Let's talk: editor@tmv.in
ముందుగానే పార్టీకి సమాచారం ఇచ్చాను: శశిథరూర్

ముందుగానే పార్టీకి సమాచారం ఇచ్చాను: శశిథరూర్

Pinjari Chand
25 జనవరి, 2026

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కీలక సమావేశానికి హాజరుకాకపోవడంపై తొలిసారి స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్, తాను ఆ సమావేశానికి హాజరుకాలేననే విషయం ముందుగానే పార్టీ నాయకత్వానికి తెలియజేశానని స్పష్టం చేశారు. కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో పాల్గొన్న సందర్భంగా థరూర్ మాట్లాడుతూ, ఈ అంశంపై మీడియాలో వచ్చిన కొన్ని వార్తలు నిజమై ఉండొచ్చని, మరికొన్ని నిజం కాకపోవచ్చని అన్నారు. అయితే ఇలాంటి విషయాలను పబ్లిక్ వేదికపై చర్చించడం తగదని, పార్టీ అంతర్గతంగా నాయకత్వంతోనే మాట్లాడటం మంచిదని వ్యాఖ్యానించారు. మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. వాటిలో కొన్ని నిజం కావచ్చు, మరికొన్ని కాకపోవచ్చు. ఇలాంటి అంశాలను బహిరంగంగా చర్చించాల్సిన అవసరం లేదు. నేను సమావేశానికి హాజరుకాలేనని విషయాన్ని ముందుగానే పార్టీకి తెలిపాను. నాకు చెప్పాల్సినదంతా పార్టీ లోపలే చెబుతానని అన్నారు.

కేరళ లిటరేచర్ ఫెస్టివల్ కు హాజరయ్యాను

కేరళ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలపై చర్చించేందుకు జరిగిన కీలక ఏఐసీసీ సమావేశానికి శశి థరూర్ హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి హాజరుకాలేనని థరూర్ పార్టీ నాయకత్వానికి ముందుగానే తెలియజేశారని, ఇప్పటికే వాయిదా పడిన ఆ సమావేశం రోజున ఆయనకు కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో ముందస్తు కమిట్‌మెంట్లు ఉండటమే కారణమని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఉత్సవంలో ఆయన తన తాజా పుస్తకం ‘శ్రీ నారాయణ గురు’పై ప్రసంగించేందుకు హాజరయ్యారు. డాక్టర్ థరూర్ కోజికోడ్‌లో జరుగుతున్న ఆసియాలోనే అతిపెద్ద సాహిత్య ఉత్సవమైన కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో పాల్గొంటున్నారు. ఆయన తాజా పుస్తకంపై మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని పార్టీకి ముందుగానే తెలియజేశారని థరూర్ కార్యాలయం తెలిపింది. ఎర్నాకులం వివాదంపై నాకు చెప్పడానికి ఏమీ లేదు. ఈ పుస్తకాన్ని ఇక్కడ విడుదల చేయాలనుకున్నాను. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో పుస్తక ఆవిష్కరణ రాజకీయ బాధ్యతల కారణంగా వాయిదా పడింది. అందుకే కోజికోడ్ కార్యక్రమానికి హాజరయ్యానని థరూర్ తెలిపారు.

ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు

ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సంస్థాగత ప్రధాన కార్యదర్శి కే.సీ.వేణుగోపాల్, రాహుల్ గాంధీ, జైరాం రమేష్, దీపా దాస్‌మున్షీ, మీరా కుమార్ తదితర సీనియర్ నేతలు హాజరయ్యారు. థరూర్ విషయంలో పార్టీ నాయకత్వంతో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. పార్టీ నేత షఫీ పరంబిల్ మాట్లాడుతూ ఆయన ఈ విషయంపై నాయకత్వంతో మాట్లాడారు. కేరళ లిటరేచర్ ఫెస్టివల్ ఆయన ప్రతి ఏడాది హాజరయ్యే ముఖ్యమైన కార్యక్రమం. ఇది సమావేశాన్ని తప్పించుకోవడం గురించి కాదు, పార్టీ భవిష్యత్ పై చర్చ గురించే అన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపా దాస్‌మున్షీ కూడా స్పందిస్తూ థరూర్ పార్టీకి ప్రాధాన్యత ఇస్తారు. పుస్తకావిష్కరణ కారణంగానే సమావేశానికి రాలేకపోయారు. పార్టీ నాయకత్వంతో ఆయనకు ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. థరూర్ పార్టీ నాయకత్వంతో అసంతృప్తిగా ఉన్నారా? అనే ప్రశ్నకు ఆమె లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీతో పూర్తిగా సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశారు.

ఇదే తొలిసారి కాదు గతంలో కూడా శశి థరూర్ ఏఐసీసీ సమావేశాలకు హాజరుకాని సందర్భాలున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత వైఖరిని ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏర్పాటు చేసిన ‘ఆపరేషన్ సిందూర్’ బహుళ పార్టీ ప్రతినిధి బృందంలో ఆయన పాల్గొనడంపై కూడా అప్పట్లో కాంగ్రెస్ లోపల విమర్శలకు దారితీశాయి. ఆ బృందంలో రాహుల్ గాంధీ, ఖర్గే, జైరాం రమేష్ వంటి సీనియర్ నేతలకు ఆహ్వానం లేకపోవడమే ఆ విమర్శలకు కారణమైంది.

ముందుగానే పార్టీకి సమాచారం ఇచ్చాను: శశిథరూర్ - Tholi Paluku