Let's talk: editor@tmv.in
ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పై ఎగిరిన కాషాయ జెండా: తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఘనంగా సంబరాలు

ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పై ఎగిరిన కాషాయ జెండా: తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఘనంగా సంబరాలు

Gaddamidi Naveen
17 జనవరి, 2026

దేశ ఆర్థిక రాజధాని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన చారిత్రక విజయంపై తెలంగాణలోనూ ఉత్సాహం నెలకొంది. ఈ అద్భుత విజయాన్ని పురస్కరించుకుని నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం భారీ ఎత్తున విజయోత్సవ సంబరాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు మాట్లాడుతూ, మహారాష్ట్రలో బీజేపీ సాధించిన ఘన విజయం దేశవ్యాప్తంగా పార్టీపై ప్రజలకు ఉన్న అపారమైన విశ్వాసానికి స్పష్టమైన నిదర్శనమన్నారు. ముఖ్యంగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) చరిత్రలో తొలిసారిగా బీజేపీ అధికార పీఠాన్ని అధిష్టించడాన్ని ఆయన చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు.

చారిత్రక విజయం – ముంబైలో వికసించిన కమలం: బండి

మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఈ ఘనమైన మాండేట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి దృక్పథానికి, దూరదృష్టి గల పాలనకు ప్రజలు ఇచ్చిన అంగీకారమని కేంద్ర‌మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ విజయానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబిన్ ల మార్గదర్శకత్వం కీలకంగా నిలిచిందని పేర్కొన్నారు.

అలాగే మహారాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే రవి దాదా చవాన్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వం, అలాగే ప్రతి పార్టీ కార్యకర్త చేసిన అహర్నిశల కృషి ఈ విజయంలో ప్రధాన పాత్ర పోషించిందని కొనియాడారు. ఈ విజయం కేవలం రాజకీయ విజయమే కాదు, ప్రజల నమ్మకానికి ముద్ర అని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రలో లభించిన ఈ విజయోత్సాహమే రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లోనూ బీజేపీ విజయానికి బాటలు వేస్తుందని బండి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ బీజేపీకి ప్రజల మద్దతు రోజు రోజుకీ పెరుగుతోందని అన్నారు.

ఈ విజయోత్సవ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అరవింద్, గౌతమ్ రావు, వేముల అశోక్, వీరేందర్ గౌడ్ తదితర సీనియర్ నాయకులు పాల్గొని, పార్టీ శ్రేణులతో కలిసి సంబరాలు చేసుకున్నారు.