
ముంబైకి రైతుల లాంగ్‌మార్చ్
భూ హక్కులు సహా పలు డిమాండ్ల సాధన కోసం మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ముంబై వైపు వేలాది రైతులు, గిరిజనులు లాంగ్‌మార్చ్ చేపట్టారు. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం నిరసనకారుల ప్రతినిధి బృందాన్ని మంగళవారం చర్చలకు ఆహ్వానించినట్లు ఉద్యమ నేతలు తెలిపారు. సీపీఐ(ఎం) అనుబంధ ఆల్ ఇండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) ఆధ్వర్యంలో, ఎర్రజెండాలు చేతబట్టి ఆదివారం ఈ లాంగ్‌మార్చ్ ప్రారంభమైంది. నాసిక్ జిల్లా దిండోరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన నిరసనలకు సరైన హామీ లభించకపోవడంతో, తమ డిమాండ్లను నేరుగా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుని ముంబైకి పాదయాత్రగా బయలుదేరినట్లు మాజీ ఎమ్మెల్యే జేపీ గవిట్ తెలిపారు.
మార్చ్‌లో పాల్గొన్న రైతులు ఇప్పటికే దాదాపు 60 కిలోమీటర్లు ప్రయాణించారు. మంగళవారం ఉదయం కసారా ఘాట్ మార్గంగా నుంచి, నాసిక్ జిల్లా దాటి పొరుగున ఉన్న థానే జిల్లాలోకి ప్రవేశించినట్లు ఆయన చెప్పారు. నిరసన కాలంలో అవసరమైన ఆహారం, ధాన్యం, కట్టెలు తదితర సరఫరాల కోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేశారని తెలిపారు. ఈ లాంగ్‌మార్చ్‌కు మీడియాలో విస్తృత ప్రచారం లభించడంతో, రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించిందని గవిట్ పేర్కొన్నారు. మంగళవారం ముంబైలోని మంత్రాలయంలో ముఖ్యమంత్రి సహా సంబంధిత మంత్రులతో జరిగే చర్చల్లో తాను, సీపీఐ(ఎం) పాలిట్‌బ్యూరో సభ్యుడు, ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు అశోక్ ధావ్లే, కిసాన్ సభ జాతీయ సంయుక్త కార్యదర్శి అజిత్ నవలే, ఎమ్మెల్యే వినోద్ నికోల్ పాల్గొంటారని తెలిపారు. పేత్, సుర్గానా, కల్వాన్, త్రయంబకేశ్వర్ తాలూకాలకు చెందిన గిరిజన రైతులు ఈ ఉద్యమంలో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని చెప్పారు.
ప్రధాన డిమాండ్లు
ఈ ప్రాంతాలు కరువు ప్రాంతాలుగా ఉండటంతో, పశ్చిమ దిశగా ప్రవహించే నదులు, వాటి ఉపనదులపై పెద్ద చెక్‌డ్యామ్‌లు నిర్మించి సాగునీరు అందించాలన్నది రైతుల ప్రధాన డిమాండ్‌గా ఉంది. అదేవిధంగా, నాలుగు హెక్టార్ల వరకు ఆక్రమిత భూముల్లో సాగు చేసిన రైతులకు క్రమబద్ధీకరణ, భూ రికార్డుల జారీ, తిరస్కరించిన అటవీ హక్కుల దరఖాస్తుల పునఃపరిశీలన, అటవీ భూముల్లో సాగు చేస్తున్న రైతుల నుంచి కనీస మద్దతు ధరకు పంటల కొనుగోలు వంటి డిమాండ్లను వారు ముందుంచారు. ఇక దిండోరి ప్రాంతంలో గత రెండు రోజులుగా జరిగిన ధర్నాల కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి, వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. నాసిక్ కలెక్టర్ ఆయుష్ ప్రసాద్‌తో ఇప్పటికే సమావేశం జరగగా, స్థానిక సమస్యలను జిల్లా స్థాయిలో పరిష్కరించేందుకు, రాష్ట్రస్థాయి డిమాండ్లను ముంబైలో చర్చించేందుకు అంగీకారం కుదిరినట్లు గవిట్ తెలిపారు.
