Let's talk: editor@tmv.in
ముంబైలో అక్రమంగా రవాణా చేస్తున్న11 కిలోల బంగారం పట్టివేత

ముంబైలో అక్రమంగా రవాణా చేస్తున్న11 కిలోల బంగారం పట్టివేత

Pinjari Chand
13 నవంబర్, 2025

దేశ ఆర్థిక రాజధానిలో బంగారం అక్రమ రవాణాపై రెవిన్యూ ఇంటెలిజెన్స్‌ డైరెక్టరేట్‌ (డీఆర్ఐ) గట్టి దెబ్బ కొట్టింది. ‘ఆపరేషన్‌ బులియన్‌ బ్లేజ్‌’ పేరుతో నిర్వహించిన దాడుల్లో అధికారులు పెద్ద స్మగ్లింగ్‌ ముఠాను పట్టుకున్నారు.

విశ్వసనీయ సమాచారం ఆధారంగా నవంబర్‌ 10న ముంబైలోని నాలుగు రహస్య కేంద్రాలపై ఏకకాలంలో దాడులు జరిగాయి. వీటిలో రెండు అక్రమంగా నడుస్తున్న బంగారం కరిగించే యూనిట్లు, మరో రెండు రిజిష్టర్ కానీ దుకాణాలు ఉన్నాయి.

దాడి సమయంలో బంగారం కరిగించే ఫర్నేస్‌లు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. అధికారులు చాకచక్యంగా వ్యవహరించి అక్కడి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. 6.35 కిలోల బంగారాన్ని అక్కడే స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముఠా నాయకుడు నిర్వహిస్తున్న రెండు షాపుల్లో సోదాలు చేసి, మరో 5.53 కిలోల బంగారం బార్లను సీజ్‌ చేశారు. మొత్తంగా 11.88 కిలోల 24 క్యారట్‌ బంగారం (విలువ రూ.15.05 కోట్లు), 8.72 కిలోల వెండిని (రూ.13.17 లక్షలు) స్వాధీనం చేసుకున్నారు.

ఈ ముఠా కార్యకలాపాలను ఒక పాత స్మగ్లర్‌ తన తండ్రి, మేనేజర్‌, నలుగురు అభరణాలు కరిగించే వారు, అధికారి, ముగ్గురు డెలివరీ సిబ్బందితో కలిసి నడిపిస్తున్నట్లు తేలింది. వీరందరినీ అరెస్ట్‌ చేసి, ముంబై జీఎంఎఫ్‌సీ ముందు హాజరు పరిచారు. న్యాయస్థానం రిమాండ్‌లోకి పంపింది.

విచారణలో పక్కా ప్రణాళికతో అక్రమ రవాణా నెట్‌వర్క్‌ అని తేలింది. దేశ బంగారం దిగుమతి విధానాలను ఉల్లంఘిస్తూ ప్రభుత్వానికి నష్టం కలిగించే ఉద్దేశంతో నడుస్తోందని అధికారులు గుర్తించారు. దేశ ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీయాలనే కుట్రలను సహించమని డీఆర్ఐ స్పష్టం చేసింది. బంగారం అక్రమ రవాణా, బ్లాక్ మార్కెట్‌ లావాదేవీలను అరికట్టేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గతంలో కూడా భారీగా బంగారాన్ని అక్రమ రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. అందులో

జూన్‌ 2023: డీఆర్ఐ అధికారులు ముంబై విమానాశ్రయంలో రెండు వేర్వేరు కేసుల్లో 10 కిలోలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మే 2022: ఆకాశ మార్గం ద్వారా దేశంలోకి బంగారం అక్రమంగా తెస్తున్న 11 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు డీఆర్ఐ వెల్లడించింది.

అక్టోబర్‌ 2025: ‘ఆపరేషన్‌ గోల్డెన్‌ స్వీప్‌’ పేరిట జరిగిన ప్రత్యేక దాడిలో 10.5 కిలోల 24 క్యారట్‌ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో విమానాశ్రయ సిబ్బందితో సహా 13 మందిని అరెస్ట్‌ చేశారు.

దీంతో ముంబై ఎయిర్‌పోర్టు బంగారం అక్రమ రవాణా నెట్‌వర్క్‌లకు కేంద్ర బిందువుగా మారింది.డీఆర్ఐ దాడులతో అనేక సార్లు స్మగ్లింగ్‌ రాకెట్లు బట్టబయలయ్యాయని అధికారులు చెబుతున్నారు.

ముంబైలో అక్రమంగా రవాణా చేస్తున్న11 కిలోల బంగారం పట్టివేత - Tholi Paluku