
ముంబైలో పోలీసుల అనుమతి లేకుండానే మహా వికాస్ అఘాడి–ఎంఎన్ఎస్ భారీ ర్యాలీ
మహారాష్ట్ర ఎన్నికల జాబితాలో జరిగిన అనుమానాస్పద మార్పులపై నిరసనగా, ఓట్ చోరీ ఆరోపణలు చేస్తూ మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమి, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) పార్టీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ర్యాలీకి పోలీసుల అనుమతి లేకపోయినా, ఆందోళన కార్యక్రమం కొనసాగించాలని ఇరు పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ ర్యాలీ శనివారం మధ్యాహ్నం 1 గంటకు ముంబై మెట్రో సినిమా నుంచి ప్రారంభమై, బీఎంసీ కార్యాలయం వరకు సాగనుంది. ఇందులో శివసేన (ఉద్ధవ్) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్ తదితర నాయకులు పాల్గొననున్నారు.
అయితే ఈ ర్యాలీ నేపథ్యంలో పోలీసులను ప్రభుత్వం భారీ స్థాయిలో మోహరించింది.
96 లక్షల నకిలీ ఓట్లు
ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే ఇప్పటికే ఎన్నికల కమిషన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలోని ఓటరు జాబితాలో 9.6 మిలియన్ (96 లక్షలు) నకిలీ ఓట్లు చేర్చారు. ఇది ప్రజాస్వామ్యానికే అవమానం. అన్ని పార్టీల అధ్యక్షులు , బ్రాంచ్ అధ్యక్షులు, ఎన్నికల జాబితా అధిపతులు ఇంటింటికీ వెళ్లి ఓట్లను లెక్కించాలి. ఎన్నికల కమిషన్ ముందుగా ఈ జాబితాను ప్రక్షాళన చేయకపోతే ఎన్నికలు జరపకూడదు అని డిమాండ్ చేశారు.
ప్రతిపక్షాల ఆరోపణలు
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఎన్నికలలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని, బీజేపీ ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుడు విజయ్ వడేట్టివార్ మాట్లాడుతూ బీజేపీ ఓట్ల దొంగతనంతో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఎన్నికల కమిషన్ ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదు. అందుకే ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా అనేక మంది ప్రతిపక్ష నాయకులు కూడా ఓటరు జాబితాల్లో బీజేపీ, ఈసీ కలసి మార్పులు చేశాయని ఆరోపించారు.
ఎన్‌సీపీ–ఎస్‌సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్ ముంబైలోని ఓటర్ల జాబితాల్లో అనేక తేడాలు ఉన్నాయని, ఒకే చిరునామాలో 130 మంది పేర్లు నమోదు చేసిన ఘటనల్ని ఉదాహరించారు.
మొత్తం మీద, మహారాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై నమ్మకం కోల్పోయిన ప్రతిపక్షాలు ఈ ర్యాలీ ద్వారా తమ అసంతృప్తిని వ్యక్తం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
