
ముంబైలో దారుణం.. దివ్యాంగ మహిళలపై లైంగిక దాడులు
ముంబైలో 16 ఏళ్ల క్రితం తనపై జరిగిన లైంగిక దాడి గురించి తాజాగా ఫిర్యాదు చేస్తూ, ఓ చెవిటి–మూగ (వినికిడి, మాటల లోపం ఉన్న) మహిళ తన దీర్ఘ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది. ఈ ఫిర్యాదులో ఒకే వ్యక్తి అనేక మంది దివ్యాంగ మహిళలపై లైంగిక దాడులు చేసి, అశ్లీల వీడియోలతో బెదిరిస్తూ బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడిన ఘోర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు డిసెంబర్ 13న మహేశ్ పవార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. తనలాగే మరో మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆమెను తీవ్రంగా కలచివేయడంతో, 2009లో తనపై జరిగిన దాడి విషయాన్ని బయటపెట్టాలని ఆమె నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం, బాధితురాలు ఇటీవల తన స్నేహితులు, సహచరులతో ఉన్న వాట్సాప్ గ్రూప్ వీడియో కాల్‌లో సంకేత భాష ద్వారా తనకు జరిగిన దారుణాన్ని వెల్లడించింది. 2009లో తాను మైనర్‌గా ఉన్న సమయంలో నిందితుడు తనకు మత్తుమందు కలిపిన పానీయం తాగించి అత్యాచారం చేశాడని ఆమె తెలిపింది. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు చెప్పడంతో పాటు, థానే డెఫ్ అసోసియేషన్ అధ్యక్షుడు వైభవ్ ఘైసిస్, సామాజిక కార్యకర్త మహ్మద్ ఫర్హాన్ ఖాన్, సంకేత భాష అనువాదకురాలు మధు కేని, అలాగే అలీ యావర్ జంగ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ డిసెబిలిటీస్‌కు చెందిన ఓ రిటైర్డ్ అధికారి సహకారంతో పోలీసులను ఆశ్రయించింది.
బాధితురాలు, ఆమె భర్త, ఆమె స్నేహితులు కలిసి కురార్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా, మధు కేని అనువాదకురాలిగా ఉండగా ఆమె వాంగ్మూలాన్ని గోప్యంగా (ఇన్ కెమెరా) నమోదు చేశారు. అనంతరం కొద్ది గంటల్లోనే పాల్‌ఘర్ జిల్లా విరార్ నుంచి నిందితుడు మహేశ్ పవార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2009 జూలైలో ఓ మహిళా స్నేహితురాలు నగరం చూపిస్తానని చెప్పి తనను సాంటాక్రూజ్‌లోని వాకోలాలో ఉన్న పవార్ ఇంటికి తీసుకెళ్లిందని బాధితురాలు వాంగ్మూలంలో తెలిపింది. అక్కడ ఆ స్నేహితురాలి పుట్టినరోజు పేరుతో సమోసాలు, పానీయాలు ఇచ్చారని, తాను వద్దనుకున్నా బలవంతంగా తాగించారని పేర్కొంది. కొద్దిసేపటికి ఆ స్నేహితురాలు వెళ్లిపోవడంతో పవార్ తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది.
24 మందికి పైగా బాధితులుండే అవకాశం
అంతేకాకుండా దాడిని వీడియోగా చిత్రీకరించి, దానితో తనను బెదిరిస్తూ మౌనంగా ఉండేలా చేశాడని బాధితురాలు వెల్లడించింది. పోలీసుల దర్యాప్తులో పవార్ ఇదే తరహాలో పలువురు మాటలు, వినికిడి లోపం ఉన్న మహిళలను మత్తుమందులతో అచేతనులను చేసి లైంగిక దాడులకు పాల్పడినట్లు తేలింది. అశ్లీల వీడియోలతో బెదిరించి డబ్బు, బంగారం, మొబైల్ ఫోన్లు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొన్ని సందర్భాల్లో బలవంతంగా మహిళలకు న్యూడ్ వీడియో కాల్స్ చేసి, వాటిని రికార్డు చేసి బెదిరించేవాడని ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. ఇప్పటివరకు ఏడుగురు మహిళలపై అతడు దాడులు చేసినట్లు ఆధారాలు లభించాయి. కానీ బాధితుల సంఖ్య 24కిపైగా ఉండే అవకాశం ఉందని ఆ అధికారి పీటీఐకి తెలిపారు.
ప్రస్తుతం మహేశ్ పవార్ న్యాయ కస్టడీలో ఉన్నాడు. ఇంకా ఎవరూ అధికారికంగా ఫిర్యాదు చేయకపోయినా, బాధితులంతా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని సంకేత భాష అనువాదకురాలు మధు కేని తెలిపారు. ఒక మహిళ నుంచి వైద్య అత్యవసర పరిస్థితి కోసం తీసుకున్న డబ్బును కూడా తిరిగి ఇవ్వలేదని ఆమె ఆరోపించారు.
