Let's talk: editor@tmv.in
మీ బైక్ ప్రమాదానికి గురైందా.. ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇలా చేసుకోండి

మీ బైక్ ప్రమాదానికి గురైందా.. ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇలా చేసుకోండి

Pinjari Chand
25 జనవరి, 2026

రోడ్డు ప్రమాదాలు ఎప్పుడూ చెప్పిరావు. అకస్మాత్తుగా సంభవిస్తాయి. ప్రమాదం జరిగిన వెంటనే మనసులో భయం, ఆందోళన, గందరగోళం చోటు చేసుకుంటాయి. అటువంటి సమయంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రక్రియ గురించి ఆలోచించడం చాలామందికి కష్టంగా మారుతుంది. ఆలోచించడం అటుంచి చాలామందికి ఇన్సూరెన్స్ ను ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి, ఎవరినీ సంప్రందించాలి అన్న విషయాలు తెలియవు. కానీ ముందుగానే సరైన అవగాహన ఉంటే బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను సులభంగా పూర్తిచేసి, చాలా వరకు ఆర్థిక నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ప్రమాదం తర్వాత అనుసరించాల్సిన సరైన విధానం మీ సమయాన్ని, డబ్బును ఆదా చేయడమే కాకుండా, బైక్ రిపేర్లు త్వరగా పూర్తయ్యేలా చేస్తుంది. బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను విజయవంతంగా దాఖలు చేయడానికి అనుసరించాల్సిన ముఖ్యమైన దశలను నిపుణులు ఇలా సూచిస్తున్నారు.

ముందుగా భద్రతను నిర్ధారించుకోండి

ప్రమాదం జరిగిన వెంటనే ముందు మీ భద్రతను, ఇతరుల భద్రతను నిర్ధారించుకోవడం అత్యంత ముఖ్యం. చిన్న ప్రమాదమైనా శరీరానికి షాక్ తగిలే అవకాశం ఉంటుంది. అందుకే ప్రశాంతంగా ఆలోచిస్తూ, మీకు లేదా ఇతరులకు గాయాలయ్యాయా లేదా అని ఓసారి పరిశీలించాలి. సాధ్యమైనంత వరకు బైక్‌ను రోడ్డు పక్కకు తరలించి ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా చూడాలి. బైక్ ఇంజిన్‌ను ఆఫ్ చేసి, హాజర్డ్ లైట్లు ఉంటే ఆన్ చేయాలి. గాయాలైనట్లయితే వెంటనే అంబులెన్స్ లేదా వైద్య సహాయం కోరకు సంప్రదించాలి. బైక్ కదలని స్థితిలో ఉంటే రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సేవలను వినియోగించుకోవచ్చు.

పోలీసులకు సమాచారం ఇవ్వాలి

ప్రతి ప్రమాదానికి ఎఫ్‌ఐఆర్ అవసరం ఉండకపోవచ్చు. అయితే కొన్ని పరిస్థితుల్లో మాత్రం పోలీసులకు సమాచారం ఇవ్వడం తప్పనిసరి. బైక్ దొంగతనం, మూడో వ్యక్తికి గాయాలు, ప్రాణనష్టం, లేదా భారీ ఆస్తి నష్టం జరిగినప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. అలాగే బాధ్యత ఎవరిది అనే విషయంలో సందేహం ఉన్నప్పుడు లేదా న్యాయపరమైన వివాదం తలెత్తే అవకాశం ఉన్నప్పుడు పోలీసు ఫిర్యాదు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. చిన్న ప్రమాదాల్లో మూడో వ్యక్తి ప్రమేయం లేకపోతే కొన్నిసార్లు ఇన్సూరెన్స్ కంపెనీలు ఎఫ్‌ఐఆర్ కోరకపోవచ్చు. అయినప్పటికీ ముందుగా ఇన్సూరెన్స్ సంస్థను సంప్రదించి స్పష్టంగా తెలుసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం ఇవ్వాలి

ప్రమాదం జరిగిన తర్వాత ఆలస్యం చేయకుండా ఇన్సూరెన్స్ సంస్థకు సమాచారం ఇవ్వడం అత్యంత కీలకం. అయితే ఇవ్వలేని పరిస్థితుల్లో (నిజమైన, అనివార్య పరిస్థితుల్లో ఆలస్యం జరిగితే చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్‌ను తిరస్కరించవు). వారికి సరైన కారణాలు తెలపాలి. లేకుంటే చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్ ఇన్టిమేషన్‌కు నిర్దిష్ట గడువును విధిస్తాయి. ఆ గడువు దాటితే క్లెయిమ్ తిరస్కరణకు కూడా అవకాశం ఉంటుంది. మొబైల్ యాప్, అధికారిక వెబ్‌సైట్ లేదా కస్టమర్ కేర్ హెల్ప్‌లైన్ ద్వారా బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేయవచ్చు. ఈ సమయంలో పాలసీ నంబర్, ప్రమాదం జరిగిన తేదీ, సమయం, ప్రదేశం, సంఘటన వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలి. క్లెయిమ్ నమోదు అయిన వెంటనే ఒక క్లెయిమ్ రిఫరెన్స్ నంబర్ అందుతుంది.

నష్టాన్ని సరిగా డాక్యుమెంట్ చేయాలి

క్లెయిమ్ ఆమోదం పొందడంలో డాక్యుమెంటేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. బైక్‌కు జరిగిన నష్టాన్ని స్పష్టంగా చూపేలా వివిధ కోణాల్లో ఫోటోలు, వీడియోలు తీయాలి. కనీసం ఒక ఫోటోలో బైక్ నంబర్ ప్లేట్ స్పష్టంగా కనిపించేలా చూసుకోవాలి. ప్రమాద స్థలం, దెబ్బతిన్న భాగాలు, ఇతర వాహనాల ప్రమేయం ఉంటే వాటి వివరాలు కూడా ఫోటోల రూపంలో భద్రపరచాలి. వీలైనంత వరకు బైక్‌ను కదిలించే ముందు ఈ ఫోటోలు తీయడం మంచిదని సూచిస్తున్నారు.

