
ముంబై తీరంలో మూడు ఇరాన్ చమురు నౌకల సీజ్!
అంతర్జాతీయ సముద్ర జలాల్లో చమురు స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముఠాల ఆటకట్టించేందుకు భారత తీర రక్షక దళం (ఐసీజీ) భారీ ఆపరేషన్ చేపట్టింది. అమెరికా ఆంక్షల జాబితాలో ఉండి, ఇరాన్‌తో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న మూడు భారీ చమురు ట్యాంకర్లను భారత అధికారులు ఈ నెలలో స్వాధీనం చేసుకున్నారు. భారత్-అమెరికా మధ్య ఇటీవల కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో, సముద్ర మార్గాల్లో అక్రమ రవాణాను అరికట్టేందుకు భారత్ తన నిఘాను ముమ్మరం చేసింది.
గుట్టురట్టు చేసిన తీర రక్షక దళం
ముంబై తీరానికి పశ్చిమ దిశలో సుమారు 100 నాటికల్ మైళ్ల దూరంలో భారత తీర రక్షక దళం ఈ కీలక ఆపరేషన్ నిర్వహించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ సర్వైలెన్స్ ద్వారా అనుమానాస్పదంగా కదులుతున్న నౌకలను గుర్తించారు. సముద్రం మధ్యలో ఒక నౌక నుంచి మరో నౌకలోకి చమురును మారుస్తూ, ఆ చమురు ఏ దేశానిదో తెలియకుండా గుర్తింపును మార్చేందుకు ప్రయత్నిస్తుండగా ఐసీజీ బృందాలు మెరుపు దాడి చేశాయి. పక్కా ఆధారాలతో మూడు నౌకలను అదుపులోకి తీసుకున్నాయి.
పట్టుబడిన నౌకల వివరాలివే..
రాయిటర్స్ కథనం ప్రకారం, భారత అధికారులు స్వాధీనం చేసుకున్న మూడు చమురు నౌకలను స్టెల్లార్ రూబీ, ఆస్ఫాల్ట్ స్టార్, అల్ జఫ్జియాలుగా గుర్తించారు. వీటిలో అల్ జఫ్జియా నౌక 2025లో ఇరాన్ నుండి జిబౌటి వరకు ఇంధనాన్ని రవాణా చేసినట్లు రికార్డులు ఉండగా, స్టెల్లార్ రూబీ ఇరాన్ పతాకంతో నడుస్తోంది. ఇక ఆస్ఫాల్ట్ స్టార్ నౌక ఎక్కువగా చైనా పరిసర ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. గమనార్హమైన విషయం ఏమిటంటే, గత ఏడాది అమెరికా విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం (ఓఎఫ్ఏసీ) ఆంక్షలు విధించిన గ్లోబల్ పీస్, చిల్-1, గ్లోరీ స్టార్-1 అనే నౌకల ఐఎంఓ నంబర్లు ప్రస్తుతం పట్టుబడిన ఈ మూడు నౌకల నంబర్లతో సరిపోలుతున్నాయి. దీనిని బట్టి ఈ నౌకలు తమ గుర్తింపును మార్చుకుని అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోంది.
తప్పుదోవ పట్టించేలా..
ఈ స్మగ్లింగ్ సిండికేట్ చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. వివిధ దేశాల నుంచి కార్యకలాపాలు సాగిస్తూ, చట్టాల నుంచి తప్పించుకోవడానికి నౌకల పేర్లను, గుర్తింపును తరచూ మారుస్తున్నట్లు విచారణలో తేలింది. యుద్ధ ప్రభావిత దేశాల నుంచి తక్కువ ధరకే చమురును కొనుగోలు చేసి, సముద్రం మధ్యలో ఇతర నౌకలకు విక్రయిస్తూ భారీ లాభాలు గడిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనివల్ల భారత ప్రభుత్వానికి రావాల్సిన భారీ సుంకాలకు గండి పడుతోంది.
చమురు మాది కాదు: ఇరాన్ స్పష్టత
మరోవైపు, భారత్ సీజ్ చేసిన నౌకలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇరాన్ జాతీయ చమురు సంస్థ (ఎన్ఐఓసీ) ప్రకటించింది. ఆ నౌకలు గానీ, వాటిలోని చమురు నిల్వలు గానీ తమ సంస్థకు చెందినవి కావని ఇరాన్ ప్రభుత్వ మీడియా స్పష్టం చేసింది. అయితే, పట్టుబడిన నౌకల యజమానులు విదేశాల్లో ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
సముద్ర రక్షణలో భారత్ అగ్రగామి
ప్రస్తుతం భారత తీర ప్రాంతాల్లో నిఘా పతాక స్థాయికి చేరింది. సుమారు 55 యుద్ధ నౌకలు, 12 వరకు విమానాలు నిరంతరం సముద్ర జలాలను పర్యవేక్షిస్తున్నాయి. "అంతర్జాతీయ నిబంధనలను గౌరవిస్తూ, సముద్ర భద్రతను కాపాడటంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. అక్రమ రవాణాకు మన జలాలను వాడుకోనివ్వబోం" అని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. ఈ ఆపరేషన్ ద్వారా అంతర్జాతీయ వాణిజ్య మార్గాల్లో భారత్ తన పట్టును మరోసారి చాటుకుంది.
