
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయఢంకా మోగిస్తుంది: మంత్రి జూపల్లి
రాష్ట్రంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయాన్ని సాధిస్తుందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపురంలో నిర్వహించిన చెన్నూరు, క్యాతనపల్లి మున్సిపాలిటీల కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని 10 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేస్తుందని, వార్డు మెంబర్లలో కనీసం 75 శాతం స్థానాలు గెలుచుకుంటామని అన్నారు.
టికెట్ల పంపిణీ విషయంలో పార్టీ బలోపేతానికి కష్టపడిన వారు, ప్రజాదరణ ఉన్న వారికే ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. టికెట్ రాని ఆశావహులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, పార్టీ కోసం నిజాయితీగా పనిచేసిన ప్రతి ఒక్కరికీ తగిన సమయంలో గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. రాబోయే రోజుల్లో అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి తెలిపారు.
ఆర్థిక ఇబ్బందుల్లోనూ సంక్షేమం
రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, గత ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూనే 'ఆరు గ్యారెంటీలను' అమలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని జూపల్లి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి గడపకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అదే సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన భారీ అప్పులు, అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని మంత్రి చెప్పారు.
రాబోయే మూడేళ్ల పాటు మాత్రమే కాదు, తదుపరి ఐదేళ్ల పాటు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని మంత్రి జూపల్లి ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
