Let's talk: editor@tmv.in
ముగిసిన రో'హిట్' కెప్టెన్సీ శకం

ముగిసిన రో'హిట్' కెప్టెన్సీ శకం

Gangadhar Veerla
6 అక్టోబర్, 2025

భారత క్రికెట్ చరిత్రలో ఓ శకం ముగిసింది. టీమిండియాలో అత్యంత విజయవంతమైన వన్డే కెప్టెన్‌గా రాణించిన రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. క్రికెట్‌పై మమకారం ఉన్న ప్రతి అభిమాని గుండెను బరువెక్కిస్తున్న వార్త ఇది. కేవలం గణాంకాలు, విజయాలు మాత్రమే కాదు.. మైదానంలో 'హిట్ మ్యాన్’ అసాధారణ వ్యూహాలు, ప్రతి ఒక్కరినీ కలుపుకొనిపోయే నాయకత్వ శైలిని ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఐదు టైటిళ్లు అందించిన ఘన చరిత్ర కలిగిన రోహిత్, భారత వన్డే జట్టు పగ్గాలు చేపట్టిన తర్వాత కేవలం విజయాల శాతంలోనే కాకుండా, ముఖ్యమైన ఐసీసీ టోర్నీల్లో జట్టుకు దారి చూపడంలో కూడా తనదైన ముద్ర వేశారు.

రికార్డుల హిట్ మ్యాన్

రోహిత్ శర్మ నాయకత్వ శైలి ఎంత ప్రభావవంతమైనదో ఆయన గణాంకాలు స్పష్టంగా తెలియజేస్తాయి. పూర్తికాల కెప్టెన్‌గా 2021 డిసెంబర్‌లో బాధ్యతలు స్వీకరించిన రోహిత్, తక్కువ కాలంలోనే భారత క్రికెట్ చరిత్రలో అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా నిలిచారు. వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ మొత్తం 56 మ్యాచ్‌లు ఆడారు. 42 మ్యాచ్‌ల్లో భారత్‌ను విజయపథంలో నడిపించారు. 12 మ్యాచ్ ల్లో ఓడిపోయారు. ఒక మ్యాచ్ టై కాగా, మరొకటి ఫలితం తేలకుండా ముగిసింది. ఆయన విజయ శాతం 75. ఈ విజయ శాతం భారత క్రికెట్ చరిత్రలో మరే ఇతర కెప్టెన్‌కు సాధ్యం కాలేదు. దిగ్గజాలుగా భావించే విరాట్ కోహ్లీ (68.4 శాతం), ఎంఎస్ ధోని (55 శాతం) కంటే రోహిత్ రికార్డు మెరుగ్గా ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో కనీసం 50 వన్డేలకు సారథ్యం వహించిన కెప్టెన్లలో, వెస్టిండీస్‌కు చెందిన క్లైవ్ లాయిడ్ (77.71 శాతం) తర్వాత అత్యధిక విజయ శాతం రోహిత్ శర్మదే కావడం విశేషం.

రోహిత్ శర్మ నాయకత్వం అంటే కేవలం ద్వైపాక్షిక సిరీస్‌లను గెలవడం కాదు, మెగా టోర్నీలలో జట్టును విజయపథంలో నడిపించడం. 'హిట్‌ మ్యాన్' కెప్టెన్సీలో టీమిండియా గెలిచిన కొన్ని ముఖ్యమైన ట్రోఫీలను ఓసారి గమనిస్తే, స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా భారత్‌కు ఆసియా కప్ 2018 టైటిల్ అందించారు. పూర్తిస్థాయి కెప్టెన్‌గా మరోసారి ఆసియా కప్ 2023ని కైవసం చేసుకున్నారు. సొంత గడ్డపై జరిగిన 2023 ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్‌లో రన్నరప్ నిలిచారు. 12 ఏళ్ల తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని భారత్‌కు అందించారు. ఈ టోర్నీ ఫైనల్లో న్యూజిలాండ్‌పై రోహిత్ కీలకమైన 76 పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచారు. వన్డే కెప్టెన్‌గా నిష్క్రమించడానికి ముందు, ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌ను కూడా రోహిత్ సారథ్యంలో భారత్ గెలుచుకుంది. ముఖ్యంగా, ఐసీసీ టోర్నమెంట్లలో రోహిత్ విజయ శాతం 87.1గా ఉంది. ప్రపంచ క్రికెట్‌లో మరే ఇతర కెప్టెన్‌కు ఇంతటి అద్భుతమైన రికార్డు లేదు. 2023 వన్డే ప్రపంచ కప్‌లో కూడా జట్టును అజేయంగా ఫైనల్‌కు చేర్చడంలో రోహిత్ పాత్ర ఎనలేనిది.

పూర్తికాల కెప్టెన్సీ శకం (2022-2025)

రోహిత్ కెప్టెన్‌గా తొలి విజయం 2018 ఆసియా కప్‌లో దక్కింది. ఆ టోర్నీలో ఆయన 105.66 సగటుతో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలతో కలిపి 317 పరుగులు చేశారు. అయితే, అసలైన 'హిట్‌మ్యాన్ మ్యాజిక్' 2022 ప్రారంభంలో, విరాట్ కోహ్లీ కెప్టెన్సీని విడిచిపెట్టిన తర్వాత మొదలైంది. ఫిబ్రవరి 2022 నుండి, రోహిత్ పూర్తికాల వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత, టీమిండియా 46 మ్యాచ్‌లలో 34 గెలిచి కేవలం 10 మాత్రమే ఓడిపోయింది.

