
ముగిసిన నామినేషన్ల గడువు! వేడెక్కనున్న ప్రచారం
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల దాఖల గడువు మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా, అన్ని పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లను సమర్పించగా, మొత్తం 150 నామినేషన్లు దాఖలయ్యాయి. ఉపఎన్నికకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణకు గడువు 2025 అక్టోబర్ 24 (శుక్రవారం) 3 గంటలలోపు అభ్యర్థులు తమ నామినేషన్లను అధికారికంగా ఉపసంహరించుకోవచ్చు. తదుపరి రోజు, అంటే అక్టోబర్ 25న, ఎన్నికల అధికారులు తుది అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. పోలింగ్ నవంబర్ 11, 2025, ఓట్ల లెక్కింపు నవంబర్ 14, 2025న జరుగుతుంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం భాజపా అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తొలుత వెంకటగిరిలోని విజయదుర్గ పోచమ్మ ఆలయంలో దీపక్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి కార్యకర్తలతో భారీ ర్యాలీగా షేక్‌పేట తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేశారు. 2023 ఎన్నికల్లోనూ దీపక్‌రెడ్డి జూబ్లీహిల్స్ భాజపా అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో 3 ప్రధాన పార్టీలు నామినేషన్ దాఖలు పూర్తి అయ్యాయి.
ఖైరతాబాద్ బస్తీ దవాఖానలను పరిశీలించిన కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజారోగ్య సేవలపై తగిన దృష్టి పెట్టకపోవడం, బస్తీ దవాఖానలను నిర్లక్ష్యం చేయడం పట్ల కేటీఆర్ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో,మంగళవారం బస్తీ దవాఖానలను బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు పరిశీలించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఇబ్రహీం నగర్ బస్తీ దవాఖానను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించి, అక్కడ పేషెంట్ల సమస్యలను స్వయంగా ఆయన గుర్తించారు. కేటీఆర్ తన పరిశీలనలో, బస్తీ ప్రాంతాల్లో ప్రజారోగ్య సౌకర్యాలను మరింత మెరుగుపరచడం కోసం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని వ్యక్తం చేశారు.
ఏ పార్టీ బలం ఎంత?
జూబ్లీహిల్స్‌లో గెలుపు కోసం ప్రతిపక్ష బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా వ్యూహప్రతివ్యూహాలు చేస్తోంది. బీఆర్ఎస్ తన సిట్టింగ్ సీటును కైవసం చేసుకోవాలని ప్రచారాన్ని ప్రారంభించింది. అభ్యర్థి ఎంపికలోనూ ఆచితూచి వ్యవహరించిన బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపినాథ్ సేవలకు గుర్తుగా ఆయన సతీమణి సునీతను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. సానుభూతి ఓట్లతో పాటు గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులపైనే అధికంగా ఆధారపడింది. కాగా అభ్యర్ధి ప్రకటనకు ముందే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డివిజన్ల వారీగా పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించి కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్ధం చేశారు.
సీనియర్ నేతలను ఇంఛార్జ్‌లుగా
ఇంటింటికీ కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీని కొనసాగిస్తూనే ఓటర్లతో టచ్‌లో ఉండాలని పార్టీ బూత్ కమిటీలకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక పర్యవేక్షణ కోసం కేటీఆర్ హరీశ్‌రావు సహా జిల్లాకు చెందిన ముగ్గురు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావుగౌడ్, మహమూద్ అలీతో ఉపఎన్నికను పర్యవేక్షిస్తున్నారు. దాంతో పాటు డివిజన్ల వారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలను ఇంఛార్జ్‌లుగా నియమించారు.
గెలుపే లక్ష్యంగా మూడు పార్టీలు
రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లకు తామే ప్రత్యామ్నాయం అంటున్న భారతీయ జనతా పార్టీ సైతం ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాల్ని కైవసం చేసుకున్న కాషాయ పార్టీ అదే ఉత్సాహాంతో సత్తాచాటాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉండటంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాషాయ శ్రేణులు విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి.
ఓటర్లు ఎటువైపు?
మొత్తంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో గెలుపును 3 ప్రధాన పార్టీలు సవాలుగా తీసుకున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాయిదా పడటంతో ఈ 3 పార్టీలు ఇక్కడే సర్వశక్తులుగా తమ భవిష్యత్ రాజకీయ లక్ష్యాలకు రాచబాట వేసుకునేందుకు సిద్ధమయ్యాయి. అందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవట్లేదు. ఇంతటి ప్రతిష్ఠాత్మక పోరులో జూబ్లీహిల్స్ ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడతారో నవంబర్ 14న తేలనుంది.
