Let's talk: editor@tmv.in
ముంబైలో కూలిన మెట్రో గిర్డర్ స్లాబ్

ముంబైలో కూలిన మెట్రో గిర్డర్ స్లాబ్

Pinjari Chand
15 ఫిబ్రవరి, 2026

ముంబైలో నిర్మాణంలో ఉన్న మెట్రో రైలు లైన్–4లో గిర్డర్ బ్రిడ్జ్ పరపెట్ గోడ స్లాబ్ కూలిపోవడంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం ములుంద్ ప్రాంతంలో చోటుచేసుకుందని పోలీసులు, మున్సిపల్ అధికారులు తెలిపారు. జాన్సన్ అండ్ జాన్సన్ ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న ఎల్‌బీఎస్ రోడ్డుపై మధ్యాహ్నం తర్వాత ఈ ప్రమాదం జరిగింది. కూలిన స్లాబ్ ఒక ఆటోరిక్షా, ఒక స్కోడా కారుపై పడటంతో వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు రామ్‌ధన్ యాదవ్. గాయపడినవారిలో రాజ్‌కుమార్ ఇంద్రజీత్ యాదవ్ (45), మహేంద్ర ప్రతాప్ యాదవ్ (52), దీపా రుహియా (40) ఉన్నారు. రాజ్‌కుమార్ పరిస్థితి విషమంగా ఉండగా, ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉంది. ముంబై మెట్రోపాలిటన్ రిజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంఎంఆర్డీఏ) ప్రకటన ప్రకారం, మధ్యాహ్నం 12:15 గంటల సమయంలో ములుంద్ ఫైర్ స్టేషన్ సమీపంలోని పియర్ నంబర్ 196 వద్ద పరపెట్ సెగ్మెంట్ ఒక భాగం కూలి ప్రయాణిస్తున్న ఆటోపై పడింది. మెట్రో ప్రాజెక్ట్ బృందం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టి, బీఎంసీ, విపత్తు నిర్వహణ అధికారులతో సమన్వయం చేస్తోందని పేర్కొంది. ప్రమాదానికి గల ఖచ్చిత కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. మెట్రో లైన్–4 వడాలా నుంచి తానే వరకు నిర్మాణంలో ఉంది. విక్రోలీ, భాండుప్, ములుంద్ వంటి ప్రాంతాలను కలుపుతూ ఎల్‌బీఎస్ రోడ్డుపై ఈ మార్గం వెళ్తుంది.

కాంట్రాక్టర్ ను బ్లాక్ లో పెడతారా?

ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. శివసేన (యుబిటి) నేత ఆదిత్య థాకరే మాట్లాడుతూ, గతంలో మెట్రో లైన్–3 ప్రారంభించిన వెంటనే భారీ వర్షాలతో మునిగిపోయిందని గుర్తుచేశారు. ఈ ఘటనలో కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. బహుశా కొన్ని లక్షల జరిమానా వేసి మరిన్ని టెండర్లు ఇస్తారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పనులు పూర్తికాకముందే స్తంభాలకు పెయింటింగ్ చేస్తున్నారని, ఇది రాష్ట్రానికి కోట్ల రూపాయల అదనపు భారం అవుతుందని ఆయన ఆరోపించారు. మౌలిక వసతుల పనుల్లో తగిన భద్రతా చర్యలు తీసుకోవడంలేదని, ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని విమర్శించారు.

కాంగ్రెస్ నేత వర్ష గైక్వాడ్ కూడా ప్రభుత్వాన్ని నిలదీశారు. ముంబై ప్రజల ప్రాణాలు ఇంత చౌకయ్యాయా అని ప్రశ్నించారు. మౌలిక వసతుల ప్రచారానికి కంటే ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె సూచించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మెట్రో స్తంభం కూలిపోవడం ఘోర నిర్లక్ష్యం: ముంబై మేయర్ రితు తావ్డే

ముంబైలో నిర్మాణంలో ఉన్న మెట్రో స్తంభం భాగం కూలిపోవడంతో ఒకరు మృతి చెందగా ముగ్గురికి గాయాలైన ఘటనపై మేయర్ రీతూ తావ్డే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన భారీ నిర్లక్ష్యానికి ఫలితమని ఆమె పేర్కొన్నారు. ములుంద్ లోని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సమీపంలో జరిగిన ప్రమాద స్థలాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ ఏమి జరిగిందో కచ్చితంగా తెలుసుకోవాలి. ఇది భారీ నిర్లక్ష్యం. పరపెట్ బాడీ(వంతెన పక్కన ఉండే కాంక్రీట్ అంచు గోడ) నిన్నే అమర్చారని తెలిసింది. భద్రతా ప్రమాణాలు పాటించారా? క్రింద ట్రాఫిక్‌ను తాత్కాలికంగా నిలిపివేయాల్సింది. గాయపడినవారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, ఒకరు మృతి చెందారని తెలిపారు.

ముంబై మెట్రో స్తంభం కూలిన ఘటనపై విచారణకు సీఎం ఆదేశం

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ములుంద్‌లో మెట్రో నిర్మాణ సమయంలో స్లాబ్ కూలి ఒకరు మృతి చెందగా పలువురు గాయపడిన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తక్షణ విచారణకు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది. గాయపడిన వారి చికిత్స ఖర్చులను కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఈ ఘటన గురించి తెలుసుకున్నారని,పూర్తి వివరాలు తెలుసుకొని తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. స్తంభం కూలడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇదే విషయంపై ముంబై డిప్యూటీ మేయర్ సంజయ్ ఘాడీ మాట్లాడుతూ, నలుగురు గాయపడినట్లు ధృవీకరించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండి ఐసీయూలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని, తప్పిదం చేసినవారిపై చట్టపరమైన చర్యలు తప్పనిసరిగా ఉంటాయని పేర్కొన్నారు.