
మీకు అండగా ఉంటా : పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ గురువారం తన నియోజకవర్గం పిఠాపురం పరిధిలోని కాకినాడ జిల్లాలో పర్యటించారు. ముఖ్యంగా ఉప్పాడ తీరప్రాంత మత్స్యకారుల సమస్యలపై 'మాటా-మంతి' కార్యక్రమాన్ని నిర్వహించి, కాలుష్య సమస్యపై తీవ్రంగా స్పందించారు. పరిశ్రమల వ్యర్థాల వల్ల సముద్ర జలాలు కలుషితమై, మత్స్య సంపద దెబ్బతింటోందని మత్స్యకారులు వ్యక్తం చేసిన ఆందోళనపై ఆయన కాలుష్య ఆడిట్‌కు ఆదేశాలు జారీ చేశారు. 100 రోజుల్లో శాశ్వత పరిష్కారాలు తీసుకువచ్చేలా చర్యలు ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రమాదాల్లో మరణించిన 18 మత్స్యకార కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.90 లక్షల ఆర్థిక సాయాన్ని ఆయన స్వయంగా అందజేశారు. మధ్యాహ్నం ఉప్పాడలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మత్స్యకారులతో కలిసి సముద్ర పర్యటన చేసి సమస్యల తీవ్రతను ప్రత్యక్షంగా పరిశీలించారు. మత్స్యకారుల జీవనోపాధికి భరోసా ఇస్తూ పరిశ్రమలు-ప్రజల సమతుల్యతను నెలకొల్పుతామని ప్రకటించారు.
మత్స్యకారుల ఆందోళన
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉదయం 10 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీ, జనసేన నేతలు ఘన స్వాగతం పలికారు. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య ఆయన కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఉప్పాడ, కొణపాడ తీరప్రాంతాల నుంచి వచ్చిన మత్స్యకార ప్రతినిధులు, మత్స్య సంఘ నాయకులు, కమిటీ సభ్యులు, జిల్లా అధికారులతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దివీస్ ఫార్మా వంటి ఫార్మా పరిశ్రమల వ్యర్థాలు సముద్రాన్ని కలుషితం చేస్తున్నాయని దీనివల్ల చేపలు, కార్టిస్‌లు తగ్గిపోతున్నాయని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి జీవనోపాధి ప్రశ్నార్థకమవుతోందని తెలిపారు.
కాలుష్య నియంత్రణపై స్పష్టత
మత్స్యకారుల ఆందోళనపై తీవ్రంగా స్పందించిన పవన్ కల్యాణ్, పరిశ్రమలకు వ్యతిరేకం కానప్పటికీ, కాలుష్య నియంత్రణకు కట్టుబాటు తప్పనిసరని స్పష్టం చేశారు. పరిశ్రమలు, మత్స్యశాఖ, కాలుష్య నియంత్రణ మండలి ప్రతినిధులతో కూడిన కమిటీ పనిచేస్తోందని తెలిపారు. చేపల వేటలో ప్రమాదవశాత్తు మరణించిన 18 మత్స్యకారుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇస్తూ ఒక్కొక్క కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ. 90 లక్షల భీమా చెక్కులను ఆయన స్వయంగా అందజేశారు.
100 రోజుల్లో శాశ్వత పరిష్కార హామీ
కాలుష్య ఆడిట్ నివేదిక వచ్చిన వెంటనే పరిశ్రమలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, రాబోయే 100 రోజుల్లో కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారాలు తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం పవన్ కల్యాణ్ మత్స్యకారులు, నిపుణులతో కలిసి పడవలో సముద్రంలో ప్రయాణించి, కాలుష్య ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ఈ పరిశీలన ద్వారా సమస్యల తీవ్రతను ప్రత్యక్షంగా అంచనా వేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ఉప్పాడలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మత్స్య సంపద తగ్గడానికి కారణమైన వ్యర్థాల శుద్ధీకరణపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఉప్పాడ-కొణపాడ మధ్య తీర రక్షణ గోడల నిర్మాణానికి రూ.323 కోట్లతో కేంద్రం సానుకూలంగా ఉందని, ఈ నెల 14న సమావేశం జరుగుతుందని పనులు త్వరలో ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు. 7,193 మత్స్యకార కుటుంబాల జీవనోపాధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. చేపల వేటపై 7వేలకు పైగా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఏటా రూ.20 వేలు ఇస్తున్నామన్నారు. పరిశ్రమల వ్యర్థాల వల్ల మత్స్య సంపద తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పర్యటన ద్వారా మత్స్యకారులకు భరోసా కలిగించిన పవన్ కల్యాణ్, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ, అభివృద్ధి, ప్రజల మధ్య సమతుల్యతను సాధిస్తామని పునరుద్ఘాటించారు. అంతకుముందు సెప్టెంబర్ 24న మత్స్యకారుల ధర్నాకు స్పందించి ఇచ్చిన హామీల మేరకు గురువారం పర్యటించారు.
