
ముగ్గురు మంత్రులు.. 30 శాతం కమిషన్ వసూలు చేస్తున్నారు: కేటీఆర్
ఖమ్మం జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ నూతన సర్పంచులు, ఉప సర్పంచుల అభినందన సభ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గ్రామీణ ప్రజాప్రతినిధులకు ఉత్సాహం నింపేలా, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా ఆయన ప్రసంగం సాగింది.
ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రైతులకు ఎలాంటి యూరియా కొరత లేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియా కోసం రైతులు లైన్లలో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. షాపుల్లో లేని యూరియా యాప్‌లలో ఎలా కనిపిస్తోంది? అంటూ ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో ఎగవేతలు, కూల్చివేతలే తప్ప అభివృద్ధి కనిపించడం లేదని ఆరోపించారు. కౌలు రైతులకు ఇస్తామన్న ఆర్థిక సాయం ఏమైందని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా హామీ అమలైందా అని నిలదీశారు.
ఎగవేతలు, కూల్చివేతల సర్కార్
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కనిపించినది కూల్చివేతలు, ఎగవేతలే తప్ప అభివృద్ధి కాదని విమర్శించారు. ఇది పూర్తిగా సర్వభ్రష్ట ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం పనిచేసిందని, అదే లక్ష్యంతో సీతారామ సాగర్ ప్రాజెక్టును 90 శాతం వరకు పూర్తి చేసిందన్నారు. కానీ ప్రస్తుతం ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ రైతులకు యూరియా అందించలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.
ఆ ముగ్గురు మంత్రులు ప్రజాసేవకన్నా కమీషన్ల కోసమే పనిచేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. 30 శాతం కమిషన్ ట్యాక్స్ నడుస్తోంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గ్యారెంటీ కార్డును భద్రంగా దాచుకోవాలని చెప్పారని, కానీ రెండేళ్లు గడిచినా ఆరు గ్యారెంటీలు అమలుకాలేదని విమర్శించారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఓటమికి రంగం సిద్ధమైందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈసారి ఖమ్మం జిల్లాలో ఎగిరేది గులాబీ జెండానే, గెలిచేది కేసీఆరే అని పేర్కొన్నారు.
ఆర్మీ రవి విజయం - అహంకారంపై చావుదెబ్బ
అనంతరం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అహంకారానికి చావుదెబ్బ కొట్టి సర్పంచ్‌గా గెలిచిన ఆర్మీ రవిని కేటీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. కాంగ్రెస్ మంత్రి పొంగులేటి అరాచకాలు, పోలీసుల వేధింపులు భరించలేక ఒక దశలో ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్మీ రవి, నేడు ప్రజల మద్దతుతో సర్పంచ్‌గా గెలవడం ప్రజాస్వామ్యానికి నిదర్శనమని అన్నారు. ఇది ఒక్క వ్యక్తి విజయం కాదని, తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ దమనకాండను ఎదిరించిన ప్రజల విజయమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని, ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
