
మీ ప్రత్యేకతను చాటుకున్నప్పుడే విజయం: హైడ్రా కమిషనర్
ఎంతో కష్టపడి గ్రూప్-1 అధికారులగా ఎంపికైన వారు తమ విధుల్లో ప్రత్యేకతను చాటుకోవాలని, ప్రజాప్రయోజనమే పరమావధిగా పనిచేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పిలుపునిచ్చారు. శుక్రవారం డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణలో ఉన్న గ్రూప్-1 కేడర్ అధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్న అధికారులు తమ తమ విభాగాల్లో నిబద్ధతతో పని చేసి మంచి పరిపాలన అందించాలని ఆయన తెలిపారు. ప్రతి చర్య పారదర్శకంగా ఉండాలని, ప్రజాప్రయోజనమే ఎల్లప్పుడూ కేంద్రబిందువుగా ఉండాలని పేర్కొన్నారు. ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తే పరిపాలన సులభమవుతుందని, వారి మద్దతు కూడా లభిస్తుందని ఆయన చెప్పారు.
హైడ్రా ప్రారంభ దశలో ఎదురైన సవాళ్లను వివరిస్తూ, ఆ సంస్థపై మొదట నెగిటివ్ అభిప్రాయం ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుతం పరిస్థితి మారిందన్నారు. ప్రారంభంలో 70 శాతం నెగిటివిటీ ఉండగా, ఇప్పుడు 85 శాతం మంది సానుకూల దృక్పథంతో ఉన్నారని చెప్పారు. ప్రజలకు అర్థమయ్యే విధంగా కార్యాచరణ చేపట్టడం, గ్రౌండ్ స్థాయిలో ఫలితాలు చూపించడం వల్లే ఇది సాధ్యమైందని ఆయన తెలిపారు.
చట్టాలు రూపొందించడం మాత్రమే కాకుండా వాటి అమలుపై దృష్టి పెట్టాలని ఆయన స్పష్టం చేశారు. గతంలో ఉల్లంఘనలు స్పష్టంగా కనిపించినప్పటికీ చర్యలు తీసుకోకపోయే పరిస్థితి ఉండేదని, హైడ్రా ఆ విధానాన్ని మార్చిందన్నారు. చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు, కాలువల శుభ్రత వంటి కార్యక్రమాల ద్వారా నగరంలో వరద ముప్పును తగ్గించగలిగామని వివరించారు.
ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం ద్వారా పరిపాలన సులభతరం అవుతుందని ఆయన సూచించారు. ప్రజావాణి వంటి వేదికలు దీనికి ఉపయోగకరమని పేర్కొన్నారు. తమ బాధ్యతలను నిబద్ధతతో స్వీకరించి పనిచేస్తే ప్రతి అధికారి తన విభాగంలో కొత్త చరిత్ర సృష్టించగలడని రంగనాథ్ అన్నారు.
