Let's talk: editor@tmv.in
మిర్చి పంట తెగుళ్లు అత్యవసర చర్యలు ప్రారంభించండి: వ్యవసాయ శాఖ మంత్రి

మిర్చి పంట తెగుళ్లు అత్యవసర చర్యలు ప్రారంభించండి: వ్యవసాయ శాఖ మంత్రి

Panthagani Anusha
10 డిసెంబర్, 2025

మిర్చి పంట సాగు చేస్తున్న రైతులకు ఉపశమనం కలిగించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యవసర చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రంలో మిర్చి పంటపై నల్ల తామర పురుగు దాడి విస్తృతంగా కనిపిస్తున్న నేపథ్యంలో, దీనిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.

విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి ఉద్యానవన శాఖ డైరెక్టర్ డా.కె. శ్రీనివాసులుతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి, ప్రస్తుత పరిస్థితులపై పూర్తి నివేదికను వెంటనే సమర్పించాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా పురుగు ప్రభావం ఉన్న ప్రాంతాలకు శాస్త్రవేత్తలను వెంటనే క్షేత్రస్థాయికి పంపి, సమస్య తీవ్రతను అంచనా వేయాలని స్పష్టం చేశారు. మందుల పిచికారీపై శాస్త్రీయ సూచనలు, సాంకేతిక సలహాలు అందించేందుకు ప్రత్యేక బృందాలు పని చేయాలని మంత్రి సూచించారు.

రైతులకు ప్రత్యక్ష మార్గదర్శకత్వం

2021 నుంచి రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో మిరప పంటపై ఈ నల్ల తామర పురుగు దాడి జరుగుతున్న విషయాన్ని గుర్తు చేసిన మంత్రి, ఈ సమస్యపై గ్రామస్థాయి అవగాహన కార్యక్రమాలు, రైతు సేవా కేంద్రాల ద్వారా శిక్షణలు నిర్వహించాలని ఆదేశించారు. ఉద్యాన శాఖ సిబ్బందితో పాటు వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు క్షేత్ర సందర్శనలు చేపట్టి రైతులకు ప్రత్యక్ష మార్గదర్శకత్వం అందించాలని సూచించారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

నివారణ మార్గాలు

మిర్చి పంటలో నల్ల తామర పురుగు నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించాలి. అందులో భాగంగా, వేసవిలో లోతు దుక్కులు చేయడంతోపాటు, చివరి దుక్కిలో ఎకరాకు 200 కిలోల వేప చెక్కను వినియోగించాలి. సిఫారసు చేసిన మోతాదులోనే ఎరువులు వేస్తూ, తప్పనిసరిగా పంట మార్పిడి, పచ్చిరొట్ట పైర్లు వేయాలి. యాంత్రికంగా, సామూహికంగా ఎకరాకు 40 నుంచి 50 నీలి రంగు జిగురు అట్టలను ఏర్పాటు చేయాలి. రసాయన పద్ధతుల్లో వేప నూనె (10,000 పిపిఎం అయితే 1 మి.లీ/లీటరు చొప్పున) లేదా ఇతర సిఫారసు చేసిన మందులైన బ్రోప్లనిలైడ్ (34 మి.లీ), ప్లుక్సామెటామైడ్ (160 మి.లీ), ఫిప్రోనిల్ (40 గ్రా), స్పైరో టెట్రామాట (200 మి.లీ) (ఒక ఎకరానికి) మార్చి మార్చి పిచికారీ చేయాలని, విచక్షణారహితంగా సిఫారసు చేయని మందులు వాడకూడదని ఉద్యానవన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు రైతులకు సూచించారు.