Let's talk: editor@tmv.in
ముగ్ధ జంక్షన్‌ వద్ద ‘హెచ్-సిటీ’ పనులు షురూ: ట్రాఫిక్ కష్టాలకు ఇక ఎండ్ కార్డ్!

ముగ్ధ జంక్షన్‌ వద్ద ‘హెచ్-సిటీ’ పనులు షురూ: ట్రాఫిక్ కష్టాలకు ఇక ఎండ్ కార్డ్!

Sirisha B
28 ఫిబ్రవరి, 2026

నగరంలో భవిష్యత్తు ట్రాఫిక్‌ అవసరాలకు అనుగుణంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'హైదరాబాద్‌ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్' (హెచ్‌-సిటీ) ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ముగ్ధ జంక్షన్ వద్ద నిర్మిస్తున్న స్టీల్ ఫ్లైఓవర్ పనులను నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జీహెచ్ఎంసీ, మెఘా ఇంజినీరింగ్ ప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులతో కలిసి నిర్మాణ ప్రాంతాన్ని పర్యవేక్షించి, పనుల పురోగతిపై దిశానిర్దేశం చేశారు.

రెండేళ్లలో 7 ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు

అనంతరం సీపీ మాట్లాడుతూ.. నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని రహదారుల వ్యవస్థను తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా కేబీఆర్ పార్క్ చుట్టూ సాఫీగా రాకపోకలు సాగించేలా రాబోయే రెండేళ్లలో మొత్తం ఏడు ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లను నిర్మించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, పోలీసు యంత్రాంగం సమన్వయంతో ప్రజలకు తక్కువ ఇబ్బంది కలిగేలా ఈ పనులను దశలవారీగా చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి నుంచే ముగ్ధ జంక్షన్ నుంచి కేబీఆర్ పార్క్ వైపు ఆరు పిల్లర్ల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.

రాత్రివేళల్లోనే పనులు.. వాహనదారులు సహకరించాలి

పగటిపూట వాహనదారులకు అంతరాయం కలగకుండా పనులను ముమ్మరంగా రాత్రివేళల్లోనే కొనసాగిస్తామని సీపీ స్పష్టం చేశారు. "పునాది పనులు పూర్తయ్యే వరకు మాత్రమే రహదారిపై కొద్దిపాటి అసౌకర్యం ఉంటుంది. ఆ తర్వాత వాహనాల రాకపోకలు యథావిధిగా సాగుతాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ ప్రాంతాలకు ప్రయాణం మరింత సులభతరం అవుతుంది" అని వివరించారు.

నిర్మాణ పనుల నేపథ్యంలో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు తమ ప్రయాణ సమయాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించారు. రద్దీని నివారించేందుకు వీలైనంత వరకు ప్రజా రవాణాను వినియోగించుకోవాలని కోరుతూ.. అవసరమైన చోట తాజా అడ్వైజరీలు జారీ చేస్తామని వెల్లడించారు.

వాహనదారులకు సూచనలు:

మాదాపూర్/హైటెక్ సిటీ నుండి: రోడ్ నంబర్ 45 మీదుగా వచ్చేవారు ముగ్ధ జంక్షన్ రద్దీని తప్పించుకోవడానికి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ లేదా రోడ్ నంబర్ 10 మీదుగా వెళ్లడం శ్రేయస్కరం.

ఫిలిం నగర్ నుండి: కేబీఆర్ పార్క్/రోడ్ నంబర్ 2 వైపు వెళ్లే వాహనాలను ముగ్ధ జంక్షన్ వద్ద పాక్షికంగా మళ్లిస్తారు. ఈ వాహనాలు భారతీయ విద్యాభవన్ మీదుగా రోడ్ నంబర్ 12 కి చేరుకోవచ్చు.

రాత్రి ప్రయాణాలు (11 PM - 5 AM): భారీ యంత్రాలతో పనులు జరుగుతున్నందున.. వాహనదారులు క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ లేదా ఒమేగా హాస్పిటల్ రూట్‌లను ఎంచుకోవాలి.

నో పార్కింగ్: ముగ్ధ జంక్షన్ చుట్టుపక్కల 500 మీటర్ల వరకు వాహనాలు నిలపడం నిషేధం.