Let's talk: editor@tmv.in
మీరు సర్వస్వం పొగొట్టుకున్నా.. ధైర్యాన్ని కోల్పోలేదు:ప్రియాంకగాంధీ

మీరు సర్వస్వం పొగొట్టుకున్నా.. ధైర్యాన్ని కోల్పోలేదు:ప్రియాంకగాంధీ

Pinjari Chand
27 ఫిబ్రవరి, 2026

వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తన సోదరుడు, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి ముండక్కై–చూరల్‌మల వరద, కొండచరియలు విరిగిపడి సర్వం కోల్పోయిన బాధితుల కోసం కాంగ్రెస్ పార్టీ నిర్మించనున్న ఇళ్లకు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె బాధితులను ఉద్దేశించి భావోద్వేగంగా ప్రసంగించారు. ఈ భయంకర విపత్తు మీ పై పడింది. నేను ఆ రోజు ఇక్కడికి వచ్చి చూసిన దృశ్యాలు ఎప్పటికీ మర్చిపోలేను. మీరు మీ ఇళ్లు, కుటుంబాలు, పాఠశాలలు, వ్యాపారాలు అన్నీ కోల్పోయారు. కానీ మీరు కోల్పోని ఒక్క విషయం మీ ధైర్యం, మీ ఆత్మగౌరవమని పేర్కొన్నారు. మతం, వర్గ భేదాలు పక్కనపెట్టి ఒకరికి ఒకరు తోడుగా నిలిచిన వయనాడ్ ప్రజల ఐక్యత తనను ఎంతో కదిలించిందని ఆమె అన్నారు. అప్పుడు నేను మీ ఎంపీ కాదు. ఇప్పుడు మీ ఎంపీనే కాదు, మీ కుమార్తె, మీ సోదరి, మీ కుటుంబ సభ్యురాలిని కూడా అని చెప్పారు. విపత్తు తర్వాత బాధితులు ఎదుర్కొన్న కష్టాలను ఆమె గుర్తుచేశారు. ప్రతి ఉదయం మీకు ప్రియమైన వారిని కోల్పోయిన బాధతోనే మొదలైంది. అద్దె ఇళ్లలో జీవించాల్సి వచ్చింది. ఒకప్పుడు వ్యవసాయం చేసుకున్న వారు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. తన కుటుంబాన్ని కోల్పోయినా ఇతరులకు సహాయం చేయాలనుకునే యువకులను నేను కలిశాను అని పేర్కొన్నారు.

భూస్ఖలనం(కొండలు, ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న మట్టి, రాళ్లు, చెట్లు వంటివి ఒక్కసారిగా జారి కిందకు పడిపోవడం) ‘జాతీయ విపత్తు’గా ప్రకటించాలని పార్లమెంట్‌లో తమ పార్టీ డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, హోం మంత్రిని కలిసి వినతి పత్రాలు అందించామని తెలిపారు. వివిధ రాజకీయ పార్టీలూ ఈ సమయంలో సహకరించాయని చెప్పారు.

ఇళ్ల నిర్మాణ ప్రాజెక్ట్ వివరాలు వెల్లడిస్తూ మేము 100 ఇళ్ల నిర్మాణానికి కట్టుబడ్డాం. ప్రతి లబ్ధిదారుడికి 1,100 చదరపు అడుగుల ఇల్లు, 8 సెంట్ల భూమితో ఇవ్వడం లక్ష్యం. కున్నంబట్ట, మెప్పాడి పంచాయతీలో భూమి కొనుగోలు పూర్తయింది. మొత్తం 3 ఎకరాలు 24.5 సెంట్లు ఇప్పటికే సేకరించాం. మరో 2 ఎకరాలు 18 సెంట్లు కొనుగోలు ప్రక్రియలో ఉన్నాయని వివరించారు. ఈ ప్రాజెక్ట్‌ను భూస్ఖలనం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి అంకితం చేస్తూ మీరు మాకు కుటుంబసభ్యులే. మీ జీవితాల పునర్నిర్మాణం పూర్తయ్యే వరకు మేము మీతో ఉంటామని హామీ ఇచ్చారు. గత సంవత్సరం జూలై 30న కేరళలో సంభవించిన ఘోర భూస్ఖలనం సుమారు 300 మందిని బలి తీసుకుంది. అనేక ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి. అనంతరం ఉన్నత విద్య కోసం బాధితులకు స్కాలర్‌షిప్‌లను కూడా ప్రారంభించారు.

సభలో రాహుల్ గాంధీ సోదరి గురించి సరదా వ్యాఖ్యలు

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వయనాడ్ భూస్ఖలనం బాధితుల కోసం పార్టీ నిర్మిస్తున్న ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని, తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా గురించి సరదా సంఘటనను పంచుకున్నారు. తాను 22 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని పేర్కొన్న ఆయన, రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత భావాలను కూడా పారదర్శకంగా పంచుకోవాలని నమ్ముతున్నానన్నారు. వయనాడ్ ప్రజలను తన కుటుంబ సభ్యులుగా భావిస్తున్నానని చెప్పారు.

ఈ సందర్భంగా సోదరి గురించి ఓ చిన్న సంఘటనను వివరించారు. మేమిద్దరం చిన్న చిన్న విషయాలపై వాదిస్తుంటాం. నిన్న ఆమె నాతో మాట్లాడలేదు. తర్వాత అమ్మను కలిసినప్పుడు, ‘నీ సోదరి ఎలా ఉంది?’ అని అడిగారు. నేను ఆమె నాపై కోపంగా ఉంది, మాట్లాడటం లేదన్నాను అని తెలిపారు. వయనాడ్ ప్రయాణం గురించి మాట్లాడుతుండగా ఆమెను నేను ‘ట్రాప్’ చేశాను. ఎందుకంటే ఆమె వయనాడ్‌కు వస్తోంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాతో మాట్లాడకుండా ఉండలేరని తల్లితో అన్నట్లు వివరించారు. ఉదయం విమానంలో కలిసినప్పుడు కూడా ఆమె కొంచెం కోపంగానే కనిపించిందని, కానీ వయనాడ్‌కు చేరుకున్న తర్వాత మాట్లాడడం ప్రారంభించిందని చెప్పారు. ఇదే వయనాడ్ మాయ అని ఆయన చమత్కరించారు.

మీరు సర్వస్వం పొగొట్టుకున్నా.. ధైర్యాన్ని కోల్పోలేదు:ప్రియాంకగాంధీ - Tholi Paluku