పాలసీ కవరేజ్ తెలుసుకోవాలి

క్లెయిమ్ ఫారం నింపే ముందు మీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీలో ఏమేం కవరేజ్‌లు ఉన్నాయో తెలుసుకోవడం అవసరం. కాంప్రెహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ ఉంటే స్వంత నష్టం (ఓన్ డ్యామేజ్), మూడో వ్యక్తి కవరేజ్ వంటి అంశాలు పాలసీ నిబంధనల ప్రకారం వర్తిస్తాయి. పాలసీలో ఉన్న మినహాయింపులు (ఎక్స్‌క్లూజన్స్), డిడక్టిబుల్స్ గురించి ముందుగానే తెలుసుకుంటే క్లెయిమ్ సమయంలో అనవసర ఆశాభంగం ఉండదు. అలాగే రోడ్డు ప్రమాదాలే కాకుండా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, ప్రమాదవశాత్తూ కాలిపోయినప్పుడు తదితర వాటి గురించి మొదట్లోనే విచారించుకోవాలి.

క్లెయిమ్ ఫారం సమర్పించాలి

తదుపరి దశగా క్లెయిమ్ ఫారాన్ని ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దాఖలు చేయాలి. ఆన్‌లైన్ క్లెయిమ్ ప్రక్రియ వేగంగా పూర్తవడంతో పాటు క్లెయిమ్ స్థితిని సులభంగా ట్రాక్ చేసుకునే వీలుంటుంది.

కావాల్సిన పత్రాలు

• బైక్ ఇన్సూరెన్స్ పాలసీ కాపీ

• రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ)

• ప్రమాద సమయంలో బైక్ నడిపిన వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్

• ఎఫ్‌ఐఆర్ కాపీ (అవసరమైతే)

• రిపేర్ అంచనాలు, తుది బిల్లులు

పూర్తి, సరైన పత్రాలు సమర్పిస్తే క్లెయిమ్ ఆలస్యం కాకుండా పూర్తవుతుంది.

సర్వే, పరిశీలన

క్లెయిమ్ నమోదు అనంతరం ఇన్సూరెన్స్ సంస్థ ఒక సర్వేయర్‌ను నియమిస్తుంది. సర్వేయర్ బైక్‌ను పరిశీలించి, నష్టం వివరాలను నమోదు చేస్తారు. సర్వే పూర్తయ్యే వరకు ఇన్సూరెన్స్ సంస్థ అనుమతి లేకుండా బైక్ రిపేర్లు ప్రారంభించకూడదు. పరిశీలన సమయంలో సర్వేయర్ అడిగే వివరాలను అందించి పూర్తి సహకారం అందించాలి. సర్వే రిపోర్ట్ ఆధారంగానే క్లెయిమ్ ఆమోదం పొందుతుంది.

బైక్ రిపేర్లు..క్లెయిమ్ సెటిల్‌మెంట్

సర్వే పూర్తైన తర్వాత బైక్ రిపేర్లు ప్రారంభించవచ్చు. నెట్‌వర్క్ గ్యారేజ్‌లో రిపేర్లు చేయించుకుంటే క్యాష్‌లెస్ క్లెయిమ్ సదుపాయం లభిస్తుంది. ఇందులో ఇన్సూరెన్స్ సంస్థ నేరుగా గ్యారేజ్‌కు చెల్లింపులు చేస్తుంది. పాలసీలో కవరేజ్ లేని మొత్తాన్ని మాత్రమే కస్టమర్ చెల్లించాలి. నెట్‌వర్క్ కాని గ్యారేజ్‌ను ఎంచుకుంటే ముందుగా మీరు రిపేర్ ఖర్చు చెల్లించి, తరువాత బిల్లులు, రిసీప్ట్‌లు సమర్పించి రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేయాలి. అన్ని పత్రాల పరిశీలన అనంతరం పాలసీ నిబంధనల ప్రకారం క్లెయిమ్ మొత్తం చెల్లిస్తారు.

క్లెయిమ్ సమయంలో సాధారణంగా చేసే 5 తప్పులు

ఇన్సూరెన్స్ నిపుణుల ప్రకారం ఈ తప్పుల వల్ల చాలా క్లెయిమ్‌లు ఆలస్యం కావడం, తిరస్కరణకు గురవుతున్నాయి.

• క్లెయిమ్ సమాచారం ఆలస్యంగా ఇవ్వడం

• సర్వేకు ముందు బైక్ రిపేర్లు చేయించడం

• అసంపూర్తి లేదా తప్పుడు పత్రాలు సమర్పించడం

• పాలసీ కవరేజ్, మినహాయింపులను సరిగా అర్థం చేసుకోకపోవడం

• ప్రమాద వివరాల్లో స్పష్టత లేకపోవడం

ప్రమాదం జరిగిన తర్వాత సరైన విధానాన్ని అనుసరిస్తే బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రక్రియ చాలా సులభంగా పూర్తవుతుందని నిపుణులు చెబుతున్నారు. సమయానికి సమాచారం ఇవ్వడం, సరైన డాక్యుమెంటేషన్, పాలసీ అవగాహన ఉంటే క్లెయిమ్ త్వరగా సెటిలవుతుందని ఇన్సూరెన్స్ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.