Let's talk: editor@tmv.in
'మిస్సైల్ మ్యాన్'సేవలను కొనియాడిన నేతలు

'మిస్సైల్ మ్యాన్'సేవలను కొనియాడిన నేతలు

Dantu Vijaya Lakshmi Prasanna
28 జులై, 2026

భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహాయ పలువురు నేతలు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. దేశ శాస్త్ర, సాంకేతిక, రక్షణ రంగాల అభివృద్ధికి డాక్టర్ కలాం అందించిన అపూర్వ సేవలను గుర్తు చేసుకుంటూ, ఆయన ఆశయాలు, విలువలు, దేశభక్తి భావన నేటి తరానికి మార్గదర్శకాలని ముగ్గురు నేతలు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో స్పందిస్తూ, భారతదేశాన్ని శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచ దేశాల సరసన నిలిపేందుకు డాక్టర్ కలాం విశేష కృషి చేశారని కొనియాడారు. దేశ రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఆయన పోషించిన కీలక పాత్ర కారణంగానే ప్రపంచవ్యాప్తంగా "మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా"గా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయనకు నా ఘన నివాళులు” అని చంద్రబాబు తన సందేశంలో తెలిపారు.

అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్నప్పటికీ అత్యంత నిరాడంబరంగా జీవించిన మహనీయుడిగా కలాంను చంద్రబాబు అభివర్ణించారు. నిజాయితీ, క్రమశిక్షణ, మానవతా దృక్పథంతో కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని చూరగొన్న ఆయనను దేశం "ప్రజల రాష్ట్రపతి"గా చిరస్థాయిగా గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు. యువత పెద్ద కలలు కనాలని, ఆ కలలను నిజం చేసుకునేందుకు కృషి చేయాలని కలాం ఇచ్చిన సందేశం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా డాక్టర్ కలాంకు ఘన నివాళులు అర్పించారు. దేశ నిర్మాణం, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఆయన చేసిన విశిష్ట సేవలు భారతదేశ అభివృద్ధికి బలమైన పునాది వేశాయని కొనియాడారు.

“డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దేశ నిర్మాణం, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అందించిన విశిష్ట సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకం. ఆయన దూరదృష్టి, విలువలు, దేశభక్తి భావన ఎల్లప్పుడూ మనకు మార్గదర్శకంగా నిలుస్తాయి” అని జగన్ 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కూడా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయనకు వినమ్ర నివాళులు అర్పించారు. భారత అంతరిక్ష, క్షిపణి సాంకేతిక రంగాల అభివృద్ధిలో కలాం అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషి భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.

రాష్ట్రపతిగా, శాస్త్రవేత్తగా, ఉపాధ్యాయుడిగా డాక్టర్ కలాం ప్రదర్శించిన నిబద్ధత, కర్తవ్యనిష్ఠ, నిరాడంబర జీవనం, అసాధారణ ప్రతిభ ప్రతి భారతీయుడికి ఆదర్శప్రాయమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అచంచలమైన దేశభక్తి, యువతపై ఆయనకు ఉన్న అపారమైన విశ్వాసం, జ్ఞాన సమాజ నిర్మాణానికి చేసిన కృషి ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే పలువురు నేతలు సోషల్ మీడియా వేదికగా తమ నివాళులు అర్పించారు.

మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా

డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 2002 నుంచి 2007 వరకు భారతదేశ 11వ రాష్ట్రపతిగా సేవలందించారు. అంతకుముందు రక్షణ పరిశోధన, అంతరిక్ష రంగాల్లో ప్రముఖ శాస్త్రవేత్తగా పనిచేసి భారత క్షిపణి అభివృద్ధి కార్యక్రమానికి నాయకత్వం వహించారు. అగ్ని, పృథ్వీ వంటి క్షిపణుల అభివృద్ధిలో ఆయన చేసిన విశేష కృషి కారణంగా "మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా"గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

శాస్త్రవేత్తగానే కాకుండా గొప్ప విద్యావేత్తగా, దూరదృష్టి కలిగిన జాతీయ నాయకుడిగా కూడా డాక్టర్ కలాం విశేష గుర్తింపు పొందారు. దేశవ్యాప్తంగా విద్యార్థులను కలుసుకుంటూ విజ్ఞానం, సృజనాత్మకత, నైతిక విలువలు, దేశసేవ పట్ల యువతలో చైతన్యం నింపేందుకు నిరంతరం కృషి చేశారు. "ఇండియా 2020", "ఇగ్నైటెడ్ మైండ్స్", "వింగ్స్ ఆఫ్ ఫైర్" వంటి రచనల ద్వారా కోట్లాది మంది యువతకు స్ఫూర్తినిచ్చారు.

2015 జూలై 27న మేఘాలయలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం), షిల్లాంగ్‌లో విద్యార్థులకు ఉపన్యాసం ఇస్తున్న సమయంలో గుండెపోటుతో డాక్టర్ కలాం కన్నుమూశారు. చివరి క్షణం వరకు విద్యార్థులకు జ్ఞానాన్ని పంచుతూ, దేశ భవిష్యత్తు గురించి ఆలోచించిన మహనీయుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. శాస్త్ర విజ్ఞానం, దేశభక్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంను భారతదేశం ఎప్పటికీ గౌరవంతో స్మరించుకుంటూనే ఉంటుంది.