
మిర్చి, పామాయిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి: మంత్రి అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగుతున్న వ్యవసాయం ఇప్పుడు లాభసాటిగా మారుతోందని ముఖ్యంగా మిర్చి, పామాయిల్ రైతులకు ఈ ఏడాది మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. గత ఏడాది ధరల పతనంతో కుదేలైన మిర్చి రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరిపి మార్కెట్ ధరను ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. అయితే ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా మారిందని కూటమి ప్రభుత్వం తీసుకున్న సానుకూల నిర్ణయాలు, రైతులు చేపట్టిన పంటల వైవిధ్యీకరణ వల్ల ప్రస్తుతం మార్కెట్ నిలకడగా ఉందని రైతులు సంతోషంగా ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు. మార్కెట్‌లో అనవసర గందరగోళం సృష్టించే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని, అవసరమైనప్పుడు మాత్రమే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో మిర్చి సాగుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి వివరించారు. పల్నాడు, గుంటూరు, ప్రకాశం, కర్నూలు వంటి జిల్లాల్లో సుమారు 2.67 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు జరుగుతోందని, ఈ సీజన్‌లో 5.39 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. కేవలం విస్తీర్ణం పెంచడమే కాకుండా నాణ్యమైన దిగుబడి సాధించడమే లక్ష్యంగా రైతు సేవా కేంద్రాల ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. గతంలో క్వింటాల్ మిర్చి ధర రూ.12,500 నుంచి రూ.13,500 మధ్య ఉండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది రూ.15,000 నుంచి రూ.19,500 వరకు పలుకుతుండటం విశేషం అని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు ఆయిల్ పామ్ సాగులో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు కొనియాడారు. సుమారు 1.97 లక్షల మంది రైతులు 2.49 లక్షల హెక్టార్లలో పామాయిల్ సాగు చేస్తున్నారని, వీరికి గరిష్ట లాభం చేకూర్చేలా ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేషియో విధానాన్ని కచ్చితంగా అమలు చేస్తున్నామని చెప్పారు. దీనివల్ల గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా మెట్రిక్ టన్నుకు సగటున రూ.19,579 ధర లభిస్తోందని వెల్లడించారు. ఇప్పటికే రూ.134 కోట్లకు పైగా నిధులను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేశామని కొత్తగా సాగు విస్తరణకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన వివరించారు.
ఇదే సమయంలో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుపై మంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ధరలు తగ్గినప్పుడు రైతులకు భరోసా ఇవ్వాల్సింది పోయి జగన్ ఇచ్చే నెగిటివ్ స్టేట్‌మెంట్స్ వల్ల మార్కెట్ మరింత పతనమై రైతులు నష్టపోయారని ఆరోపించారు. జగన్ హయాంలో డ్రిప్ ఇరిగేషన్ రాయితీలను ఎగ్గొట్టి రైతులను వంచించారని కానీ కూటమి ప్రభుత్వం ఏటా లక్ష హెక్టార్లలో డ్రిప్ ఇరిగేషన్ అమలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని చెప్పారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా, ఉత్తరాంధ్రను కాఫీ, జీడి పంటల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు 'పూర్వోదయ' పథకం ద్వారా కేంద్ర నిధులతో భారీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు.
