Let's talk: editor@tmv.in
ముడి పొగాకుపై జీఎస్టీని 28 శాతానికి తగ్గించాలి: నిర్మలా సీతారామన్‌కు ఏపీ మంత్రులు వినతి

ముడి పొగాకుపై జీఎస్టీని 28 శాతానికి తగ్గించాలి: నిర్మలా సీతారామన్‌కు ఏపీ మంత్రులు వినతి

Gaddamidi Naveen
22 జులై, 2026

రాష్ట్రంలో పొగాకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముడి పొగాకు (హెఎస్ఎన్ 2401)పై ప్రస్తుతం అమలులో ఉన్న 40 శాతం జీఎస్టీని 28 శాతానికి తగ్గించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను రాష్ట్ర మంత్రులు, ఎంపీలు కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నేతృత్వంలో ప్రతినిధి బృందం మంగళవారం పార్లమెంట్‌లో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేసింది.

ఈ సందర్భంగా రాష్ట్రంలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ప్రతినిధి బృందం, జీఎస్టీ పెంపు కారణంగా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న ఎఫ్‌సీవీ పొగాకు విలువపై ప్రతికూల ప్రభావం పడుతోందని వివరించింది. రైతుల ఆదాయాన్ని కాపాడటంతో పాటు పొగాకు వ్యాపారంలో స్థిరత్వం తీసుకురావాలంటే జీఎస్టీని 40 శాతం నుంచి 28 శాతానికి తగ్గించడం అవసరమని పేర్కొంది.

ఈ విజ్ఞప్తి కేవలం ముడి పొగాకు (హెఎస్ఎన్ 2401)కు మాత్రమే పరిమితమని, తయారైన పొగాకు ఉత్పత్తులకు ఎలాంటి సంబంధం లేదని ప్రతినిధి బృందం స్పష్టం చేసింది. జీఎస్టీ తగ్గింపు ద్వారా రైతులు, డీలర్లు, ఎగుమతిదారులకు గణనీయమైన ఊరట లభిస్తుందని, అంతర్జాతీయ మార్కెట్లో భారత పొగాకు ఎగుమతుల పోటీతత్వం కూడా మరింత బలోపేతం అవుతుందని కేంద్ర మంత్రికి వివరించింది. ఈ అంశాన్ని రైతుల ప్రయోజనాల దృష్ట్యా సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రతినిధులు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కోరారు.

ఈ సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస రాజు, రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎంపీలు దగ్గుబాటి పురంధేశ్వరి, లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బస్తీపాటి నాగరాజు, బీద మస్తానీ రావు తదితరులు పాల్గొన్నారు.