Let's talk: editor@tmv.in
ముందస్తు బెయిల్ కోరుతూ పవన్ ఖేరా పిటిషన్.. నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ

ముందస్తు బెయిల్ కోరుతూ పవన్ ఖేరా పిటిషన్.. నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ

Gaddamidi Naveen
9 ఏప్రిల్, 2026

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కుటుంబంపై చేసిన ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఏఐసీసీ మీడియా విభాగం ఛైర్మన్ పవన్ ఖేరా రాజకీయంగా, న్యాయపరంగా పోరాటాన్ని ఉధృతం చేశారు. తనపై అస్సాం పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్టు కాకుండా రక్షణ కోరుతూ ఆయన బుధవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

పవన్ ఖేరా ఢిల్లీ నివాసంలో అస్సాం పోలీసులు సోదాలు నిర్వహించిన మరుసటి రోజే ఆయన ఈ న్యాయపోరాటాన్ని ప్రారంభించారు. తన నివాస చిరునామా హైదరాబాద్‌లో ఉందని పేర్కొంటూ, అరెస్టు జరిగిన పక్షంలో తనను బెయిల్‌పై విడుదల చేయాలని ఆయన కోర్టును కోరారు. పవన్ ఖేరా భార్య తెలంగాణకు చెందిన వారు కావడం, ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఆయన ఇక్కడి కోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఏప్రిల్ 7న దాఖలైన ఈ పిటిషన్‌ను హైకోర్టు గురువారం (నేడు) ఉదయం విచారించనుంది. ఇందులో గువహటి క్రైమ్ బ్రాంచ్ డీసీపీ, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చారు. తాను చట్టాన్ని గౌరవించే పౌరుడినని, తనకు ఎలాంటి నేరచరిత్ర లేదని ఖేరా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీలో కీలక పదవిలో ఉన్నందున, దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని, కావున తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని విన్నవించారు.

వివాదం ఎక్కడ మొదలైంది?

ఏప్రిల్ 5న నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పవన్ ఖేరా మాట్లాడుతూ.. అస్సాం సీఎం భార్య రినికి భుయాన్ శర్మకు ఒకటి కంటే ఎక్కువ పాస్‌పోర్టులు ఉన్నాయని, అలాగే ఆమెకు విదేశాల్లో ఆస్తులు ఉన్నాయని ఆరోపించారు. వీటిని ముఖ్యమంత్రి తన ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించలేదని ఆయన విమర్శించారు. అయితే, ఈ ఆరోపణలను శర్మ కుటుంబం తీవ్రంగా ఖండించింది. ఇవి పూర్తిగా అవాస్తవాలని, దురుద్దేశపూర్వకమైనవని పేర్కొంటూ రినికి భుయాన్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గువహటి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పవన్ ఖేరాపై భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద ఖేరాపై కేసులు నమోదయ్యాయి.సెక్షన్ 175 ఎన్నికలకు సంబంధించి తప్పుడు ప్రకటనలు చేయడం. సెక్షన్ 318 మోసపూరిత చర్యలు.సెక్షన్ 35 వ్యక్తిగత రక్షణకు సంబంధించిన అంశాలుగా పేర్కొన్నారు. ఖేరాను ప్రశ్నించేందుకు అస్సాం పోలీసుల బృందం ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్ళినప్పటికీ ఆయన అక్కడ అందుబాటులో లేరు. సోదాల సమయంలో కొన్ని కీలకమైన ఆధారాలు లభించాయని పోలీసులు పేర్కొన్నారు.

న్యాయవాది వాదన..

పవన్ ఖేరా తరపు న్యాయవాది పొన్నం అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎఫ్‌ఐఆర్ కాపీని పోలీస్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయలేదని విమర్శించారు. అంతేకాకుండా, ఖేరాను అరెస్టు చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఢిల్లీ నివాసంలో అస్సాం పోలీసులు సోదాలు నిర్వహించారని, అందుకే ముందస్తు బెయిల్ కోరినట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి హెచ్చరిక

అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మంగళవారం మాట్లాడుతూ.. కనీస ఆధారాలు లేకుండా తన కుటుంబంపై ఆరోపణలు చేస్తోందని సీఎం హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు. ఖేరా భయంతో హైదరాబాద్‌కు పారిపోయారని, కానీ అస్సాం పోలీసులు ఆయనను పాతాళంలో ఉన్నా వదలరని తీవ్రంగా హెచ్చరించారు. దీనిపై బుధవారం ఒక రహస్య ప్రాంతం నుంచి ఖేరా వీడియో విడుదల చేస్తూ.. మేము మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగాము. దానికి సమాధానం చెప్పకుండా పోలీసులను నాపైకి ఎందుకు ఉసిగొల్పుతున్నారు? మిమ్మల్ని చూసి నేను భయపడటం లేదు, కానీ అడగాల్సిన ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి, అందుకే పోలీసులకు దొరకడం లేదు అని స్పష్టం చేశారు. అస్సాంలో నేడు (గురువారం) ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ పరిణామాలు రాజకీయ వేడిని పెంచాయి. తెలంగాణ హైకోర్టు ఇచ్చే తీర్పు ఖేరా భవిష్యత్తును అస్సాం పోలీసుల తదుపరి చర్యలను నిర్ణయించనుంది.