, అవగాహన కల్పించడం, నియమాలు పాటించేలా మార్గనిర్దేశం చేయడం ముఖ్యమని సూచించారు. ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెరిగితే ఉల్లంఘనలు స్వయంగా తగ్గుతాయని అభిప్రాయపడ్డారు.
అయితే నిబంధనల ఉల్లంఘన తీవ్రమైనప్పుడు తప్పనిసరిగా చలాన్లు విధించాల్సి వస్తే, వాటిపై ఎలాంటి రాయితీలు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. జరిమానా అనేది శిక్ష కాదు, భద్రత కోసం తీసుకునే చర్యగా ప్రజలు భావించేలా వ్యవస్థ ఉండాలని అన్నారు. ఈ ఆటో–డెబిట్ విధానం అమలులోకి వస్తే చలాన్ల వసూలు ప్రక్రియ సులభమవుతుందని, ఆలస్యాలు, వివాదాలు తగ్గుతాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలాగే ట్రాఫిక్ నియమాల పట్ల బాధ్యత పెరిగి, రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
గతంలో జరిగిన ఒక ఘటనను గుర్తు చేసిన ఆయన, బస్సును టిప్పర్ లారీ ఢీకొనడంతో సుమారు 20 మంది మృతి చెందిన ఘటనను ప్రస్తావించారు. అలాగే ప్రముఖుల పిల్లలు కూడా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన ఉదాహరణలు ఉన్నాయని, మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ కుమారుడి మృతి ఘటనను గుర్తు చేశారు. ప్రమాదాలు ఎవరికైనా జరుగుతాయన్న అవగాహన ప్రజల్లో పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
ఇప్పటికే డ్రగ్స్ నియంత్రణ, హైదరాబాద్‌లో చెరువులు, ప్రభుత్వ ఆస్తుల అక్రమ ఆక్రమణలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అదే విధంగా ట్రాఫిక్, రోడ్డు భద్రత విభాగాలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ముఖ్యంగా పాఠశాల పిల్లల్లో చిన్న వయసు నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడమే దీర్ఘకాలిక పరిష్కారమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
