Let's talk: editor@tmv.in
మున్సిపల్ ఎన్నికల్లో ‘క్లీన్ స్వీప్’ లక్ష్యంగా పనిచేయాలి: మంత్రి పొంగులేటి

మున్సిపల్ ఎన్నికల్లో ‘క్లీన్ స్వీప్’ లక్ష్యంగా పనిచేయాలి: మంత్రి పొంగులేటి

Gaddamidi Naveen
26 జనవరి, 2026

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఇల్లెందు, ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే ప్రతి కార్యకర్తకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో పార్టీ ప్రజాభిప్రాయమే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. పార్టీ పట్ల విధేయత, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. వారసత్వ రాజకీయాలకు కాంగ్రెస్‌లో చోటు లేదని, తన రక్త సంబంధీకులలో ఎవరికీ టికెట్లు ఇవ్వబోనని మంత్రి ప్రకటించారు.

శివరాత్రి లోపు ఎన్నికలు, కౌంటింగ్, ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్న మంత్రి, సమయం తక్కువగా ఉన్నందున పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతి వార్డులో పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు.

ఏదులాపురం, ఇల్లెందు మున్సిపాలిటీల అభివృద్ధికి ఇప్పటికే కోట్ల రూపాయల నిధులు కేటాయించామని, భవిష్యత్తులో మరింత భారీగా నిధులు తెచ్చి పట్టణాల రూపురేఖలు మార్చుతానని మంత్రి హామీ ఇచ్చారు. అభ్యర్థుల ఎంపికలో శాస్త్రీయంగా సర్వేలు నిర్వహిస్తున్నామని, రెండు మూడు బృందాలు క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నాయని తెలిపారు. ఆ సర్వే నివేదికల ఆధారంగానే బి-ఫారమ్‌లు జారీ చేస్తామని అన్నారు.

టికెట్లు రాని వారు నిరాశ చెందవద్దని, అసంతృప్తితో ఇతర పార్టీల వైపు వెళ్లవద్దని మంత్రి హెచ్చరించారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికీ భవిష్యత్తులో కో-ఆప్షన్ సభ్యులుగా లేదా ప్రభుత్వంలోని ఇతర పదవుల ద్వారా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. కార్యకర్తలే తన అసలైన బలమని, వారి కష్టమే తనకు గౌరవమని పేర్కొంటూ, నన్ను నమ్ముకున్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.