
"మీటర్ చెక్ చేశారు.. మరి 'సెబీ చెక్' చేశారా?
నేటి డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ ఆర్థిక మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో, పెట్టుబడిదారులను అప్రమత్తం చేసేందుకు భారత సెక్యూరిటీల మార్కెట్ నియంత్రణ సంస్థ (సెబీ), నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్‌డీఎల్ )తో కలిసి ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సెక్యూరిటీ మార్కెట్‌లో లావాదేవీలు చేసే ముందు వివరాలను సరిచూసుకోవాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఆటో రిక్షాల ద్వారా అవగాహన ప్రచారాన్ని ప్రారంభించారు.
"మీటర్ చెక్ చేశారా?" - వినూత్న నినాదంతో ప్రచారం
సాధారణ ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా "మీటర్ తో చెక్ కియా?" అనే నినాదాన్ని ఈ ప్రచారం కోసం ఎంచుకున్నారు. ఆటో ఎక్కినప్పుడు మీటర్ సరిగా ఉందో లేదో ఎలాగైతే చూస్తామో, అదేవిధంగా పెట్టుబడి పెట్టే ముందు "సెబీ చెక్" చేశారా? అని ప్రశ్నిస్తూ ఈ ప్రచారం సాగుతోంది. ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నిధులను బదిలీ చేసే ముందు పెట్టుబడిదారులు ఒక్క నిమిషం ఆగి, తాము పంపిస్తున్న వ్యక్తి లేదా సంస్థ అసలైనదా కాదా అని వెరిఫై చేసుకోవడం.
10 నగరాల్లో 1,000 ఆటో రిక్షాలు
ఈ భారీ ప్రచారం దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకేసారి ప్రారంభమైంది. ముంబై, ఢిల్లీ, పుణే, సూరత్, వారణాసి, గోరఖ్‌పూర్, కోయంబత్తూర్, ఇండోర్, పాట్నా, లక్నో వంటి నగరాల్లో సుమారు 1,000 ఆటో రిక్షాలను ఈ ప్రచారం కోసం సిద్ధం చేశారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో తిరిగే ఆటోల ద్వారా ఈ సందేశం సామాన్యులకు సైతం చేరువవుతుందని అధికారులు ఆశిస్తున్నారు.
క్యూఆర్ కోడ్, సెబీ చెక్ సౌకర్యం
ఈ ఆటోలపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌లను ముద్రించారు. ప్రయాణికులు తమ ఫోన్ ద్వారా ఈ కోడ్‌లను స్కాన్ చేస్తే, అవి నేరుగా సెబీ అధికారిక వెబ్‌సైట్ లేదా 'సెబీ సాథీ' యాప్‌కు తీసుకువెళ్తాయి. అక్కడ పెట్టుబడిదారులు సెబీలో రిజిస్టర్ అయిన మధ్యవర్తులు, వారి యూపీఐ ఐడీలు, బ్యాంక్ ఖాతా వివరాలను క్షణాల్లో తనిఖీ చేసుకోవచ్చు.
డిజిటల్ చెల్లింపుల భద్రత
ముఖ్యంగా అక్టోబర్ 2025 నుండి అమలులోకి వచ్చిన “వాలిడేటెడ్ యూపీఐ హ్యాండెల్స్" (ధ్రువీకరించబడిన యూపీఐ హ్యాండిల్స్) గురించి ఈ ప్రచారం వివరిస్తుంది. పెట్టుబడిదారులు పేమెంట్ చేసేటప్పుడు '@ వాలిడ్' అని ముగిసే యూపీఐ ఐడీలను మాత్రమే వాడాలని, లావాదేవీ సమయంలో ఆకుపచ్చ త్రిభుజంలో 'థమ్స్ అప్' గుర్తు కనిపిస్తేనే అది సురక్షితమైనదని సెబీ సూచిస్తోంది. ఈ చిన్న జాగ్రత్తల ద్వారా అమాయక పెట్టుబడిదారులు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా కాపాడవచ్చునని నియంత్రణ సంస్థ పేర్కొంది.
మల్టీలింగ్వల్ ఏఐ, భవిష్యత్తు ప్రణాళిక
ఆటో రిక్షా ప్రచారంతో పాటు, సెబీ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వాయిస్ కాల్ క్యాంపెయిన్‌ను కూడా ముమ్మరం చేసింది. 1600-313-384 అనే అధికారిక నంబర్ ద్వారా ఇన్వెస్టర్లకు అవగాహన కల్పిస్తోంది. కేవలం ఆన్‌లైన్ ద్వారానే కాకుండా, ప్రజల మధ్య నిత్యం తిరిగే ఆటోల వంటి సాధనాల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించడం మార్కెట్ పట్ల నమ్మకాన్ని పెంచుతుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