ఈ కాలంలో 46 వన్డేలలో రోహిత్ 45 ఇన్నింగ్స్‌లలో 47.87 సగటుతో, 116.84 స్ట్రైక్ రేట్‌తో 1,963 పరుగులు చేశారు. ఇందులో మూడు సెంచరీలు, 15 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కనీసం 20 వన్డేలకు సారథ్యం వహించిన కెప్టెన్లలో రోహిత్ కంటే మెరుగైన స్ట్రైక్ రేట్ మరెవరికీ లేదు. కెప్టెన్ల బ్యాటింగ్ సగటులలో, పాకిస్తాన్ బాబర్ ఆజమ్ (56.25), వెస్టిండీస్ షై హోప్ (54.17) తర్వాత రోహిత్ (47.87) మూడవ స్థానంలో ఉన్నారు. కానీ బాబర్ (86.93), హోప్ (95.55) స్ట్రైక్ రేట్‌లలో రోహిత్ కంటే చాలా వెనుకబడి ఉన్నారు. రోహిత్ కెప్టెన్సీ శకంలో వ్యక్తిగత రికార్డులు, వికెట్‌ను కాపాడుకోవాలనే ఆలోచనలు తగ్గాయి. ఆరంభం నుంచే దూకుడుగా ఆడాలి అనే కొత్త ఆలోచనను ఆయన తన కెప్టెన్సీలో ఆటగాళ్లకు పరిచయం చేశారు.

మెగా టోర్నీలలో రోహిత్ ప్రభావం

పూర్తికాల కెప్టెన్‌గా రోహిత్ ఆడిన మూడు ప్రధాన టోర్నమెంట్‌లలో ఆయన భారతదేశం తరఫున అత్యంత ప్రభావవంతమైన బ్యాటర్‌గా నిలిచారు. 21 ఇన్నింగ్స్‌లలో 48.55 సగటు,116.42 స్ట్రైక్ రేట్‌తో 971 పరుగులు చేశారు. ఇందులో ఒక సెంచరీ, ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

రోహిత్ కెప్టెన్సీలో అత్యుత్తమైనది 2023 ప్రపంచ కప్. ఆ టోర్నీలో 11 ఇన్నింగ్స్‌లలో 54.27 సగటుతో ,125.94 స్ట్రైక్ రేట్‌తో 597 పరుగులు చేసి, రెండవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచారు. ఒకే ప్రపంచ కప్‌లో 10+ మ్యాచ్‌లు ఆడిన ఓపెనర్‌లలో ఇది అత్యుత్తమ ప్రదర్శన. అంతేకాదు ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించారు. ఈ ఏడాది దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో 'హిట్‌ మ్యాన్' న్యూజిలాండ్‌పై 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 76 బంతుల్లో 76 పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును గెలుచుకున్నారు.

అభిమానుల దృష్టిలో రోహిత్ అంటే..

ధోని తర్వాత అంతటి అనుభ‌వం రోహిత్ నాయకత్వంలో కనిపించింది. ఒత్తిడికి లోనవ్వకుండా, కష్ట సమయాల్లో కూడా నవ్వుతూ, తన ప్రశాంతతతో ఆటగాళ్లకు ధైర్యం చెప్పేవారు. ఈ లక్షణం వల్లనే ఆటగాళ్లు ఆయన కింద స్వేచ్ఛగా ఆడగలిగారు. జట్టులోని ప్రతి ఆటగాడికి, ముఖ్యంగా యువ ఆటగాళ్లకు ఆయన అండగా నిలిచేవారు. రోహిత్ తలుపు ఎల్లప్పుడూ 24/7 తెరిచి ఉంటుందని, ఆయన అందరినీ కలుపుకొనిపోయే నాయకుడని జట్టు సభ్యులు తరచుగా చెప్పేవారు. ఇది టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించింది. కెప్టెన్‌గా ఉంటూ, ఓపెనర్‌గా రోహిత్ అందించిన అద్భుతమైన శుభారంభాలు జట్టు విజయానికి పునాది వేశాయి. ముఖ్యంగా 2023 ప్రపంచకప్‌లో ఆయన ఇచ్చిన స్టార్ట్‌లు జట్టుకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. కెప్టెన్సీ భారం ఆయన బ్యాటింగ్‌పై ప్రభావం చూపకపోవడం విశేషం.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత, ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం అభిమానుల్లో కాస్త నిరాశను మిగిల్చింది. 2027 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని, శుభ్‌మన్ గిల్ వంటి యువ నాయకుడికి బాధ్యతలు అప్పగించాలనే సెలక్టర్ల వ్యూహాత్మక నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకోవచ్చు. అయినా, రోహిత్ శర్మ తన నాయకత్వంలో జట్టుకు అనేక విజయాలను నడిచారు. తక్కువ కాలంలోనే రెండు ఐసీసీ టైటిళ్లు, రెండు ఆసియా కప్‌లు సాధించడం ఒక అరుదైన ఘనత. ఆయన కెప్టెన్సీ రికార్డులు భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని జ్ఞాపకాలు.

ముగిసిన రో'హిట్' కెప్టెన్సీ శకం - Tholi Paluku