
ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో వీబీఏతో కాంగ్రెస్ పొత్తు
రాబోయే ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకోవడం నగరంలోని పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేసింది. నామినేషన్ల దాఖలు గడువు ముగియడానికి కొద్ది రోజుల ముందు, ప్రకాశ్ అంబేడ్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ ఆఘాడీ (వీబీఏ)తో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముందుగా 227 వార్డుల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్, ఇప్పుడు వీబీఏకు 62 సీట్లు కేటాయించింది. అదనంగా రాష్ట్రీయ సమాజ్ పక్ష్‌కు 10 సీట్లు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (గవాయ్ వర్గం)కు 2 సీట్లు ఇచ్చింది. ఈ సీట్ల పంపకం ముంబై కాంగ్రెస్ నాయకత్వం, కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది.
నిర్ణయం తీసుకునే ముందు సంప్రదించలేదు
ఈ పరిణామంపై స్పందించిన ముంబై కాంగ్రెస్ అధ్యక్షురాలు వర్షా గైక్వాడ్, ఈ పొత్తు ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ లక్ష్యంతోనే కుదిరిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్, వీబీఏ ఒకే ఆలోచనా దిశతో ముందుకు సాగుతున్నాయని, నగర ప్రజల సమస్యలపై కలిసి పోరాటం చేస్తామని ఆమె పేర్కొన్నారు.
అయితే పార్టీ సీనియర్ నేతల అభిప్రాయం భిన్నంగా ఉంది. ముంబై యూనిట్‌కు సంబంధించిన ఇంత కీలక నిర్ణయాన్ని రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం గతంలో ఎప్పుడూ జరగలేదని వారు అంటున్నారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు నగర నాయకత్వంతో సరైన సంప్రదింపులు జరగలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో వీబీఏకు 10కి పైగా వార్డులు కేటాయించడం కార్యకర్తలను ఆశ్చర్యపరిచింది. ఈ వార్డుల్లో చాలావరకు బీజేపీ బలంగా ఉన్న ప్రాంతాలే కావడం గమనార్హం. దీంతో కాంగ్రెస్ ఈ ప్రాంతాల్లో పోటీకి తగిన సన్నాహాలు లేకుండానే సీట్లు వదిలేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఒక సీనియర్ కాంగ్రెస్ నేత మాట్లాడుతూ ప్రభాదేవి–మాహిమ్ వంటి ప్రాంతాల్లో వీబీఏకు సీట్లు ఇవ్వడం అర్థంకాని విషయం. అక్కడ దళితులకు వసతులు కూడా లేవు. వీబీఏకి ఇవి తొలి మునిసిపల్ ఎన్నికలే అని వ్యాఖ్యానించారు. విలే పార్లే వంటి ప్రాంతాల్లో ఉన్న ఏకైక దళిత్ వసతి ప్రాంతం బీజేపీ, ఆర్‌పీఐ కార్యకర్తల ఆధిపత్యంలో ఉందని బీజేపీ నేతలు అంటున్నారు.
కాంగ్రెస్‌కు సరైన అభ్యర్థులు లేని కారణంగానే ఈ పొత్తులు పెట్టుకుందని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. 40కి పైగా వార్డుల్లో పార్టీకి సరైన అభ్యర్థులే లేరని, ఉన్నచోట కూడా బలమైన స్థానిక నేతలను పక్కన పెట్టారని వారు చెబుతున్నారు. గోరేగావ్‌లోని ఆరే ప్రాంతాన్ని కవర్ చేసే షెడ్యూల్డ్ ట్రైబ్ రిజర్వ్ వార్డ్‌ను కూడా వీబీఏకు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు ఈ ఆరోపణలను ఖండిస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కల్ బాధ్యత కొత్త మిత్రపక్షాలను కలుపుకోవడమే తప్ప, సీట్ల సంఖ్యను నిర్ణయించడం కాదని వారు అంటున్నారు. కాంగ్రెస్‌ను కేవలం ‘మిత్రపక్షం’ అనే భావన నుంచి బయటకు తీసుకువచ్చే ప్రయత్నమే ఈ వ్యూహమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇతర పార్టీలు ఏకం కావడంతోనే
ఇటీవలి కాలంలో ఉద్ధవ్ ఠాక్రే–రాజ్ ఠాక్రే, శరద్ పవార్–అజిత్ పవార్ స్థానిక ఎన్నికల్లో దగ్గర కావడం, కాంగ్రెస్‌ను పక్కకు నెట్టే ప్రయత్నంగా పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తన స్వతంత్ర రాజకీయ దిశను తిరిగి నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ముందడుగు వేసిందని నాయకులు చెబుతున్నారు. మరాఠాలు, ఓబీసీలు, దళితులు, సంప్రదాయ ముస్లిం ఓటర్లను ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ కొత్త వ్యూహం ప్రధాన లక్ష్యమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలి కాలంలో ఈ వర్గాలు రాజకీయంగా నిర్లక్ష్యం చేయబడ్డాయనే భావనకు కాంగ్రెస్ స్వరం ఇవ్వాలని ప్రయత్నిస్తోందని అంటున్నారు.
కాంగ్రెస్ ప్రతినిధి సచిన్ సావంత్ మాట్లాడుతూ, సెక్యులర్ ఆలోచనలున్న పార్టీలన్నింటినీ కలుపుకొని ముందుకు వెళ్లడమే పార్టీ లక్ష్యమని తెలిపారు. వర్షా గైక్వాడ్ ప్రకారం, కాంగ్రెస్–వీబీఏ కలిసి త్వరలో బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం సంయుక్త మేనిఫెస్టో విడుదల చేయనున్నాయి. నగరంలో మత ఉద్రిక్తతలు, విభజన రాజకీయాలను అడ్డుకోవడమే తమ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే, 2017లో జరిగిన బీఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 31 సీట్లు మాత్రమే గెలుచుకోగా, అప్పటి అవిభాజిత శివసేన, బీజేపీలు భారీ విజయాన్ని సాధించాయి. ఈసారి తీసుకున్న కొత్త రాజకీయ మలుపు కాంగ్రెస్‌కు ఎంతవరకు లాభిస్తుందో వేచి చూడాల్సిందే.
