Let's talk: editor@tmv.in
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రూ. 47 కోట్ల కొకైన్ పట్టివేత

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రూ. 47 కోట్ల కొకైన్ పట్టివేత

Panthagani Anusha
2 నవంబర్, 2025

దేశంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం లో ఏకంగా 4.7 కిలోల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ. 47 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ హై-ప్రొఫైల్ కేసులో మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేయడంతో, ఒక పెద్ద అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ నెట్‌వర్క్ గుట్టు రట్టయింది.

డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు అందిన పక్కా సమాచారంతో కొలంబో నుంచి వచ్చిన ఒక మహిళా ప్రయాణికురాలిపై నిఘా పెట్టారు. ఆమె విమానాశ్రయానికి చేరుకోగానే అధికారులు ఆమె బ్యాగేజీని సూక్ష్మంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో, ఆమె లగేజీలో ఉన్న తొమ్మిది కాఫీ ప్యాకెట్ల లోపల దాచి ఉంచిన మారకద్రవ్యాన్ని పోలి ఉన్న తెల్లటి పొట్లాలు బయట పడ్డాయి. దీంతో వాటిని ఫీల్డ్ కిట్ ద్వారా ప్రాథమిక పరీక్ష నిర్వహించగా ఆ పదార్థం కొకైన్ అని నిర్ధారణ కావడంతో పోలీసులు వెంటనే ఆ మహిళను అరెస్ట్ చేశారు.

అరెస్ట్ అనంతరం సదరు మహిళా ఇచ్చిన సమాచారంతో కొకైన్ పార్సెల్ ను తీసుకోవడానికి విమానాశ్రయానికి వచ్చిన వ్యక్తితో పాటు, ఈ అక్రమ రవాణాకు నిధులు సమకూర్చడం, లాజిస్టిక్స్ ఏర్పాటు చేయడం, డ్రగ్స్‌ను పంపిణీ చేయడం వంటి విషయాలలో కీలక పాత్రలు పోషించిన మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. దింతో మొత్తం ఐదుగురు నిందితులపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ 1985 కింద కేసులు నమోదు చేసి ఈ అక్రమ నెట్ వర్క్ సంబంధించి ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎక్కడి నుంచి ఈ రవాణా జరుగుతుందనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

మరోవైపు ఈ విషయమై ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందిస్తూ అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు కొత్త కొత్త పద్ధతులను అవలంబిస్తోందని మరి ముఖ్యంగా భారతీయ మహిళలను డ్రగ్స్ కొరియర్‌లుగా వాడుకోవడం, మత్తుపదార్థాలను సులభంగా గుర్తించలేని విధంగా ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులలో దాచి తరలించడం వంటి పద్ధతులు పెరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. దేశ భద్రత,యువత ఆరోగ్యం దృష్ట్యా ఈ రకమైన నెట్‌వర్క్‌లను పూర్తిగా ధ్వంసం చేయడానికి దర్యాప్తు సంస్థలు నిరంతర నిఘాతో పనిచేస్తున్నాయని స్పష్టం పేర్కొంది.

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రూ. 47 కోట్ల కొకైన్ పట్టివేత - Tholi Paluku