
ముగిసిన మేడారం కుంభమేళా: వనప్రవేశం చేసిన సమ్మక్క-సారలమ్మ
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర శనివారం రాత్రి అత్యంత వైభవంగా ముగిసింది. నాలుగు రోజుల పాటు కోట్ల మంది భక్తుల కొంగుబంగారంగా నిలిచిన వనదేవతలు తిరిగి వనప్రవేశం చేయడంతో జాతర ఘట్టం పరిసమాప్తమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ సహా పలు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు మేడారానికి తరలివచ్చారు.
జాతరలో చివరి రోజైన శనివారం రాత్రి పూజారులు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవార్లను గద్దెల నుంచి తిరిగి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. సమ్మక్క చిలుకలగుట్టకు, సారలమ్మ కన్నెపల్లికి బయలుదేరగా భక్తులు వచ్చే 2028 జాతరలో మళ్ళీ కలుద్దాం అమ్మ అంటూ మొక్కులు చెల్లించుకున్నారు. గడిచిన నాలుగు రోజులు మేడారం గ్రామం భక్తజన సంద్రంగా మారింది. భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి, అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వనదేవతల వనప్రవేశంతో మేడారం పరిసరాల్లో ఆధ్యాత్మిక సందడి ముగిసింది.
మేడారం మహా జాతర సందర్భంగా భక్తుల పోటెత్తడంతో రవాణా వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. వనదేవతల దర్శనం అనంతరం భక్తులు తిరుగు ప్రయాణం ప్రారంభించడంతో మేడారం నుంచి తాడ్వాయి వరకు సుమారు 14 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 8 గంటలుగా వాహనాలు కదలకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ దాదాపు 20 కిలోమీటర్ల వరకు విస్తరించింది. జాతరకు భారీ సంఖ్యలో భక్తులు రావడంతో రహదారులు పూర్తిగా నిండిపోయి, రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. వేలాదిమంది భక్తులతో ఆర్టీసీ బస్ స్టాండ్ కిక్కిరిసిపోయింది. గంటల తరబడి ఎదురుచూసినా బస్సులు అందుబాటులో లేవని భక్తులు చెబుతున్నారు. అధికారులు సైతం అందుబాటులో లేకపోగా పోలీసులు, అధికారులకు సమన్వయ లోపం కారణంగా ఇబ్బందులు నెలకొంటున్నాయని చెబుతున్నారు.
