
మీరాబాయి చానుకు రజతం
భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్, ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను ప్రపంచ వేదికపై మరోసారి మెరిసింది. నార్వేలోని ఫోర్డ్‌లో జరుగుతున్న ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్ (డబ్ల్యూడబ్ల్యూసీ) 2025లో మహిళల 48 కేజీల విభాగంలో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 199 కేజీల (స్నాచ్‌లో 84 కేజీలు + క్లీన్ అండ్ జర్క్‌లో 115 కేజీలు) బరువు ఎత్తి చాను ఈ ఘనత సాధించింది.
ఒలింపిక్స్.కామ్ ప్రకారం, 48 కేజీల విభాగంలో ఉత్తర కొరియాకు చెందిన రి సాంగ్-గమ్ అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. రి సాంగ్-గమ్ స్నాచ్‌లో 91 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 122 కేజీలు ఎత్తి, మొత్తం 213 కేజీల బరువుతో స్వర్ణాన్ని దక్కించుకుంది. థాయిలాండ్‌కు చెందిన థన్యథాన్ సుక్చరోయెన్ 198 కేజీల మొత్తంతో కాంస్య పతకం గెలుచుకుంది.
మీరాబాయి చాను స్నాచ్ విభాగంలో 87 కేజీలను రెండుసార్లు ఎత్తడంలో విఫలమైనప్పటికీ, క్లీన్ అండ్ జర్క్‌లో తన అనుభవాన్ని ప్రదర్శించింది. ఆమె 109 కేజీలు, 112 కేజీలు, 115 కేజీలను విజయవంతంగా ఎత్తింది. 115 కేజీల క్లీన్ అండ్ జర్క్ లిఫ్ట్, ఆమె టోక్యో ఒలింపిక్స్‌లో రజతం గెలిచినప్పుడు ఎత్తిన బరువుకు సమానం కావడం విశేషం.
పారిస్ 2024 ఒలింపిక్స్ తర్వాత అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్ 49 కేజీల విభాగాన్ని తొలగించడంతో, చాను కొత్తగా ప్రవేశపెట్టిన 48 కేజీల విభాగంలో పోటీపడ్డారు. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో 48 కేజీల విభాగంలో బంగారు పతకం గెలిచి తిరిగి ఫామ్‌లోకి వచ్చిన చాను, ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం గెలుచుకున్నారు. 2017లో 48 కేజీల విభాగంలో చాను ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను, 2022లో బోగోటాలో జరిగిన పోటీల్లో 49 కేజీల విభాగంలో రజత పతకాన్ని గెలుచుకుంది.
ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేత లవ్‌ప్రీత్ సింగ్ పురుషుల బృందానికి నాయకత్వం వహిస్తున్నాడు. ఈ టోర్నమెంట్ వచ్చే ఏడాది గ్లాస్గోలో జరిగే కామన్వెల్త్ గేమ్స్ 2026కు క్వాలిఫైయింగ్ ఈవెంట్‌గా కూడా ఉపయోగపడుతుంది.
డబ్ల్యూడబ్ల్యూసీలో భారత బృందం
మహిళలు: మీరాబాయి చాను (48 కేజీలు), కోయెల్ బార్ (53 కేజీలు), బింద్యారాణి దేవి సోరోఖైబామ్ (58 కేజీలు), నిరుపమ దేవి సెరామ్ (63 కేజీలు), హర్జిందర్ కౌర్ (69 కేజీలు), వంశిత వర్మ (86 కేజీలు), మెహక్ శర్మ (86 కేజీలు+)
పురుషులు: రిషికాంత సింగ్ చనంబామ్ (60 కేజీలు), ముత్తుపాండి రాజా (65 కేజీలు), అజిత్ నారాయణ (71 కేజీలు), అజయ బాబు వల్లూరి (79 కేజీలు), అభిషేక్ నిపానే (88 కేజీలు), దిల్బాగ్ సింగ్ (94 కేజీలు), లవ్‌ప్రీత్ సింగ్ (110 కేజీలు+)
