Let's talk: editor@tmv.in
ముందు పునరావాసం కల్పించి.. తర్వాతే మూసీ ప్రాజెక్టు చేపట్టండి: ఎన్. రామచందర్ రావు

ముందు పునరావాసం కల్పించి.. తర్వాతే మూసీ ప్రాజెక్టు చేపట్టండి: ఎన్. రామచందర్ రావు

Gaddamidi Naveen
15 మార్చి, 2026

మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడం సరికాదని, ప్రాజెక్టు కంటే ముందే నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మూసీ ప్రక్షాళనపై ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేశారు.

వేల కోట్లు ఖర్చు చేసే ముందు, మూసీలోకి వచ్చి చేరుతున్న మురుగునీరు, డ్రైనేజీ ప్రవాహాలను అరికట్టాలని రామచందర్ రావు కోరారు. మూసీని మురుగు కుంటగా మారుస్తున్న ఉప నదుల వద్ద మురుగునీటి శుద్ధి ప్లాంట్లు నిర్మించడంపై దృష్టి పెట్టాలి. అలాగే, బఫర్ జోన్‌ను 50 మీటర్ల నుంచి 12 మీటర్లకు తగ్గించాలి. మధ్యతరగతి ప్రజలు కష్టపడి చట్టబద్ధంగా నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయడం సమంజసం కాదు అని ఆయన అన్నారు. మూసీ నది పునరుద్ధరణకు తాము వ్యతిరేకం కాదని, కానీ అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడాన్ని సహించబోమని ఆయ‌న అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరావాసం గురించి ఆలోచించకుండా కేవలం కూల్చివేతలపైనే దృష్టి పెట్టడం ఆందోళనకరమని ఆయ‌న‌ పేర్కొన్నారు.

దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత ఉందంటూ కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న దుష్ప్రచారాన్ని ఆయ‌న‌ తీవ్రంగా ఖండించారు. దేశవ్యాప్తంగా రోజుకు సగటున 55 లక్షల సిలిండర్లు బుక్ అవుతుంటే, కాంగ్రెస్ బాధ్యతారహిత వ్యాఖ్యల వల్ల ఆ సంఖ్య 77 లక్షలకు చేరి ప్రజల్లో అనవసర భయం నెలకొందని ఆయన విమర్శించారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో విపక్ష నేతలు సిలిండర్లను అక్రమంగా నిల్వ చేస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒకప్పుడు 1958లో కొరియా యుద్ధాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆర్థిక వివరణలు దేశం చూసింది. కానీ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎల్పీజీ సరఫరా, ధరల స్థిరత్వం క్రమంగా కాపాడబడుతోందని చెప్పారు.

రాహుల్ గాంధీపై నిరసన

పార్లమెంటును ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఒక 'పిక్నిక్ స్పాట్' లా భావిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సభలోకి ఆహార పదార్థాలు తీసుకురావడం, మెట్లపై కూర్చుని టీ తాగడం వంటి చర్యలు చట్టసభల పవిత్రతను అపహాస్యం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ తీరుకు నిరసనగా తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేసినట్లు తెలిపారు. ప్రజల ప్రాథమిక అవసరాలను రాజకీయాల కోసం వాడుకోవద్దని, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని ఆయన కాంగ్రెస్ పార్టీకి హితవు పలికారు.

సీఎం రేవంత్ రెడ్డి వివరణ

అంతకుముందు శుక్రవారం 'మూసీ ఇన్వైట్స్' కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధికి ఒక "గ్రోత్ ఇంజిన్" లాంటిదని అభివర్ణించారు. మేము చేస్తున్న అభివృద్ధి భవిష్యత్తు తరాల కోసం. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. ఇది ఎవరికీ వ్యతిరేకం కాదు, ఎవరి ఆస్తులను బలవంతంగా లాక్కోవడానికి ఉద్దేశించినది కాదు అని సీఎం స్పష్టం చేశారు. నిర్వాసితులకు కేవలం ఇళ్లు మాత్రమే కాకుండా, పాఠశాలలు, ఇతర వసతులతో పాటు అదే ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాక, గాంధీ విగ్రహం కోసం రూ.5,000 కోట్లు ఖర్చు చేస్తున్నారన్న ప్రతిపక్షాల ఆరోపణలను ముఖ్యమంత్రి కొట్టిపారేశారు. శాంతి మార్గంలో యుద్ధాలను గెలవచ్చని నిరూపించిన మహాత్మా గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం మనందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.