Let's talk: editor@tmv.in
ముగిసిన చీఫ్ జస్టిస్ గవాయ్ పదవీకాలం

ముగిసిన చీఫ్ జస్టిస్ గవాయ్ పదవీకాలం

Pinjari Chand
23 నవంబర్, 2025

దేశ ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) బీఆర్ గవాయ్ ఆరు నెలల పదవీకాలంలోనే బ్యాక్‌వర్డ్ క్లాసెస్‌కు చెందిన 11 మంది, షెడ్యూల్డ్ కాస్ట్ వర్గానికి చెందిన 10 మంది న్యాయమూర్తులను దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టులకు న్యాయమూర్తులుగా నియమించడం విశేషంగా నిలిచింది. దేశంలో మొదటి బౌద్ధ, రెండో దళిత సీజేఐ అయిన గవాయ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కొలీజియం మొత్తం 129 మంది పేర్లను కేంద్ర న్యాయశాఖకు సిఫారసు చేసింది. అందులో ప్రభుత్వం 93 మంది నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఐదుగురు సుప్రీంకోర్టుకి

గవాయ్ పదవీకాలంలోనే న్యాయవాదులు ఎన్వీ అంజారియా, విజయ్ బిశ్నోయి, ఏఎస్ చందుర్కర్, అలాక్ అరాధే, విపుల్ మనుభాయ్ పంచోలీలను సుప్రీంకోర్టులోకి తీసుకున్నారు.

అల్పసంఖ్యాకులకి, మహిళలకు స్థానం

మే 14న ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన చేసిన నియామకాల వివరాల ప్రకారం 13 మంది మైనారిటీలకు, 15 మంది మహిళలకు అవకాశం లభించింది. అలాగే నియమితులైన 93 మందిలో 49 మంది బార్‌ నుంచి, మిగతావారు సర్వీస్ కేడర్‌ నుంచి వచ్చారు. అందులో 5గురు ప్రస్తుత లేదా మాజీ న్యాయమూర్తుల బంధువులు కూడా ఉన్నట్లు వివరాలు చెబుతున్నాయి.

గవాయ్ ఇచ్చిన ప్రధాన తీర్పులు

52వ ప్రధాన న్యాయమూర్తిగా గవాయ్ అందించిన కీలక తీర్పుల్లో

• వక్ఫ్ చట్టంలోని కొన్ని కీలక నిబంధనలపై స్టే

• ట్రిబ్యునల్ రీఫార్మ్స్ చట్టం రద్దు

• ప్రాజెక్టులకు సెంటర్‌కు పోస్ట్‌ ఫాక్టో గ్రీన్ నోడ్స్ ఇచ్చే అవకాశం కల్పించిన తీర్పు ముఖ్యంగా నిలిచాయి.

వారసుడిగా సూర్యకాంత్

నవంబర్‌ 23 (ఆదివారం) గవాయ్ పదవీకాలం ముగియనుంది. సోమవారం నవంబర్‌ 24న జస్టిస్ సూర్యకాంత్ కొత్త సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

సంతృప్తితో వెళ్తున్నా

చివరి వర్కింగ్ డే అయిన శుక్రవారం సహోద్యోగుల ప్రశంసలతో జరిగిన సమావేశంలో గవాయ్ భావోద్వేగానికి లోనయ్యారు. న్యాయ విద్యార్థిలా నాలుగు దశాబ్దాల ప్రయాణాన్ని పూర్తి చేసి, సంపూర్ణ సంతృప్తితో ఈ సంస్థ నుంచి బయలుదేరుతున్నాను అని భావోద్వేగంతో మాట్లాడారు.

ముగిసిన చీఫ్ జస్టిస్ గవాయ్ పదవీకాలం - Tholi Paluku