
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్తగా మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. మరిపెడ, మహబూబాబాద్ జిల్లా కేంద్రాల్లో డోర్నకల్, మరిపెడ, ఇల్లందు, కేసముద్రం మున్సిపాలిటీలకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలు, అభ్యర్థులతో ఆయన వేర్వేరుగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు.
మరిపెడలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, డీసీసీ అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్ లతో కలిసి మంత్రి అభ్యర్థులతో ముఖాముఖి మాట్లాడారు. నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీల్లో వంద శాతం సీట్లు గెలుచుకోవాలని, నేతలందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. టికెట్ ఆశించి రాని వారు నిరాశ చెందకుండా, పార్టీ అభ్యర్థుల విజయానికి సహకరించాలని కోరారు. పార్టీ కోసం కష్టపడే వారికి భవిష్యత్తులో నామినేటెడ్ పదవుల ద్వారా తగిన గుర్తింపు లభిస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు మురళి నాయక్, కోరం కనకయ్య ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సర్వేల నివేదికల ఆధారంగానే అభ్యర్థులను ఖరారు చేశామని స్పష్టం చేశారు. ఏకాభిప్రాయం లేని వార్డుల్లో అభ్యర్థులతో నేరుగా చర్చించి వివాదాలను పరిష్కరించారు. పొత్తులో భాగంగా సీపీఐ పోటీ చేస్తున్న స్థానాల్లో కాంగ్రెస్-సీపీఐ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించాలని దిశానిర్దేశం చేశారు.
మహబూబాబాద్, ఇల్లందు, కేసముద్రం మున్సిపాలిటీల్లో పోటీ చేసే అభ్యర్థులకు డీసీసీ అధ్యక్షుల ద్వారా ఇప్పటికే బి-ఫామ్స్ అందజేశామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
