Let's talk: editor@tmv.in
ముంబై పీఠంపై ‘జనరల్’ మహిళా మేయర్

ముంబై పీఠంపై ‘జనరల్’ మహిళా మేయర్

Pinjari Chand
23 జనవరి, 2026

ముంబై నగరానికి తదుపరి మేయర్‌గా జనరల్ కేటగిరీకి చెందిన మహిళే ఉంటారని గురువారం నిర్వహించిన లాటరీలో తేలింది. అయితే ఈ లాటరీ విధానం అధికార పక్షాలకు అనుకూలంగా ‘ఫిక్స్’ చేశారని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. లాటరీ ఫలితంతో శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) వర్గం మేయర్ పదవిపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ) మహిళకు మేయర్ పదవి రిజర్వ్ అయ్యే అవకాశం ఉంటే, ఆ కేటగిరీలో అర్హులైన ఇద్దరు అభ్యర్థులు శివసేన (యూబీటీ)కు చెందినవారే కావడంతో ఆ పార్టీకి లాభం చేకూరుతుందని భావించారు. జనవరి 15న జరిగిన బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ 89 సీట్లు గెలుచుకోగా, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 29 సీట్లు సాధించింది. దీంతో ఈ కూటమి, 114 సీట్ల మెజారిటీ మార్కును దాటి, దేశంలోని అతిపెద్ద, అత్యంత సంపన్న మున్సిపల్ కార్పొరేషన్‌పై ఆధిపత్యం సాధించింది. 1997 నుంచి 25 ఏళ్ల పాటు శివసేన పాలనలో ఉన్న బీఎంసీలో, శివసేన (యూబీటీ) ఈ ఎన్నికల్లో 65 సీట్లు గెలుచుకుంది. దాని మిత్రపక్షాలు మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎస్) 6 సీట్లు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్) ఒక సీటు సాధించాయి. లాటరీ ప్రకారం ముంబైతో పాటు మహారాష్ట్రలోని మరో ఎనిమిది మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా జనరల్ కేటగిరీ మహిళా మేయర్లు రానున్నారు. వీటిలో పుణే, ధులే, నాందేడ్-వాఘాలా, నవీ ముంబై, మాలేగావ్, మీరా-భాయందర్, నాగ్‌పూర్, నాశిక్ ఉన్నాయి.

లాటరీ ద్వారే నిర్ణయం

మేయర్ పదవిని ఏ కేటగిరీకి రిజర్వ్ చేయాలనే అంశాన్ని లాటరీ ద్వారా నిర్ణయిస్తారు. జనరల్, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీలలో ఏదో ఒకటి ప్రకటించిన తర్వాత, అర్హులైన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తారు. ముంబైతో పాటు మరో 28 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన మేయర్ పదవుల లాటరీని, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆధ్వర్యంలోని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్వహించింది. లాటరీ ఫలితంతో శివసేన (యూబీటీ)కు నిరాశ ఎదురైంది. ఎన్నికల ఫలితాల అనంతరం దేవుడి దయ ఉంటే ముంబైకు మా పార్టీ నుంచే మేయర్ వస్తారని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. ఎస్టీ మహిళా కేటగిరీకి మేయర్ పదవి వస్తే, అర్హులైన ఇద్దరు అభ్యర్థులూ తమ పార్టీకే చెందినవారైనందున అవకాశాలు తమవేనని శివసేన (యూబీటీ) భావించింది.

నిబంధనలు మార్చారు

ఈ నేపథ్యంలో శివసేన (యూబీటీ) నేత, ముంబై మాజీ మేయర్ కిషోరి పెడ్నేకర్ లాటరీ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిబంధనలు మార్చారని ఆమె ఆరోపించారు. గత రెండు సార్లు ముంబై మేయర్లు జనరల్ కేటగిరీ నుంచే వచ్చారని, ఈసారి ఓబీసీకి అవకాశం ఇవ్వాల్సి ఉందని పెడ్నేకర్ పేర్కొన్నారు. అలాగే ఎస్టీ కేటగిరీని లాటరీ నుంచి తప్పించారని ఆమె ఆరోపించారు. ఈ లాటరీ విధానాన్ని మేం ఖండిస్తున్నాం. ఇది పూర్తిగా ఫిక్స్ చేసిన ప్రక్రియ అని ఆరోపించారు.కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత విజయ్ వడెట్టివార్ కూడా లాటరీ వ్యవస్థ పారదర్శకంగా లేదని ఇది ‘ఫిక్స్’ అయిన ప్రక్రియేనని విమర్శించారు. అయితే, పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి మాధురి మిసాల్ ఈ ఆరోపణలను ఖండించారు. చట్టం ప్రకారం అన్ని విధానాలను పూర్తిగా పాటించి లాటరీ నిర్వహించామని ఆమె స్పష్టం చేశారు.

లాటరీ ప్రకారం, ఛత్రపతి సంభాజీనగర్, పర్భని, సాంగ్లీ-మిరా-కుప్వాడ్, అమరావతి, వసాయి-విరార్, సొలాపూర్, పింప్రి-చించ్‌వాడ్, భివాండీ-నిజాంపూర్ మున్సిపల్ కార్పొరేషన్లకు జనరల్ కేటగిరీ మేయర్లు ఉంటారు. థానే మున్సిపల్ కార్పొరేషన్‌కు షెడ్యూల్డ్ కాస్ట్ కేటగిరీ మేయర్ రానున్నారు. జల్గావ్, చంద్రపూర్, అహిల్యానగర్, అకోలా మున్సిపల్ కార్పొరేషన్లకు ఓబీసీ మహిళా మేయర్లు నియమితులవుతారు. పన్వెల్, ఇచల్కరణ్జీ, కొల్హాపూర్, ఉల్హాస్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్లకు ఓబీసీ కేటగిరీ మేయర్లు ఉండనున్నారు. కల్యాణ్-డొంబివిలి మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎస్టీ కేటగిరీ మేయర్ రానుండగా, జల్నా, లాతూర్ మున్సిపల్ కార్పొరేషన్లకు ఎస్సీ మహిళా మేయర్లు నియమితులవుతారు.