Let's talk: editor@tmv.in
ముంబైలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
ముంబైలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

ముంబైలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

Gaddamidi Naveen
13 జులై, 2026

ముంబైలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు, పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం ఆయనకు అందుతున్న వైద్య సేవలు, చికిత్స పురోగతిపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌తో కొంతసేపు ప్రత్యేకంగా సమావేశమైన చంద్రబాబు, ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైందని వైద్యులు వెల్లడించడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ త్వరగా పూర్తిస్థాయిలో కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స జరగడంతో పవన్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆయన సతీమణి అన్నా కొణిదలతో కూడా మాట్లాడారు. శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులతో సమావేశమైన చంద్రబాబు, చికిత్స పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం, పవన్ కళ్యాణ్ కుడి భుజానికి జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైందని తెలిపారు. ఏళ్లుగా భుజాల సమస్య ఉన్నప్పటికీ ప్రజాసేవలో నిమగ్నమై దానిని పట్టించుకోలేదని పేర్కొన్నారు. ప్రజల్లో తిరిగే సమయంలో అభిమానుల రద్దీ, తోపులాటల కారణంగా సమస్య మరింత తీవ్రమైందన్నారు. ప్రస్తుతం మూడు వారాల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఫిజియోథెరపీ అవసరమని వైద్యులు సూచించినట్లు చెప్పారు.

మరో భుజానికి కూడా సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారని, కుడి భుజం పూర్తిగా కోలుకున్న తర్వాత ఆరు నెలల అనంతరం పరీక్షలు నిర్వహించి తదుపరి చికిత్సపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, పూర్తి ఆరోగ్యంతో త్వరలోనే ప్రజాసేవలోకి తిరిగి వస్తారని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు
PawanKalyanChandrababuNaiduAndhraPradeshDeputyCMJanaSenaAPPoliticsMumbaiHealthUpdateKokilabenHospitalCMChandrababuPawanKalyanHealth
ముంబైలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు - Tholi Paluku