
మీరట్‌లో అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరంలోని లిసాడీ గేట్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుని ఐదుగురు చిన్నారులు సహా ఆరుగురు మృతి చెందారు. మరో మహిళ గాయాలతో చికిత్స పొందుతోంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం అవసరం లేదని కుటుంబ సభ్యులు లిఖితపూర్వకంగా తెలియజేశారు. మృతులను రుఖ్సార్ (25), మహబీష్ (12), హమ్మాద్ (4), అక్దస్ (4), నబియా (4 నెలలు), ఇనాయత్ (4 నెలలు)గా గుర్తించారు. వీరు కిద్వాయి నగర్‌లోని సురాహీ వాలి మసీదు సమీప గల్లీ నంబర్ 3లో నివసిస్తున్నారు. గాయపడిన అమీర్ బానో (55) చికిత్స పొందుతున్నారు.
మీరట్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అవినాష్ పాండే మీడియాతో మాట్లాడుతూ సోమవారం రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కాలిన గాయాలతో ఏడుగురిని సివిల్ ఆసుపత్రికి తరలించగా, అందులో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. సమాచారం అందుకున్న మూడు నిమిషాల్లోనే డయల్ 112 వాహనం ఘటనాస్థలికి చేరిందని, అనంతరం ఫైర్ టెండర్లు మోహరించామని చెప్పారు.
వీధులు చిన్నగా ఉండటంతో అగ్నిమాపక సిబ్బందికి పెద్ద సవాలు ఎదురైందని, మోటార్ సైకిళ్లను ఉపయోగించి సిబ్బంది లోపలికి వెళ్లాల్సి వచ్చిందని ఆయన వివరించారు. స్థానికులు కూడా సహాయపడుతూ మెట్ట ఏర్పాటు చేసి ఇళ్లలో చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నం చేశారని చెప్పారు. మంటలు పక్క ఇళ్లకు వ్యాపించకుండా అడ్డుకోవడమే ప్రధాన సవాలని ఎస్ఎస్పీ పేర్కొన్నారు. సోమవారం రాత్రి 8:49 గంటలకు ఇక్బాల్ అహ్మద్ నివాసంలో మంటలు చెలరేగినట్లు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. ఆ ఇంట్లో టైలరింగ్, ఆన్‌లైన్ గార్మెంట్స్ వ్యాపారం నిర్వహిస్తుండడంతో పెద్ద మొత్తంలో వస్త్రాలు నిల్వ ఉంచారు. దీంతో మంటలు వేగంగా వ్యాపించాయని చెప్పారు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణమని అనుమానం వ్యక్తం చేస్తూ, పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
జిల్లా కలెక్టర్ వీకే సింగ్ ఘటనాస్థలాన్ని పరిశీలించి ఇది హృదయ విదారకమైన, అత్యంత దురదృష్టకర సంఘటన అని వ్యాఖ్యానించారు. ఒక యంత్రం లేదా ఎలక్ట్రిక్ ఉపకరణంలో లోపం వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నామని చెప్పారు. విద్యుత్ శాఖ అధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారని తెలిపారు. మృతదేహాలకు పోస్టుమార్టం చేయవద్దని కుటుంబ సభ్యులు కోరారని, ఇప్పటివరకు ప్రభుత్వ సహాయం లేదా పరిహారం కోరలేదని కలెక్టర్ స్పష్టం చేశారు. చీఫ్ ఫైర్ ఆఫీసర్ సురేంద్ర సింగ్ మాట్లాడుతూ నాలుగు ఫైర్ టెండర్లు మోహరించామని, స్థానికుల సహాయంతో ఇంట్లో చిక్కుకున్న ఐదుగురిని రక్షించామని తెలిపారు.
కుటుంబ సభ్యుడు మహ్మద్ ఫరూఖ్ మాట్లాడుతూ, నమాజ్ కోసం వెళ్లిన సమయంలో అగ్నిప్రమాదం జరిగిందని తెలిపారు. నేను తిరిగి వచ్చే సరికి ఇంటి బయట పెద్ద ఎత్తున జనాలు గుమికూడి ఉన్నారు. ఈ మంటల్లో నా కుమార్తె, నా కుమారుడు, నా తమ్ముడి జంట కుమార్తెలు(కవలలు), అతని కుమారుడు మృతి చెందారు. నా వృద్ధ తల్లి ప్రాణాలతో బయటపడ్డారు, కానీ షాక్ కారణంగా ఆమెకు బీపీ పెరిగిందని తెలిపారు. ఎవరి మీదా ఫిర్యాదు చేయడం లేదని, పరిహారం కూడా కోరడం లేదని చెప్పారు. ఇక మరో బంధువు మాట్లాడుతూ, ఆన్‌లైన్ వ్యాపారం కోసం ఇంట్లో పెద్ద మొత్తంలో దుస్తులు నిల్వ ఉండటంతో మంటలు తీవ్రంగా వ్యాపించాయని చెప్పారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై స్పందిస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధితులకు తక్షణ సహాయక చర్యలు అందించేందుకు అధికారులను ఆదేశించినట్లు ప్రభుత్వ ప్రకటనలో పేర్కొన్నారు.
