
ముగిసిన ప్రధాని మోడీ భూటాన్ పర్యటన
భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల భూటాన్ పర్యటన విజయవంతంగా ముగిసింది. మంగళ, బుధ వారాల్లో ప్రధాని మోడీ భూటాన్‌లో పర్యటించారు. ఈ పర్యటన 'నైబర్‌హుడ్ ఫస్ట్' (ఇరుగుపొరుగుకే తొలి ప్రాధాన్యం) విధానానికి భారత్ ఇస్తున్న ప్రాధాన్యతను మరోసారి చాటి చెప్పింది. పర్యటనలో భాగంగా చివరి రోజు బుధవారం ప్రధాని మోడీ థింఫూలో భూటాన్ నాల్గవ, మాజీ రాజు డ్రూక్ గ్యాల్పో జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్‌తో సమావేశమయ్యారు. అంతకుముందు మంగళవారం ప్రధాని మోడీ భూటాన్ ప్రస్తుత రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గ్యేల్ వాంగ్‌చుక్‌తో విస్తృత స్థాయి చర్చలు జరిపారు.
ఈ చర్చల్లో ఇంధనం, కనెక్టివిటీ, సాంకేతికత, రక్షణ, భద్రత వంటి పలు కీలక రంగాలలో ద్వైపాక్షిక సహకారంపై ఇరువురు నేతలు సమీక్షించారు. చర్చల అనంతరం, భారత్-భూటాన్ భాగస్వామ్యంతో నిర్మించిన 1,020 మెగావాట్ల పునత్‌సాంగ్‌ఛు-II జల విద్యుత్ ప్రాజెక్టును ఇద్దరు నేతలు కలిసి ప్రారంభించారు. ఇది ఇరు దేశాల మధ్య ఇంధన రంగంలో బలపడుతున్న బంధానికి నిదర్శనంగా నిలిచింది.
ఈ సమావేశంపై ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ "భూటాన్ రాజుతో సమావేశం చాలా ఫలప్రదంగా జరిగింది. ఇరు దేశాల మధ్య ఉన్న అన్ని అంశాలపై చర్చించాం. భూటాన్ అభివృద్ధి ప్రయాణంలో భారత్ ఒక కీలక భాగస్వామి కావడం మాకు గర్వకారణం" అని పేర్కొన్నారు.
ఆధ్యాత్మిక, సాంస్కృతిక బంధాలు
ఈ పర్యటనలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాలకు కూడా పెద్దపీట వేశారు. ప్రధాని మోడీ బుధవారం భూటాన్‌లో జరుగుతున్న ప్రపంచ శాంతి ప్రార్థన ఉత్సవంలో 'కాలచక్ర సాధికారత' వేడుకను ప్రారంభించారు. "భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గ్యేల్, నాల్గవ రాజు డ్రూక్ గ్యాల్పో జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్ సమక్షంలో 'కాలచక్ర సాధికారత’ వేడుకను ప్రారంభించే గౌరవం నాకు దక్కింది" అని ప్రధాని మోడీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
థింఫూలోని తాషిచోడ్‌జాంగ్‌లో భూటాన్ రాజుతో కలిసి గౌతమ బుద్ధుడి పవిత్ర అవశేషాలను ప్రధాని దర్శించుకున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం ఈ అవశేషాలను భారత్ నుంచే పంపడం విశేషం.
భూటాన్ నాలుగో రాజు జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్ 70వ జన్మదిన వేడుకల్లో మంగళవారం ప్రధాని మోడీ పాల్గొన్నారు. 1972 నుంచి 2006 వరకు భూటాన్‌ను పాలించిన జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్, దేశ ఆధునికీకరణలో కీలక పాత్ర పోషించడంతో పాటు 'స్థూల జాతీయ సంతోషం' అనే వినూత్న సిద్ధాంతంతో ప్రపంచ గుర్తింపు పొందారు. మొత్తంగా ఈ పర్యటన భారత్-భూటాన్ స్నేహబంధం కేవలం అభివృద్ధి ప్రాజెక్టులకు మాత్రమే పరిమితం కాకుండా, పంచుకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వంపై కూడా ఆధారపడి ఉందని మరోసారి చాటి చెప్పింది.
