Let's talk: editor@tmv.in
ముగిసిన మత్స్యకారుల శిక్షణ

ముగిసిన మత్స్యకారుల శిక్షణ

Panthagani Anusha
16 డిసెంబర్, 2025

ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా అధ్యయనం, అవగాహన, శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాలు అవలంభిస్తున్న అత్యాధునిక సాంకేతికత సాయంతో ఉప్పాడ, కాకినాడ తీర ప్రాంత మత్స్యకారులకు వసతులు కల్పించేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మత్స్యశాఖ అధికారులకు సూచించారు. ఇందుకు అనుగుణంగా, మత్స్య సంపదతో ఆర్థికాభివృద్ధి సాధించేందుకు అవసరమైన అధునాతన పద్ధతులపై అధ్యయనం చేసేందుకు ఉప్పాడకు చెందిన మత్స్యకారులను రెండు బృందాలుగా తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు పంపారు.

ఈ నెల 8వ తేదీన మొత్తం 60 మంది మత్స్యకారులు రెండు బృందాలుగా ఆయా రాష్ట్రాలకు తరలివెళ్లారు. స్థిరమైన ఆర్ధికాభివృద్ధి సాధించడం ఎలా అనే అంశంపై రెండు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు శిక్షణ ఇప్పించారు. ఈ శిక్షణలో అధునాతన కేజ్ కల్చర్, రిఫ్ కల్చర్, మార్కెటింగ్ వ్యవస్థల ఏర్పాటు, అన్ని హంగులతో నిర్మించిన హార్బర్ల సందర్శన, హ్యాచరీస్ లో చేపల గుడ్లు పొదిగించడం, వలల తయారీ వంటి అంశాలపై సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ల నిపుణుల ద్వారా అవగాహన కల్పించారు. ముందుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా విధానాలను వివరించి తదుపరి క్షేత్ర స్థాయి సందర్శనలకు ఏర్పాట్లు చేశారు.

తమిళనాడు పర్యటనలో...

తమిళనాడు సందర్శనకు వెళ్లిన మొదటి ఉప్పాడ మత్స్యకార బృందం చెన్నైలోని మండపం వద్ద ఉన్న సందర్శించారు. అక్కడ మెరైన్ నిపుణులు కృత్రిమ, సహజ పద్ధతుల్లో సాగు చేస్తున్న కేజ్ కల్చర్ మరియు రిఫ్ కల్చర్లపై మత్స్యకారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. సముద్ర తీర ప్రాంతంలో జీవ వైవిధ్యాన్ని కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, సముద్ర వనరుల దీర్ఘకాలిక సంరక్షణకు అవలంభించాల్సిన శాస్త్రీయ విధానాలను వారికి తెలియజేశారు. అనంతరం, విల్లుపురంలోని గోల్డెన్ మెరైన్ హార్వెస్ట్ హ్యాచరీని సందర్శించి, మత్స్య సంపద సృష్టిలో వస్తున్న నూతన సాంకేతికతపై అధ్యయనం చేశారు.

ఆధునిక మార్కెటింగ్ వ్యవస్థ:

ఈ బృందం చెన్నై మెరీనా బీచ్ సమీపంలోని ఆధునిక మౌలిక వసతులతో కూడిన చేపల మార్కెట్‌ను సందర్శించి, ఇక్కడ పరిశుభ్రమైన వాతావరణంలో చేపల అమ్మకం, కోల్డ్ స్టోరేజ్ వ్యవస్థలు, మత్స్య సంపద గ్రేడింగ్, వేలం నిర్వహణ, వ్యర్థాల నిర్వహణ విధానాలు, సప్లయి చైన్ వంటి అత్యాధునిక సదుపాయాలపై అవగాహన తెచ్చుకున్నారు. ఈ క్షేత్ర స్థాయి పరిశీలన ద్వారా ఆధునిక సదుపాయాల కల్పన ద్వారా మత్స్యకారుల ఆదాయం ఏ విధంగా వృద్ధి చెందుతుందనే అంశాన్ని తెలుసుకున్నారు.

ఇక కేరళ పర్యటనలో భాగంగా ఉప్పాడకు చెందిన రెండో మత్స్యకార బృందం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ లో మూడు రోజులపాటు నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ తీసుకున్నారు. వేటలో సాంకేతిక మేళవింపు, స్థిరమైన ఆదాయార్జన, ఆర్థికంగా లాభదాయక విధానాలు అవలంభించడం ఎలా? అనే అంశాలపై వారు అధ్యయనం చేశారు. మునంబంలోని మోడల్ ఫిషింగ్ హార్బర్ను సందర్శించి, అక్కడ ఆధునిక పద్ధతులలో వలల తయారీ ప్రక్రియ, వారు పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలు, మార్కెటింగ్ విధానాలను తెలుసుకున్నారు. చేపల గుడ్లు పొదిగించడం, రకరకాల జాతుల చేప పిల్లల హ్యాచరీలను కూడా సందర్శించారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు అమలు చేస్తున్న అధునాతన విధానాలు, వాటి వల్ల కలుగుతున్న లాభాలపై ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులకు ప్రత్యక్షంగా అధ్యయనం చేసే అవకాశం కలిగింది. విజయవంతంగా ముగిసిన ఈ వారం రోజుల శిక్షణ తరగతులు ఉప్పాడ మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడానికి ఒక బలమైన పునాదిని నిలవనుంది అధికారులు భావిస్తున్నారు.