Let's talk: editor@tmv.in
ముత్తు రామలింగం దేవర్ జయంతి వేడుకల్లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్

ముత్తు రామలింగం దేవర్ జయంతి వేడుకల్లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్

Pinjari Chand
31 అక్టోబర్, 2025

తమిళనాడులో గురువారం రాజకీయ వాతావరణం సందడిగా మారింది. స్వతంత్ర సమరయోధుడు పసుంపోన్ ముత్తురామలింగం దేవర్ 118వ జయంతి, 63వ గురుపూజా వేడుకల సందర్భంగా పసుంపోన్ గ్రామం వద్ద నేతల రాకపోకలతో రద్దీగా మారింది. ఉపరాష్ట్రపతి సీ.పి. రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్, ప్రతిపక్ష నేతలు, పలు పార్టీలు పాల్గొని నివాళులు అర్పించారు.

దేవర్ నేతాజీకి అత్యంత విశ్వాసనీయ అనుచరుడు: ఉపరాష్ట్రపతి

దేవర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కి అత్యంత విశ్వసనీయ సహచరుడు. నేను ఆయనను కలిశాను. ఆయన జీవితంలో ఒక్క అబద్ధం చెప్పలేదు. ఆయన గొప్ప సాధువు. ఆయన తన రాజకీయ ప్రయాణంలో ఉన్నత ఆధ్యాత్మికతను అనుసరించారు. అదే ఆయన గొప్పతనం. ఆయన చెప్పినట్లుగానే నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదు అని నేను కూడా నమ్ముతాను. దేవర్ ఒక ఆధ్యాత్మిక మహానుభావుడు అంటూ, ఆయన జయంతి, వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడం మాకు గర్వకారణం అని ఉపాధ్యక్షుడు రాధాకృష్ణన్ ప్రశంసించారు.

పసుంపోన్ ముత్తురామలింగం దేవర్ జయంతి, వర్ధంతి రెండూ అక్టోబర్ 30నే జరుగుతాయి.(జననం: 30 అక్టోబర్ 1908– మరణం: 30 అక్టోబర్ 1963) అంటే ఆయన జన్మదినం, మరణదినం ఒకే తేదీన ఉండడంతో, ప్రతి సంవత్సరం తమిళనాడులో దేవర్ జయంతి, ఆయన మరణించిన రోజును గురుపూజగా ఒకేసారి జరుపుకుంటారు. ఈ ప్రత్యేకత వల్లే, ఈ రోజు రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మిక వేదికగా మారి అన్ని పార్టీలు ఆయనకు నివాళులు అర్పించే సంప్రదాయం ఏర్పడింది.

భారతరత్న ఇవ్వాలి: సీఎం స్టాలిన్

తర్వాత మాట్లాడిన సీఎం స్టాలిన్ దేవర్ సేవలను స్మరించారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టడానికి ఆయన చేసిన త్యాగం అపారమైనది. దేవర్‌ను సద్గుణం, ఐక్యత, ధైర్యాన్ని మూర్తీభవించిన గొప్ప పాండ్య రాజుగా ఆయన ప్రశంసించారు. ఆయన గౌరవార్థం పసుంపోన్ అభివృద్ధికి రూ.2 కోట్లు, కొత్త హాల్ నిర్మాణానికి రూ.1.55 కోట్లు వెచ్చించాం. దేవర్ పేరుతో కొత్త కళ్యాణ మండపం రూ.3 కోట్లతో నిర్మిస్తామని ప్రకటించారు. ఆయనను భారత త్న అవార్డు ఇవ్వాలని సిఫారసు చేస్తున్నాం అని ప్రకటించారు. కావేరి–గుండర్ నది లింక్ ప్రాజెక్ట్ ను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు వేగవంతం చేస్తుందని తెలిపారు. పసుంపోన్ మొత్తం పోలీసుల పహారాలో మారింది. రాధాకృష్ణన్ ప్రసంగంలో నేతాజీ ప్రస్తావన, స్టాలిన్ భారతరత్న సిఫారసు ప్రకటనలు ఈ ఏడాది దేవర్ జయంతిని రాజకీయంగా వేడెక్కించాయి

ఏఐడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి, బహిష్కృత నేత వీకే శశికళ, ఏఎంఎంకే నేత టిటివి దినకరన్, ఎండీఎంకే వ్యవస్థాపకుడు వైకో కూడా మధురైలో దేవర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వేదిక చుట్టూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. .