Let's talk: editor@tmv.in
మీరు బ్రిటిషర్లకు పని చేస్తుంటే..మా నాయకులు 'వందేమాతరం' పాడుతూ జైలుకు వెళ్లారు: ఖర్గే

మీరు బ్రిటిషర్లకు పని చేస్తుంటే..మా నాయకులు 'వందేమాతరం' పాడుతూ జైలుకు వెళ్లారు: ఖర్గే

Pinjari Chand
10 డిసెంబర్, 2025

దేశ ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలపై చర్చించి వాటి పరిష్కారాలకోసం కృషి చేసినప్పుడే భారతమాతకు నిజమైన గౌరవం ఇచ్చినట్లవుతుందని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. వెస్ట్ బెంగాల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వందే మాతరం చర్చ తీసుకొచ్చారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఆయన విమర్శలు గుప్పించారు. వందే మాతరం 150 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా రాజ్యసభలో జరిగిన ప్రత్యేక చర్చలో పాల్గొన్న ఖర్గే, దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పతనం వంటి ఆర్థిక సవాళ్ల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ చర్చ నిర్వహించారని ఆరోపించారు.

తన ప్రసంగంలో ఖర్గే అంతర్జాతీయ వ్యవహారాలను ప్రస్తావిస్తూ, పక్క దేశాల్లో చైనా ప్రభావం పెరుగుతుంది, భారత్ ప్రభావం తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 56 ఇంచుల ఛాతి ఉన్నా… చైనాపై ఒక్క మాట మాట్లాడలేకపోతే ప్రయోజనం ఏమిటి? అని చురక​ అంటించారు. యూపీఏ హయాంలో డాలర్‌కు రూపాయి విలువ రూ.55–60 ఉండేదని, ఇప్పుడు రూ.90 వరకు పడిపోయిందని చెప్పారు. ఇది హిమాలయాల నుంచి కిందపడినట్టే అని విమర్శించారు.

బిజేపీ అభ్యంతరం – చర్చను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ

ఖర్గే వ్యాఖ్యలపై ప్రభుత్వం నుంచి గట్టి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వందే మాతరం చర్చలో ఆర్థిక వ్యవహారాలు ఎందుకొస్తాయి? తప్పుదారి పట్టించొద్దు. ఆర్థిక చర్చకు వేరే సమయం పెడదాం అని రాజ్యసభ నాయకుడు జేపీ నడ్డా అన్నారు. అధికార పార్టీలోని సభ్యులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేయడంతో సభలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. సభాపతి సీఎస్ రాధాకృష్ణన్ కూడా ఖర్గేను విషయానికి పరిమితమవాలని సూచించారు.

ఇదే సందర్భంగా వందే మాతరం చర్చకు రాజకీయ కోణం లేదంటూ అమిత్ షా తెలిపారు. ఈ చర్చను పశ్చిమ బెంగాల్ ఎన్నికలతో అనుసంధానం చేయడం తప్పు. వందే మాతరం దేశభక్తి, బాధ్యతను మేలుకొలిపే అమర గీతం అని అన్నారు. ఇలాంటి చర్చలకు రాజకీయ అన్వయం కల్పించేవారు తమ అర్థాన్ని మళ్లీ పరిశీలించాలని అమిత్ షా వ్యాఖ్యానించారు. కొంతమంది ప్రతిపక్ష సభ్యులు ఈ చర్చ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో తెరపైకి వచ్చినది అని పేర్కొనగా, షా వారి భావనను తోసిపుచ్చారు.

నెహ్రుపై విమర్శలు: బిజేపీని తప్పుపట్టిన ఖర్గే

వందే మాతరం రెండు పాదాలతోనే జాతీయ గేయంగా అంగీకరించిన నిర్ణయాన్ని విమర్శిస్తూ ఉన్న బిజేపీపై ఖర్గే ప్రతిస్పందించారు. ఆ నిర్ణయం జవహర్‌లాల్ నెహ్రూ ఒంటరిగా తీసుకోలేదని, గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, మదన్ మోహన్ మాలవీయ, జెబీ కృపాలనీ, రవీంద్రనాథ్ ఠాగూర్ పాల్గొని సంయుక్తంగా తీసుకున్న నిర్ణయమని చెప్పారు. దేశభక్తి మా రక్తంలో ఉంది. బ్రిటిష్‌లకు సేవలు చేసిన మీరు నేర్పాలా? అని ధ్వజమెత్తారు. తన ప్రసంగాన్ని వందే మాతరం నినాదంతో ప్రారంభించిన ఖర్గే, స్వాతంత్ర్య సమర చరిత్రను ప్రస్తావిస్తూ బిజేపీపై దుమ్మెత్తిపోశారు.

1921 సహయ నిరాకరణ ఉద్యమ సమయంలో లక్షలాది మంది కాంగ్రెస్ స్వాతంత్ర్య సమరయోధులు వందే మాతరం నినాదాలతో జైలుకెళ్లినపుడు, బీజేపీ భావజాల పూర్వీకులు బ్రిటిష్‌లకు సహకరించడం జరిగిందని ఆయన ఆరోపించారు. కానీ అప్పుడే మీరు బ్రిటిష్‌ల కోసం పనిచేస్తూ ఉన్నారు. మీ చరిత్ర అదే అని మండిపడ్డారు. వందేమాతరాన్ని స్వాతంత్ర్య సమరంలో జాతీయ నినాదంగా మలిచింది కాంగ్రెసే అని ఆయన గుర్తు చేశారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తరచూ జవహర్‌లాల్ నెహ్రూను అవమానించే ప్రయత్నం చేస్తారని, హోం మంత్రి అమిత్ షా కూడా అదే దారిలో నడుస్తున్నారని ఆరోపించారు.

దేశాన్ని నిర్మించిన నేతలను గౌరవించడం నేర్చుకోండి

మీ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి జాతీయ నాయకులపై అబద్ధాలు ప్రచారం ఆపండి.

రాజ్యాంగం నిర్మించిన, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన నేతలను గౌరవించడం నేర్చుకోండి అని కవిత్వంతో ముగించారు. ఎన్నికలు వచ్చి పోతూనే ఉంటాయి. వందే మాతరాన్ని రాజకీయాలకు ఉపయోగించొద్దు అని అన్నారు.

మీరు బ్రిటిషర్లకు పని చేస్తుంటే..మా నాయకులు 'వందేమాతరం' పాడుతూ జైలుకు వెళ్లారు: ఖర్గే - Tholi Paluku