
ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6గంటల వరకు క్యూలో ఉన్నవారికి మాత్రమే ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(భారత రాష్ట్ర సమితి) మృతితో ఉప ఎన్నిక నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ జరిగింది.గత ఎన్నికల సరళి చూస్తే ఎప్పుడూ 50 శాతం దాటలేదు.మంగళవారం 47.16 శాతం పోలింగ్ నమోదు అయిందని అధికారులు తెలిపారు. అలాగే గతంలో 2024లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ నమోదు శాతం సుమారు 45.59 శాతంగా ఉంది.
జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో పోటీలో ఉన్నఅభ్యర్థులు మంగళవారం ఉదయం వారికి సంబంధించిన పోలింగ్ కేంద్రలలో బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి, తన సతీమణితో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎల్లారెడ్డిగూడా నవోదయ కాలనీలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటు హక్కును వినియోగించుకున్న హైడ్రా కమిషనర్,చిత్ర దర్శకుడు
మధురానగర్‌లోని శ్రీనిధి విశ్వభారతి హైస్కూల్‌లోని పోలింగ్ బూత్ నంబర్ 132లో తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగించుకోవడం మనందరి బాధ్యత.ఓటును సద్వినియోగం చేసుకోవాలి, దానిని వృధా చేయకూడదు.ఓటు హక్కు వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
బాహుబలి' చిత్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.రాజమౌళి, ఆయన కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయతో కలిసి మంగళవారం శేక్‌పేటలోని ఒక పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
ఉప ఎన్నిక భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన కమిషనర్ సజ్జనార్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన భద్రత, శాంతిభద్రతల ఏర్పాట్లను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్, ఐపీఎస్,మంగళవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)ను సందర్శించి సమీక్షించారు.ఈ సందర్శన సమయంలో, పోలింగ్ సజావుగా జరిగేలా, ప్రజల ప్రశాంతతను కాపాడేలా, కమిషనర్ రియల్-టైమ్ నిఘా ఫీడ్‌లు, బలగాల మోహరింపు నమూనాలు, క్షేత్రస్థాయి ప్రతిస్పందన యంత్రాంగాలను పరిశీలించారు.ఐసీసీసీ నుంచి రియల్-టైమ్ పర్యవేక్షణ, పరిస్థితుల అవగాహన త్వరిత సంఘటన ప్రతిస్పందనను సులభతరం చేయడానికి 900కు పైగా సీసీటీవీ కెమెరాలు 150 డ్రోన్ కెమెరాల నెట్‌వర్క్‌ను వ్యూహాత్మకంగా ఉపయోగించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కోడ్ ఉల్లంఘించిన పలువురి ఎమ్మెల్యేలపై మూడు కేసులు నమోదు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన పలువురిపై హైదరాబాద్ సిటీ పోలీసులు మూడు కేసులను నమోదు చేయడం జరిడిందని తెలిపారు.ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్, అలాగే రాందాస్ పై మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులను,మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్ పై బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదయ్యాయని పోలీస్ అధికారులు తెలిపారు.ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్ సిటీ పోలీసులు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా, ప్రశాంతంగా సాగేందుకు ప్రతి ఒక్కరు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను గౌరవించాలని పోలీసులు సూచించారు.
ఈ 150 డ్రోన్ కెమెరాలతో భద్రత
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా, పోలింగ్ రోజున భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అధికారులు డ్రోన్ కెమెరాలను ఉపయోగించారు.ఈ 150 డ్రోన్ కెమెరాల ద్వారా పోలింగ్ కేంద్రాలు వాటి చుట్టుపక్కల ప్రాంతాలపై నిరంతర వైమానిక పర్యవేక్షణ (ఏరియల్ సర్వైలెన్స్) నిర్వహించబడింది.ఈ చర్య తీసుకోవడం వల్ల ఎన్నికల ప్రక్రియ అంతా పారదర్శకంగా, ఎటువంటి అవాంతరాలు లేకుండా శాంతియుత వాతావరణంలో సాగడానికి చాలావరకు సహకారం లభించింది.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని యూసఫ్‌గూడా ఇంచార్జిగా నియమించిన విషయం తెలిసిందే.యూసఫ్‌గూడా ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో అక్కడకు వెళుతున్న సమయంలో, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.
బీఆర్ఎస్ పార్టీ దీనిని కఠినంగా ఖండిస్తోంది. ప్రజాస్వామిక పద్ధతుల్లో గెలవలేని కాంగ్రెస్ పార్టీ, అధికార దుర్వినియోగానికి దిగజారిందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. పోలీసులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా మారారని ఆయన విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ చర్యలపై ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులను, బీఆర్ఎస్ నాయకులను అప్రజాస్వామికంగా అరెస్టు చేయించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ నైతికంగా ఓటమిని ఒప్పుకుందని స్పష్టం చేశారు.
