Let's talk: editor@tmv.in
మీరాలం చెరువులో చిక్కుకున్న వారిని రక్షించిన హైడ్రా

మీరాలం చెరువులో చిక్కుకున్న వారిని రక్షించిన హైడ్రా

Gaddamidi Naveen
28 జనవరి, 2026

హైదరాబాద్‌, పాతబస్తీ జూ పార్కు స‌మీపంలోని మీరాలం చెరువులో పడవ ఇంజిన్ పనిచేయక మధ్యలో చిక్కుకున్న 9 మంది కార్మికులు, ఇంజినీర్లను హైడ్రా విపత్తు నిర్వహణ బృందం అర్ధరాత్రి చేపట్టిన సాహసోపేత రక్షణ చర్యలో సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకోగా, సోమవారం అర్ధరాత్రి వరకు సాగిన ఆపరేషన్ విజయవంతమైంది.

ప్రతిపాదిత వంతెన నిర్మాణానికి సంబంధించిన మట్టి పరీక్షల కోసం కార్మికులు, ఇంజినీర్లు ఆదివారం పడవలో మీరాలం ట్యాంక్ మధ్యభాగానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా పడవ ఇంజిన్ అకస్మాత్తుగా పనిచేయకపోవడంతో వారు చెరువు మధ్యలోనే చిక్కుకున్నారు. సమస్యను పరిష్కరించేందుకు ఒక మెకానిక్‌ను సంప్రదించగా, పడవను ఒడ్డుకు తీసుకువస్తేనే మరమ్మతులు చేయగలమని సూచించాడు.

దీంతో కార్మికులు చేతులతో పడవను నెట్టుకుంటూ ఒడ్డుకు చేరేందుకు ప్రయత్నించారు. అయితే చెరువులో విస్తరించిన నీటి కలుపు కారణంగా పడవ ముందుకు కదలలేకపోయింది. చీకటి పడటంతో పాటు, ఈ చెరువులో మొసళ్లు ఉన్నాయన్న భయంతో వారి ఆందోళన మరింత పెరిగింది. ఈ పరిస్థితిలో వారు ‘డయల్ 100’కు ఫోన్ చేసి సహాయం కోరారు.

సమాచారం అందుకున్న హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కంట్రోల్ రూమ్ వెంటనే స్పందించింది. చిక్కుకున్న వారితో మాట్లాడి ధైర్యం చెప్పిన డీఆర్ఎఫ్ అధికారులు తక్షణమే రక్షణ ఆపరేషన్ ప్రారంభించారు. టార్చ్ లైట్లు తీసుకుని పడవలో బయల్దేరిన డీఆర్ఎఫ్ బృందం, మొబైల్ ఫోన్ ఫ్లాష్ లైట్లతో సంకేతాలు ఇచ్చిన కార్మికుల వద్దకు చేరుకుంది.

మొదటి ప్రయాణంలో నలుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చగా, అనంతరం మిగిలిన ఐదుగురిని కూడా ఎలాంటి ప్రమాదం లేకుండా రక్షించారు. అర్ధరాత్రి సమయంలో ప్రాణాపాయం నుంచి బయటపెట్టిన హైడ్రా బృందానికి కార్మికులు, ఇంజినీర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనలో హైడ్రా సిబ్బంది సమయోచిత స్పందన, సమన్వయం ప్రశంసనీయమని అధికారులు పేర్కొన్నారు.

ఈ ఘటనపై ‘ఎక్స్’ వేదికగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, నగరంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణతో పాటు విపత్తుల సమయంలో స్పందించడంలో హైడ్రా చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు కీలకమైన సరస్సులు సహా ప్రజా ఆస్తులను కాపాడాలన్న రాష్ట్ర ప్రభుత్వ దృక్పథాన్ని హైడ్రా సమర్థవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. అనూహ్య పరిస్థితుల్లో మీరాలం ట్యాంక్‌లో చిక్కుకున్న ఇంజినీర్లు, కార్మికుల ప్రాణాలను కాపాడిన హైడ్రా సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. రక్షించబడిన కార్మికులు, ఇంజినీర్లు అర్ధరాత్రి సమయంలో తమను సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన హైడ్రా బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.