Let's talk: editor@tmv.in
మీ ప్రేమ అద్భుతం:మెస్సీ

మీ ప్రేమ అద్భుతం:మెస్సీ

Pinjari Chand
16 డిసెంబర్, 2025

ప్రారంభంలో కొంత గందరగోళంతో మొదలైన లియోనెల్ మెస్సీ గ్రేటేస్ట్ ఆఫ్ ఆల్ టైం (జీఓఏటీ) ఇండియా టూర్, చివరికి ఘనమైన వీడ్కోలుతో ముగిసింది. ఫుట్‌బాల్ ప్రపంచంలో లెజెండ్ గా భావించే మెస్సీ, భారత అభిమానులకు కేవలం 30 నిమిషాల్లోనే జీవితాంతం మరిచిపోలేని జ్ఞాపకాలను అందిస్తూ భారతదేశానికి మళ్లీ తప్పకుండా వస్తాను అని హామీ ఇచ్చారు. సోమవారం న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఫుట్‌బాల్‌నే కేంద్రబిందువుగా చేసుకున్న ఈ కార్యక్రమం జరిగింది. సాధారణంగా క్రికెట్‌కే పరిమితమయ్యే ఈ మైదానం, ఈసారి మెస్సీ మాయతో మార్మోగింది.

అభిమానుల మనసులను తాకిన మెస్సీ మాటలు

భారీ సంఖ్యలో హాజరైన అభిమానులను ఉద్దేశించి, స్పానిష్‌లో మెస్సీ మాట్లాడారు. ఈ కొన్ని రోజుల్లో భారత్‌లో నాకు లభించిన ప్రేమకు, ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ పర్యటన చిన్నదైనా చాలా అందమైన అనుభవం. ఇంత ప్రేమ ఉందని తెలుసు కానీ, నేరుగా అనుభవించడం అద్భుతంగా అనిపించింది. మేం ఈ ప్రేమను మా హృదయాల్లో పెట్టుకుని వెళ్తున్నాం. ఒకరోజు మ్యాచ్ ఆడేందుకు అయినా, మరో సందర్భంలో అయినా, మేము ఖచ్చితంగా భారత్‌కు తిరిగి వస్తాం. భాష అర్థం కాకపోయినా, అతని మాటల్లోని భావోద్వేగం అభిమానుల్లో ఉప్పొంగింది.

స్టేడియంలో ఉత్సాహం

సుమారు 25,000 మంది ప్రేక్షకుల రాకతో స్టేడియం నిండిపోయింది. అర్జెంటీనా జట్టు నీలం-తెలుపు జెర్సీపై నంబర్ 10 ధరించిన అభిమానులు, నిరంతరం మెస్సీ… మెస్సీ అంటూ నినాదాలు చేశారు. మెస్సీ తన ఇంటర్ మయామీ సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్తో కలిసి మైదానం చుట్టూ తిరుగుతూ అభిమానులకు అభివాదం చేశారు. అప్పుడప్పుడు బంతిని స్టాండ్స్‌లోకి పంపుతూ ప్రేక్షకులను మరింత ఉత్సాహపరిచారు.

కోల్ కతాలో తొలి రోజు అధిక జన సమూహం, రాజకీయ నేతల గందరగోళం వల్ల అభిమానులకు సరిగా అభివాదం చేయలేకపోయిన మెస్సీ, ఢిల్లీలో మాత్రం స్వేచ్ఛగా అభిమానులతో మమేకమయ్యాడు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఐసీసీ చైర్మన్ జై షా, భారత మాజీ ఫుట్‌బాల్ కెప్టెన్ బైచుంగ్ భూటియా హాజరయ్యారు. ఈ సందర్భంగా జై షా, మెస్సీకి భారత క్రికెట్ జట్టు నంబర్ 10 జెర్సీని అందజేశారు. సువారెజ్‌కు నంబర్ 9, డి పాల్‌కు నంబర్ 7 జెర్సీలు అందించారు. మెస్సీ, మినర్వా అకాడమీ జట్టును సత్కరించి, చిన్నారులతో కలిసి ఫుట్‌బాల్ ఆడి, వారితో ఫోటోలు దిగారు.

అభిమానులకు మరిచిపోలేని రోజు

ఈ రోజు చాలామందికి కేవలం ఒక ఈవెంట్ కాదు… ఒక యాత్ర. అమోగ్, అర్నవ్ పురోహిత్ అన్నదమ్ములు స్టేడియానికి వచ్చిన వేల మందిలో ఉన్నారు. ఇది మా కల జీవితంలో నిజమైన క్షణం. మెస్సీని ప్రత్యక్షంగా చూడటం అద్భుతం. మ్యాచ్ ఆడితే ఇంకా బాగుండేదని అమోగ్ అన్నాడు. అభిమానులు దాదాపు ఐదు గంటలు వేచి ఉండి, మెస్సీని కేవలం కొద్ది సేపే చూసినా సంతృప్తి వ్యక్తం చేశారు. అర్నవ్ అయితే ప్రత్యేకంగా బెంగళూరు నుంచి విమానంలో వచ్చాడు. మెస్సీ కోసం మేమేం చేయడానికైనా సిద్ధం అని భావోద్వేగంగా చెప్పాడు. గోల్ చూడలేకపోయినా, ఎడమ పాద మాయను ప్రత్యక్షంగా చూడలేకపోయినా, మెస్సీని చూడటం చాలూ అని చాలా మంది భావించారు.

షెడ్యూల్ లో మార్పులు

మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా ముంబైలో ఉన్న మెస్సీ, ఢిల్లీకి రావాల్సిన విమానం పొగమంచు కారణంగా ఆలస్యమైంది. ఉదయం 10:45కి రావాల్సిన విమానం, చివరకు మధ్యాహ్నం 2:30కి ఢిల్లీ ఇందిరాగాంధీ విమానాశ్రయానికి చేరింది. అక్కడి నుంచి నేరుగా లీలా ప్యాలెస్ హోటల్కు వెళ్లి, ఎంపిక చేసిన అతిథులతో ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గాలి నాణ్యతపై నినాదాలు

ఇదిలా ఉండగా, ఢిల్లీలో ఉదయం ఏక్యూఐ 452కు చేరుకోవడంతో, సీఎం రేఖా గుప్తా స్టేడియానికి వచ్చిన సమయంలో కొందరు అభిమానులు ఏక్యూఐ..ఏక్యూఐ అంటూ నినాదాలు చేయడం గమనార్హం.

మీ ప్రేమ అద్భుతం:మెస్సీ - Tholi Paluku