Let's talk: editor@tmv.in
మీ ప్రభుత్వాన్ని పడగొట్టండి.. ఇరాన్‌ ప్రజలకు నెతన్యాహు పిలుపు

మీ ప్రభుత్వాన్ని పడగొట్టండి.. ఇరాన్‌ ప్రజలకు నెతన్యాహు పిలుపు

Shaik Mohammad Shaffee
2 మార్చి, 2026

మధ్యప్రాచ్యంలో ముదిరిన యుద్ధం ఇప్పుడు ఇరాన్ అంతర్గత రాజకీయాలను మార్చే దిశగా సాగుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హతమార్చినట్లు అధికారికంగా ప్రకటించిన ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్), ఇప్పుడు ఆ దేశ ప్రజలను తిరుగుబాటుకు ప్రేరేపిస్తోంది. ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు పర్షియన్ భాషలో ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ, ఇరాన్ ప్రజలు తమపై ఉన్న 'నిరంకుశత్వపు సంకెళ్లను' తెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఇది తరానికి ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశమని, ప్రభుత్వం కూలిపోయే సమయం దగ్గరకు వచ్చిందని, ప్రజలందరూ ఏకమై తమ భవిష్యత్తును కాపాడుకోవాలని ఆయన ఉద్ఘాటించారు. "మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సహాయం ఇప్పుడు వచ్చింది. ఇది మీ చారిత్రక బాధ్యత" అని నెతన్యాహు పేర్కొన్నారు.

నెతన్యాహు వ్యాఖ్యలకు బలాన్నిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కీలక ప్రకటన చేశారు. శనివారం నాటి వైమానిక దాడుల అనంతరం ఇరాన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్, "మేము మా పని పూర్తి చేసిన తర్వాత, మీ పాలనను మీ చేతుల్లోకి తీసుకోండి. తరతరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ గొప్ప అవకాశాన్ని వదులుకోవద్దు" అని సూచించారు. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా జరిపిన ఈ దాడులు కేవలం సైనికపరమైనవి మాత్రమే కాకుండా, ఇరాన్‌లో అధికార మార్పిడిని కూడా ఆశిస్తున్నట్లు ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. ఇరాన్ పౌరులు తమ పాలకులకు వ్యతిరేకంగా వీధుల్లోకి రావాలని అగ్రదేశం గట్టిగా కోరుతోంది.

మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఈ దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమేనీని హతమార్చడం కేవలం ఇరాన్‌పై దాడి మాత్రమే కాదని, ఇది 'ముస్లింలందరిపై జరిగిన యుద్ధ ప్రకటన' అని ఆయన అభివర్ణించారు. ఖమేనీ మృతికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవడం తమ 'చట్టబద్ధమైన హక్కు, బాధ్యత' అని ఆయన స్పష్టం చేశారు. ఈ గొప్ప లక్ష్యాన్ని సాధించడానికి తాము ఎంతటి త్యాగానికైనా సిద్ధమని టెహ్రాన్ ప్రకటించింది. ఇరాన్ జాతీయ భద్రతా మండలి అధిపతి అలీ లారిజానీ కూడా సోషల్ మీడియా వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శనివారం ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు కొంత మేర నష్టాన్ని కలిగించిన మాట నిజమేనని ఒప్పుకుంటూనే, "ఈరోజు మేము చూపించబోయే శక్తిని వారు తమ జీవితంలో ఎప్పుడూ అనుభవించి ఉండరు" అని అత్యంత తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు.