
ముంబై పోర్ట్ అథారిటీలో 116 అప్రెంటిస్ పోస్టులు
ముంబై పోర్ట్ అథారిటీ నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది. 2025-26 ఏడాదికి గానూ గ్రాడ్యుయేట్, సీఓపీఏ అప్రెంటిస్ ట్రైనింగ్ శిక్షణకు సంబంధించి 116 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ఎక్కువ భాగం కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రొగ్రామింగ్ అసిస్టెంట్ (సీఓపీఏ) పోస్టులు కావడం విశేషం. సీఓపీఏ 105 పోస్టులు, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 11 పోస్టులు ఉన్నాయి.
సీఓపీఏ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ) నుండి కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రొగ్రామింగ్ అసిస్టెంట్ (సీఓపీఏ) ట్రేడ్‌లో కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుండి ఇంజనీరింగ్‌లో డిగ్రీ (బీటెక్/బీఈ) పూర్తి చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్‌లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ఫీజు రూ.100గా ఉంది. ఎంపికైన అభ్యర్థులకు 12 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ సమయంలో వీరికి అప్రెంటిస్‌షిప్ చట్టం ప్రకారం నెలవారీ స్టైఫండ్ చెల్లిస్తారు.
సీఓపీఏ అభ్యర్థుల ముందుగా అప్రెంటిస్‌షిప్ ఇండియా పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. గ్రాడ్యుయేట్ అభ్యర్థులు నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ముంబై పోర్ట్ అథారిటీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా నోటిఫికేషన్‌లో సూచించిన తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ అప్రెంటిస్‌షిప్ అవకాశం ముంబై పోర్ట్ అథారిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వ సంస్థలో వృత్తిపరమైన శిక్షణ, అనుభవం పొందడానికి ఉపయోగపడుతుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ముంబై పోర్ట్ అథారిటీ అధికారిక వెబ్‌సైట్ https://mumbaiport.gov.in/లో ఉన్న నోటిఫికేషన్‌ను చదవండి.
ముంబై పోర్ట్ అథారిటీ గురించి..
ముంబై పోర్ట్ అథారిటీ భారతదేశంలోని అత్యంత పురాతన, ముఖ్యమైన ఓడరేవులలో ఒకటి. దీనిని వాస్తవానికి 'బాంబే పోర్ట్ ట్రస్ట్' పేరుతో జూన్ 26, 1873న స్థాపించారు. 2021లో 'మేజర్ పోర్ట్ అథారిటీస్ చట్టం' అమలులోకి వచ్చిన తర్వాత దీని పేరు ముంబై పోర్ట్ అథారిటీగా మారింది. ముంబై పోర్ట్ అథారిటీ ప్రధానంగా క్రూడ్ ఆయిల్, బల్క్ కార్గో, ద్రవ రసాయనాలు, క్రూయిజ్ నౌకల నిర్వహణ చూసుకుంటుంది. నౌకల రాకపోకలను నియంత్రించడం, సరుకుల నిల్వ, రవాణా సౌకర్యాలను కల్పించడం దీని ప్రధాన విధులు. ఇది భారత ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తున్న స్వయంప్రతిపత్తి సంస్థ. ఇందులో పనిచేసే ఉద్యోగుల సంఖ్య ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ప్రస్తుతమైతే ముంబై పోర్ట్ అథారిటీలో సుమారు 7,000-8,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరు పోర్ట్ నిర్వహణ, రవాణా, సెక్యూరిటీ, లోడింగ్-అన్లోడింగ్, ఇతర సాంకేతిక విభాగాల్లో పనిచేస్తున్నారు.
