
మీడియా స్వేచ్ఛ క్షీణిస్తోంది.. నిర్భయ జర్నలిజం అవసరం: కేటీఆర్
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన నవతెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవ వేడుకల్లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా “రాజ్యాంగం – ప్రజాస్వామ్యం – పత్రికా స్వేచ్ఛ” అంశంపై నిర్వహించిన సెమినార్‌లో ప్రసంగిస్తూ దేశంలో మీడియా స్వేచ్ఛ, జర్నలిజం పరిస్థితులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ముందుగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నవతెలంగాణకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో మీడియా స్వేచ్ఛ రోజురోజుకూ క్షీణిస్తోందని, అనేక మీడియా సంస్థలు తమ ఉనికిని కాపాడుకునే పరిస్థితిలో పనిచేస్తున్నాయని వ్యాఖ్యానించారు. వార్తను వార్తగా రాసే పరిస్థితి లేకుండా పోయిందని, తప్పు జరుగుతున్నా నిర్భయంగా రాయలేని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. నిజాలు చెప్పే వారిని జైళ్లకు పంపుతున్నారని, ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛకు ఎలాంటి పరిమితులు ఉండకూడదని పేర్కొన్నారు.
సోషల్ మీడియా వల్లే ప్రభుత్వాల్లో జవాబుదారీతనం పెరిగిందని కేటీఆర్ అన్నారు. సోషల్ మీడియా లేకపోతే ప్రభుత్వాల్లో చలనం వచ్చేది కాదని, కొత్త తరం ప్రశ్నించే సంస్కృతికి అది వేదికగా మారిందని చెప్పారు. ఢిల్లీలో యువత చేపట్టిన ఆందోళనలు కొత్త తరంలో ఉన్న నిబద్ధతను చాటాయని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారకపోతే రాజకీయ పార్టీలు, వ్యవస్థలు వెనుకబడిపోతాయని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వంలో ఉన్నవారు ముందుగా హేట్ స్పీచ్‌కు దూరంగా ఉండాలని, ఆ తర్వాతే హేట్ స్పీచ్‌పై చట్టాల గురించి మాట్లాడాలని కేటీఆర్ సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్‌ను తప్పనిసరిగా ఫ్యాక్ట్ చెక్ చేయాలని, మంచి విషయాన్ని మంచిగానే, చెడు విషయాన్ని చెడుగానే ప్రజలకు చూపించాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు.
గతంలో ప్రగతి భవన్‌లో 152 బెడ్‌రూమ్‌లు ఉన్నాయంటూ ప్రచారం చేశారని, రూ.84 వేల కోట్ల ప్రాజెక్టును రూ.లక్ష కోట్ల ప్రాజెక్టుగా చూపించారని, సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేశారంటూ ఆరోపణలు చేసినప్పటికీ విచారణలో వాటికి ఆధారాలు లేవని తేలిందని కేటీఆర్ పేర్కొన్నారు. లగచర్ల ఘటన, హెచ్‌సీయూ భూముల వివాదం, కేంద్రమంత్రి కుమారుడిపై నమోదైన పోక్సో కేసు వంటి అంశాలకు ప్రధాన మీడియా తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు స్వేచ్ఛాయుత మీడియా, నిర్భయ జర్నలిజం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు.
